బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
గతంలో పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఈసారి ఏం చేస్తుందో..!
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టువదలకుండా పోరాడుతోంది. ఈ అంశంలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ పిటిషన్ ప్రస్తుతం కోర్టు రిజిస్ట్రార్ దగ్గర ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ అంశాన్ని గురువారం, శుక్రవారాల్లో విచారించాలని కోరారు. కాగా సీజేఐ అనుమతితో పిటిషన్‌ను లిస్ట్ చేస్తామని రిజిస్ట్రార్ చెప్పారు. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై ఇది వరకు కూడా ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అది హైకోర్టు స్టే ఇవ్వడానికి ముందు దాఖలయింది. కాగా దానిని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులోనే ఈ అంశాన్ని చూసుకోవాలని తెలిపింది.
గతంలో సుప్రీం ఏమందంటే..
బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే పిటిషన్‌దారుపై ప్రశ్నలు గుప్పించింది. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున... విచారణకు స్వీకరించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది ధర్మాసనం. హైకోర్టులో స్టే ఇవ్వలేదని.. అందుకే ఇక్కడకు వచ్చామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దాంతో హైకోర్టులో స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వచ్చేస్తారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అంనతంర జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
హైకోర్టులో స్టే ఇవ్వలేదు కాబట్టి.. ఇక్కడి వచ్చారా అని ప్రశ్నించింది. అసలు ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే విషయాన్ని స్పష్టం చేసి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందా? అనేది కీలకంగా మారింది. జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను సమర్థిస్తుందా? ఎత్తేస్తుందా? లేదంటే అక్కడ విచారణ పూర్తయిన తర్వాత తమను ఆశ్రయించాలని చెప్తుందా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.