15 మృతదేహాలను గుర్తించిన అధికారులు
ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరిలో ఎంతమంది ఉన్నారనే విషయంలో పొంతనలేని సంఖ్యలు వినబడుతున్నాయి.;
సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో మరణించిన 48 మందిలో అధికారులు ఇప్పటికి 15 మృతదేహాలను గుర్తించారు. సోమవారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా 48మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగినపుడు ఫ్యాక్టరిలో ఎంతమంది ఉన్నారనే విషయంలో పొంతనలేని సంఖ్యలు వినబడుతున్నాయి. కొంతమందేమో 150 మందని, మరికొందరేమో 140 మంది అని ఇంకొందరేమో 130 మందే ఉన్నారని రకరకాల సంఖ్యలు చెబుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 30 మంది వైద్యం చేయించుకుంటున్నారు. 48మంది మరణించారు అన్నది అధికారికం, 30మంది వైద్యం చేయించుకుంటున్నది వాస్తవం. మరి మిగిలిన వాళ్ళ సంగతేమిటి ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.
గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన సిమెంట్ కాంక్రీట్ శిధిలాలను పూర్తిగా తొలగిస్తే కాని వాటికింద పడున్న దేహాలు బయటపడవు. శిధిలాలను తొలగించేపనిలో యావత్ యంత్రాంగం బిజీగా ఉంది. ఇదేసమయంలో ఆసుప్రతికి తరలించిన 48 మృతదేహాల్లో అధికారులు 15 మందిని గుర్తించారు. గుర్తింపు జరిగినా ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. అనధికారిక సమాచారం ప్రకారం ఒడిస్సాకు చెందిన వెంకట జగన్మోహన్, ఒడిస్సాకే చెందిన మంజోకుమార్, నూజివీడుకు చెందిన శ్రీరమ్య, మంచిర్యాలకు చెందిన నగేష్ కుమార్, ఇస్నాపూర్ కు చెందిన రుక్ష్నా, ఒడిస్సా వాసి దురై, ఇస్నాపూర్ కు చెందిన రామ్ సింగ్, కడప జిల్లావాసి నిఖిల్ కుమార్ రెడ్డి, రాజమండ్రికి చెందిన ప్రసన్న, చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు శశిభూషణ్ కుమార్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జగదీశ్ ప్రసాద్, ఒడిస్సాకు చెందిన దొలగోవింద్ సాహు, ప్రకాశంజిల్లాకు చెందిన దాసరి సునీల్ కుమార్, బీహార్ వాసి తస్లిమ ఖాతూన్ ను అధికారులు గుర్తించారు. వీళ్ళ కుటుంబసభ్యుల శాంపుళ్ళతో డీఎన్ఏ మ్యాచ్ అవటంతో మృతదేహాలను అప్పగించేశారు.