గాలికి కొట్టుకుపోయిన కేటీఆర్ ‘ఓట్ చోరి’ ఆరోపణలు
కేటీఆర్ అండ్ కో ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని తేలిపోయింది
వెనకాముందు చూసుకోవటమే లేదు. ఎక్కడైనా ఏదైనా విషయం వెలుగుచూడగానే వెంటనే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ముడేసేసి ఆరోపణలతో బురదచల్లేయటమే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అండ్ కో. ఇపుడు విషయం ఏమిటంటే తొందరలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills by poll) ఉపఎన్నిక జరగబోతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తరపున వల్లాల నవీన్ యాదవ్, బీఆర్ఎస్(BRS) తరపున మాగంటి సునీత(Maganti) పోటీచేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇద్దరూ ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోన ఒక ఇంటిలో 43మంది ఓటర్లున్నారు అన్న విషయం బయటకొచ్చింది. మొదలైన ప్రచారంలో వాస్తవం ఎంతుంది అన్న విషయాన్ని కేటీఆర్ చెక్ చేసుకోలేదు.
43ఓట్ల విషయం వెలుగుచూడగానే వెంటనే ట్విటర్లలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై బుర్రకుతోచిన ఆరోపణలు గుప్పించేశారు. ఓట్ చోరి ద్వారా కాంగ్రెస్ గెలుపుకు కుట్రలు చేస్తోందని నానా రచ్చ మొదలుపెట్టారు. కేటీఆర్ ఆరోపణలు చేయగానే ఇంకేముంది చాలామంది కారుపార్టీ నేతలు గుడ్డిగా అనుసరించేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఒకేఇంట్లో 43మంది ఓటర్లు ఎలాగుంటారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దొంగఓట్లతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నానా గోలచేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమీషనర్ మధుసూధనరెడ్డిని పార్టీ నేతలతో కలిసి చాలాఆరోపణలు చేశారు. దొంగఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
నిజానికి జూబ్లీహిల్స్ లో బయటపడిన 43 ఓట్ల ఉదంతానికి ఓట్ చోరీకి ఎలాంటి సంబంధంలేదు. ఓట్ చోరి అన్నది బీఆర్ఎస్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ఆరోపణ ద్వారా వెలుగుచూసింది. రాహుల్ ఆరోపణల ప్రకారం ఓట్ చోరి అంటే ఏమిటంటే బీజేపీ లేదా ఎన్డీయేకి పడవని లేదా కాంగ్రెస్ కు పడే ఓట్లని నమ్మకంగా తెలిసిన వాటిని అడ్డుకోవటమే. ఏ విధంగా అడ్డుకుంటారంటే దొంగఓట్ల పేరుతో ఓటర్లజాబితాలో నుండి తొలగించటమే. బీజేపీ+ఎన్నికల సంఘం కుమ్మక్కై కాంగ్రెస్ కు పడతాయని అనుకున్న లక్షలాది ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగా తొలగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఓట్ చోరి అంటే దొంగఓట్ల సాకుతో నిజమైన ఓటర్లను జాబితాలో నుండి తొలగించటమే. కాబట్టి రాహుల్ ఓట్ చోరీకి ఇపుడు జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ఆరోపిస్తున్న ఓట్ చోరికి ఎలాంటి పోలిక లేదు.
ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఓట్లు తీసేయలేదు. ఒకేఇంట్లో 43 ఓట్లున్నాయన్న విషయం బయటపడింది. ఒకే ఇంట్లో 43ఓట్లున్న విషయం వాస్తవమా కాదా అన్నది కూడా కేటీఆర్ చెక్ చేసుకోకుండానే ఆరోపణలతో రెండురోజులుగా రచ్చరచ్చ చేస్తున్నారు. తీరాచూస్తే ఏమైంది కేటీఆర్ అండ్ కో ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని తేలిపోయింది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ ఈ విషయమై క్లారిటి ఇచ్చారు. కర్ణన్ చెప్పింది ఏమిటంటే ఒక అపార్టమెంటులోని వివిధ ఫ్లాట్లలో కలిపి 43 ఓట్లున్నాయి. ఒక ఇంటి నెంబర్ 8-3-231/బీ/ 118 లో 50 మంది, 8-3-231/బీ/119లో పది, 8-3-231/బీ/164 లో164లో ఎనిమిదిమంది ఓటర్లున్నారు. అలాగే 8-3-231/బీ/160లో 43మంది ఓటర్లున్నారు. పై ఇంటినెంబర్లలో వీరంతా ఉండటం వాస్తవమే అయినా ఈ ఓట్లు ఇప్పుడు కొత్తగా ఓటర్లజాబితాలో చేర్పించినవి కావు. పై ఓటర్లంతా 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్లేశారు. ఐదు ఫ్లాట్లున్న అపార్ట్ మెంట్లలో ఉంటున్న వారంతా ఒకేఇంటినెంబరుతో గుర్తింపుకార్డులు పొందినట్లు కర్ణన్ వివరించారు.
అపార్ట్ మెంట్ కాంపౌండ్ లోని వివిధ ఫ్లాట్లలో ఉంటున్న వారికి బేసిక్కుగా ఒకే ఇంటి నెంబర్ ఉండటం చాలా సహజం. ఒకే ఇంటినెంబర్లో ఉంటున్నా ఫ్లాట్ల నెంబర్లు మారిపోతాయి. కాబట్టి ఒకే ఇంటినెంబరుతో ఒకే కాంపౌండులో చాలా ఓట్లుంటాయి. ఈవిషయాలను కేటీఆర్ పట్టించుకోకుండా ‘తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకోసం’ అన్న సామెతాలో చెప్పినట్లు ఎవరో ఆరోపణ చేయగానే దాన్నిపట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. కర్ణన్ వివరణ ప్రకారం చూస్తే ఆఓట్లన్నీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే ఓటర్లజాబితాలో ఉన్న విషయం బయటపడింది. ఎప్పుడైతే కర్ణన్ వివరణ ఇచ్చారో కేటీఆర్ అండ్ కో మళ్ళీ మాట్లాడటంలేదు.