ములుగు జిల్లాలో డ్రగ్స్ దందా చేస్తున్న మైనర్ బాలుడు
25 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం;
డ్రగ్స్ కేసులో ఎపి అల్లూరి సీతరామ జిల్లాకు చెందిన ఇద్దరిని ములుగు జిల్లాలో నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 25 లక్షల విలువచేసే 51.081 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ములుగు డిఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం నార్కోటిక్స్ పోలీసులకు వరంగల్ జిల్లా నర్సంపేటలోగంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారమందింది. వెంటనే అక్కడ దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయిని సరఫరా చేసే ఎపికి చెందిన ఇద్దరిలో ఒకరు మైనర్ అని తేలింది. అల్లూరి సీతరామ రాజు జిల్లా డొంకరాయి గ్రామానికి కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలుడు ఈ కేసులో ప్రదాన నిందితుడు. గ్రామానికి చెందిన 19 ఏళ్ల మోహిత్ (ఎ2)గా ఉన్నాడు. వీరిద్దరితో బాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన పండు గంజాయి సప్లయ్ చేసేవాడు. ప్రస్తుతం అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ములుగు డిఎస్పి చెప్పారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలె హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితులను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. జిల్లాల్లో కూడా నార్కోటిక్స్ పోలీసులు దాడులు చేసి నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు.