బిజెపి నుంచి కిషన్ రెడ్డి బయటకు వస్తారు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్య

Update: 2025-10-14 13:01 GMT

ఏదో ఒక రోజు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి నుంచి బయటకు వస్తారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ  రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

బిజెపితో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal mla)రాజాసింగ్ కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక (Jubilihills by elections)లో బిజెపి ఎన్ని వోట్ల తేడాతో ఓడిపోతుంది ? అని తెలంగాణ(Telangana)ప్రజలు అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతీ నియోజకవర్గంలో వేలు పెట్టడం కిషన్ రెడ్డికి అలవాటు, తన జిల్లాను సర్వనాశనం చేసి తనను బయటకు పంపారు. కిషన్ రెడ్డి ఏదో ఒక రోజు పార్టీ నుంచి బయటకు వస్తారు అని రాజాసింగ్ జోస్యం చెప్పారు.

ఇదిలావుండగా జూబ్లిహిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో అన్ని రాజకీయ పార్టీల కన్ను జూబ్లిహిల్స్ పై పడింది. వరుసగా మూడు సార్లు గెలిచి హట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డులకెక్కిన మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన సతీమణి మాగంటి సునీతను బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. సానుభూతి వోట్లు , ప్రభుత్వ వ్యతిరేత వోట్ల ద్వారా లబ్ది పొందాలని బిఆర్ఎస్ చూస్తుంది. బూటకపు ఎన్నికల వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. వాగ్దానాలు మరచిందని ఆరోపిస్తూ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. మాజీ రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమరుడు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. 2014లో ఆయన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో స్వల్ప వోట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అప్పుడు మజ్లిస్ పార్టీ నుంచి ఓడిపోయిన నవీన్ యాదవ్ కు ఈ ఉప ఎన్నికల్లో అదే పార్టీ మద్దత్తు ఇస్తుంది. ప్రస్తుతం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉంది.

బిజెపి అభ్యర్థి ఖరారు కాలేదు

కాగా జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో అందరి చూపు బిజెపిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ బిజెపి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, మాధవి లత పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఒకరి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని వార్తలు వచ్చినప్పటికీ ఇంత వరకు పేరు ఖరారు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

బిజెపి పార్టీ అధ్యక్షుడు(Bjp state president) రాం చందర్ రావు నియామకం తర్వాత రాజాసింగ్ బిజెపి కి రాజీ నామా చేశారు. రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాజాసింగ్ బిజెపిలో లేనప్పటికీ జూబ్లిహిల్స్ ఎన్నిక గూర్చి మాట్లాడి అందరి దృష్టినాకర్షించారు. తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో ఎంటరైన రాజాసింగ్ మూడు పర్యాయాలు బిజెపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడంతో బిజెపి ఆయన్ని సస్పెండ్ చేసింది. పార్టీ ఆయనపై విధించిన సస్పెన్షన్ గత ఎన్నికల ముందు ఎత్తి వేసినప్పటికీ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ రాజాసింగ్ నిత్యం వార్తలలో నిలిచారు.

బిజెపికి రాజీనామా చేసి వెళ్లిపోయిన రాజాసింగ్ తన విమర్శలను ఆపడం లేదు. ఆయన ఏ పార్టీలో చేరేది కూడా స్పష్టత లేదు.

Tags:    

Similar News