రేవంత్ కు తలనొప్పిగా తయారైన మంత్రులు

మంత్రులమధ్య వివాదాలు పెరిగిపోతే అంతిమంగా తనప్రభుత్వం పనితీరుమీద పడుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తంచేశారు

Update: 2025-10-14 09:24 GMT
Revanth and Controversy ministers

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు క్యాబినెట్ సహచరుల మధ్య వివాదాలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. 24మంది మంత్రుల్లో ఆరుగురి మధ్య తీవ్రవిభేదాలు రోడ్డున పడ్డాయి. అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు ఆర్ధిక, సమాచార, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి(Ponguleti Srinivasula Reddy) శ్రీనివాసరెడ్డితో పడటంలేదు. అలాగే గిరిజన, షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam), గనులు-కార్మిక ఉపాధికల్పన శాఖల మంత్రి గడ్డం వివేక్(Gaddam Vivek)తో పడటంలేదు.

మొన్నటివరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడేదికాదు. ఇద్దరిమద్య వివాదం తాత్కాలికంగా సద్దుమణిగిందని పార్టీవర్గాలు అంటున్నాయి. తాజాగా కొండాసురేఖకు గడ్డం వివేక్ వెంకటస్వామికి కూడా పడటంలేదు. పై మంత్రులంతా ఒకరిపై మరొకరు రేవంత్ కు అలాగే అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మంత్రులమధ్య వివాదాలుపెరిగి రోడ్డునపడటం స్ధానిక సంస్ధలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైన ప్రభావం చూపుతుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఇలాంటి ఆందోళన వారంరోజుల క్రితం వరకు చాలా ఉండేది. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ గెలుపుపై మంత్రుల మధ్య కీచులాటల ప్రభావం తప్పకపడుతుందనే చాలామంది అనుకున్నారు.

అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టిచ్చిన స్టేకారణంగా స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకనే ఇపుడు అందరిదృష్టి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక మీదపడింది. ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యేసమయనికి క్యాబినెట్ మంత్రుల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. దీనిప్రభావం ఉపఎన్నిక గెలుపుపై పడుతుందనే ఆలోచనతోనే రేవంత్ మంత్రులందరినీ కూర్చోబెట్టి సోమవారం రాత్రి ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాచారం.

మంత్రులమధ్య వివాదాలు పెరిగిపోతే అంతిమంగా తనప్రభుత్వం పనితీరుమీద పడుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇకనుండి మంత్రులు ఎవ్వరూ మీడియాతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా ఆదేశించారు. మంత్రులమధ్య ఏమైనా అపోహలు, అనుమానాలుంటే తనతోనే చెప్పాలని చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కన్నా వివాదాలకే ఎక్కువగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని రేవంత్ మంత్రులతో ప్రస్తావించారు. అధికారపార్టీకి ముఖ్యంగా మంత్రులపైన బాధ్యత ఎక్కువగా ఉంటుందని అందరికీ గుర్తుచేశారు. ఇకపై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దు, క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని కొందరు మంత్రులకు ఫుల్లుగా క్లాసులు పీకినట్లు పార్టీవర్గాల సమాచారం. మంత్రులంతా ఐకమత్యంతో పనిచేసి తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని గట్టిగా ఆదేశించారు.

కొద్దిరోజులుగా వరసు వివాదాల్లో కొందరు మంత్రులు చాలా బిజీఅయిపోయారు. కొండా సురేఖతో సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పడటంలేదు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా చేయాల్సిన రు. 150 కోట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో ఇద్దరిమధ్యా గొడవమొదలైంది. అభివృద్ధిపనుల టెండర్లన్నీ పొంగులేటి తన మద్దతుదారులతోనే చేయిస్తున్నట్లు సురేఖ ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఇక్కడ మంత్రి వాదన ఏమిటంటే దేవాదాయశాఖ తనది కాబట్టి ఈ శాఖలో జరిగే పనులన్నీ తాను చెప్పిన వాళ్ళద్వారానే జరగాలని. పొంగులేటి వాదన ఏమిటంటే అభివృద్ధిపనులకు నిధులను సమకూర్చేది తనఆర్ధికశాఖ కాబట్టి తాను చెప్పినవాళ్ళకే పనులు దక్కాలని. కాంట్రాక్టు వర్కుల కోసమే మంత్రులు ఇద్దరు గొడవపడుతున్నారన్న పాయింట్ జనాల్లోకి వెళ్ళిపోయింది.

అలాగే మరో మంత్రి గడ్డం తనతో చెప్పకుండా అటవీశాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో రివ్యూ చేయటం ఏమిటని కొండా సురేఖ ముఖ్యమంత్రికి ఫిర్యాదుచేశారు. అయితే గడ్డం ఏమంటారంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తన నియోజకవర్గం బెల్లంపల్లిలోని అటవీశాఖ భూములపైన మాత్రమే రివ్యూ చేశానని, అటవీశాఖ పనితీరుపైన రివ్యూ చేయలేదని చెప్పారు. అయినా ఇద్దరి మధ్యా వివాదం కొనసాగుతునే ఉంది.

ఇక మంత్రులు అడ్లూరి-పొన్నం-గడ్డం మధ్య గొడవ అందరికీ తెలిసిందే. తాను మాదిగ ఉపకులానికి చెందిన వాడిని కాబట్టే గడ్డం(మాల) అవమానిస్తున్నాడని అడ్లూరి ఆరోపించారు. అలాగే తనను పొన్నం ----తో పోల్చటాన్ని అడ్లూరి తట్టుకోలేకపోయారు. ఈఇద్దరిపైనా సోషల్ మీడియా వేదికగా అడ్లూరి చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చివరకు అడ్లూరికి పొన్నం బహిరంగంగా సారిచెప్పి వివాదాన్ని ముగించారు. అలాగే తనను అడ్లూరి అపార్ధంచేసుకున్నట్లు గడ్డం బహిరంగంగా చెప్పి వివాదాన్ని ముగించే ప్రయత్నంచేశారు. ఒకసారి వివాదం మొదలైన తర్వాత అంత తొందరగా సమసిపోదన్న విషయం అందరికీ తెలిసిందే.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగులు, నియోజకవర్గాల్లో అభివృద్ధిపనులు అన్నీ తాము చెప్పినట్లే జరగాలని ఇద్దరు ఎవరికివారు పట్టుబడుతున్నారు. దాంతో ఇద్దరిమధ్యా ఆధిపత్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు మంత్రులు నల్గొండ జిల్లాకే చెందిన వారు అయినప్పటికీ కలిసి మాట్లాడుకునేది చాలా తక్కువే. ఆమధ్య ఒకసారి ఉత్తమ్ ఇంటికి కోమటిరెడ్డి వెళ్ళి మాట్లాడినా పరిస్ధితిలో పెద్దగా మార్పురాలేదని పార్టీవర్గాల సమాచారం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోమటిరెడ్డి, నల్లమాడ, పొంగులేటి రెడ్లు అయితే మిగిలిన కొండా, అడ్లూరి, గడ్డం, పొన్నం బీసీ, ఎస్సీ సామాజికవర్గం మంత్రులు. ఇపుడు తెలంగాణలో బీసీవాదన చాలాబలంగా వినబడుతున్నది. ఈనేపధ్యంలో బీసీ-ఎస్సీ, బీసీ-రెడ్డి సామాజికవర్గాలకు చెందిన మంత్రుల మధ్య గొడవలు పెరిగిపోతే దానిప్రభావం రాబోయే ఎన్నికలపైన ఎక్కడ పడతాయో అన్న ఆందోళన రేవంత్ లో పెరిగిపోతున్నట్లు అర్ధమవుతోంది. మరి మంత్రులకు రేవంత్ తీసుకున్న క్లాసు ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News