తెలంగాణకు టేకాఫ్ టైం: నాలుగు కొత్త విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ -

తెలంగాణలో విమాన సేవల్లో విప్లవాత్మక మార్పు...

Update: 2025-10-14 05:25 GMT
తెలంగాణలో అందుబాటులోకి రానున్న ఆకాశయానం

తెలంగాణ రాష్ట్రంలో విమాన ప్రయాణికులకు శుభవార్త.వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ లలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానయాన కష్టాలు తీరనున్నాయి.

తెలంగాణలో 33 జిల్లాలున్నా, శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. తెలంగాణ మారుమూల జిల్లాల్లో ఉన్న ప్రజలు విమానయానం చేయాలంటే వ్యయ ప్రయాసలకోర్చి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిందే. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు విమానాశ్రయాలుండగా తెలంగాణలో మాత్రమే ఏకైక విమానాశ్రయమే విమాన ప్రయాణికులకు దిక్కు. విమానాశ్రయాల నిర్మాణంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలుగు వాడైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టేకాఫ్(Takeoff time for Telangana) చెప్పింది. దేశవ్యాప్తంగా కొత్తగా 120 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిన నేపథ్యంలో తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అవరోధాలు తొలగిపోయాయి.



 పెద్దపల్లి విమానాశ్రయం నిర్మాణంపై అధ్యయనానికి రూ.40 .53లక్షలు

పెద్దపల్లి జిల్లా అంతర్ గాం బసంత్ నగర్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం (Peddapalli Airport)అభివృద్ధికి సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షలను సోమవారం కేటాయించింది.ఈ మేరకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ విమానాశ్రయాల విభాగం జీఓఆర్టీ నంబరు 465 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్ గాంలోని 591.24 గుంటల స్థలాన్ని విమానాశ్రయం నిర్మాణానికి కేటాయించారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు గురించి అధ్యయనం చేసేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్ టెంట్ గా నియమించింది. కన్సల్ టెన్సీ రుసుంగా రూ. 40.53లక్షలను విడుదల చేసింది.పెద్దపల్లి విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన స్థలంపై జిల్లా అధికారులు సర్వే చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. పెద్దపల్లి విమానాశ్రయం కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వు తొలి అడుగు అని పెద్దపల్లి ఎంపీ జి వంశీకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ, ఎరువుల కర్మాగారం ఉద్యోగులకు, వ్యాపారులకు ఆకాశయానంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘పెద్దపల్లి విమానాశ్రయం నిర్మాణం వాస్తవమయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుంది’’అని ఎంపీ జి వంశీకృష్ణ పేర్కొన్నారు.

వరంగల్ వాసులకు వరం

వరంగల్ జిల్లాలోని మామునూర్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం (Warangal Airport)నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత నెలలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం వచ్చి విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించింది. విమానాశ్రయం విస్తరణకు భూసేకరణ విషయంపై ఈ బృందం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో సమావేశమైంది. వరంగల్ నగరానికి సమీపంలోని మామునూరులో 1930వ సంవత్సరంలోనే నాటి బ్రిటీష్ పాలకులు విమానాశ్రయాన్ని నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, వ్యాపారవేత్తలు, సందర్శకులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించేవారు.నాడు నిజాం సైనికులు మామునూర్ విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత 1981వ సంవత్సరంలో మామూనూర్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలను నిలిపివేశారు. తాజాగా పురాతన విమానాశ్రయంలో రన్ వేను విస్తరించి పునరుద్ధరించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ప్రస్థుతం 6.6 కిలోమీటర్లు ఉన్న రన్ వేను 10.6 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. మామునూర్ విమానాశ్రయం విస్తరణకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదించడంతో భూసేకరణ పనులు మొదలయ్యాయి. మామునూర్ విమానాశ్రయానికి అదనంగా 280 ఎకరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసిందని వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఆదిలాబాద్ లో విమానాశ్రయం పురోగతి గురించి ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజయ్ దేవ్ తో చర్చిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్


 ఆదిలాబాద్‌లో ఆకాశయానానికి కేంద్రం టేకాఫ్

జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని(Adilabad Airport) పౌర విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ లకు సమీపంలో ఆదిలాబాద్ ఉండటంతో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టేకాఫ్ చెప్పింది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి ఒకవైపు పౌర విమానయానానికి,మరో వైపు వైమానిక దళం ఎయిర్ ఫీల్డుగా కూడా వినియోగించుకోవాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిపాదించింది.తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)తో జాయింట్-యూజర్ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూచించింది.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆదిలాబాద్ ఏరోడ్రోమ్‌ను సర్వే చేపట్టింది.ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించింది.ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఆమోదం తెలిపిందని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఆదిలాబాద్ లో విమానాశ్రయం పురోగతి గురించి స్థానిక ఎంపీ గోడం నగేష్ ఇటీవల ఢిల్లీలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజయ్ దేవ్ ను కలిసి చర్చించారు.

భద్రాద్రి రాముడి భక్తులకు శుభవార్త
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని రాముల వారి దేవాలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చేందుకు వీలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం(Kothagudem Airport) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయితే విదేశాల నుంచి కూడా భక్తులు రానున్నారు. పాల్వంచ సమీపంలోని విమానాశ్రయం ఏర్పాటుకు 950 ఎకరాల అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ అధికారులు విమానాశ్రయం ఏర్పాటుపై దృష్టి సారించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇంజినీర్లు పాల్వంచలోని విమానాశ్రయ స్థలాన్ని సందర్శించారు. పాల్వంచలో విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించి దీనికి అనుమతి సాధించారు. పాల్వంచ విమానాశ్రయం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.




Tags:    

Similar News