కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలిపోయింది, ఇంకా హామీలిస్తూనే ఉన్నారు

ఓరుగల్లు వాసులు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నా ఆ కల నెరవేరటం లేదు. కాగితాలకే పరిమితమైన కోచ్ ఫ్యాక్టరీ ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది.

Update: 2024-04-24 10:04 GMT
kazipet junction

వరంగల్ అంటే కాకతీయులు నిర్మించిన కట్టడాలు, కళావైభవం, రామప్ప, భద్రకాళీ దేవాలయాలు గుర్తుకు వస్తాయి. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లాలంటే వరంగల్ వారధి మీదుగానే వెళ్లాలి. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విభజన హామీ కింద కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని నిర్ణయించినా కేంద్రంలోని బీజేపీ సర్కారు దీన్ని ఇతర ప్రాంతానికి తరలించింది. దీంతో ప్రతీ ఎన్నికల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఏళ్లు గడుస్తున్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతల ముందుకు మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది.


ఓరుగల్లు కోటలో ఎవరు పాగా వేస్తారు?

చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు కోటలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కిన డాక్టర్ కడియం కావ్య అనూహ్యంగా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలోకి దిగారు. కడియం ఫౌండేషన్ పెట్టి పాఠశాల బాలికలకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ చేయడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజాసేవల రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన ఆరూరి రమేష్ కాషాయతీర్థం స్వీకరించి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నేతలే కావడం విశేషం.

వరంగల్ లో సీఎం రేవంత్ ప్రచారం

వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించారు. బుధవారం వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు. సీఎం జన జాతర సభకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తమ సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.

పోరాడుతున్నా కలగానే మిగిలింది...

వరంగల్ జిల్లాలో మూడు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ బీజేపీ వివక్ష వల్ల వచ్చినట్లే వచ్చి ఇతర ప్రాంతానికి తరలి పోయింది. వేలాదిమంది వరంగల్ యువతకు ఉపాధి కల్పించే ఈ ఫ్యాక్టరీ కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నా ఫలితం మాత్రం లేదు. దీంతో పాటు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా అది కూడా కలగానే మిగిలింది. కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ఉద్యోగాలు రావని రైల్వే మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం కొన్నేళ్లుగా ఉద్యమం సాగుతున్నా ఎన్నికల సమయంలోనే నేతలకు గుర్తుకు వస్తుంది.

దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నాం...
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కర్రా యాదవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధించే వారికే ఓట్లేస్తామని యాదవరెడ్డి చెప్పారు.

కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం : కడియం శ్రీహరి
పదేళ్లుగా విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. 2014వసంవత్సరంలో తాను ఎంపీగా ఉన్నపుడు కోచ్ ఫ్యాక్టరీ గురించి పార్లమెంటులో గళమెత్తినా ఎవరూ పట్టించుకోలేదని కడియం పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీతోపాటు హైదరాబాద్ టు భూపాలపల్లి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, వరంగల్అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం తాము కృషి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరించారు. తనను వరంగల్ ఎంపీగా గెలిచి దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సాధిస్తానని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేల బలం

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు వారి బలగం ఉంది. స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటిలోకి చేరి అతని కుమార్తె కడియం కావ్యను ఎన్నికల బరిలో దించడంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. యశస్వినీరెడ్డి (పాలకుర్తి), రేవూరి ప్రకాష్ రెడ్డి (పరకాల), నాయిని రాజేందర్ రెడ్డి (వరంగల్ వెస్ట్), కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్), కేఆర్ నాగరాజ్ (వర్ధన్నపేట0, గండ్ర సత్యనారాయణ(భూపాలపల్లి) ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారింది.

పెరిగిన కాంగ్రెస్ ఓట్ల శాతం
గతంలో బీఆర్ఎస్ ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న వరంగల్ జిల్లాలో 2023 అసెంబ్లీ ఎన్నికలతో సీన్ మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 52.8 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ 58.8 శాతం ఓట్లతో విజయం సాధించింది. అయితే అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 47.1 శాతం ఓట్లతో ఆరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 35.8 శాతానికి తగ్గింది.

ఎస్సీ,ఎస్టీ,ముస్లిం ఓటర్లే కీలకం

వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్సీ,ఎస్టీ, ముస్లిం ఓటర్లే కీలకంగా మారారు. ఈ నియోజకవర్గంలో 33.7 శాతం ఓటర్లు బలహీనవర్గాల వారే ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 19.6 శాతం, ఎస్టీ ఓటర్లు 7.5 శాతం, ముస్లిం ఓటర్లు 6.6 శాతం ఉండటంతో ఈ ఎన్నికల్లో విజయం వీరిపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో పార్లమెంట్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎస్సీ,ఎస్టీ, ముస్లిం ఓటర్లపైనే దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్నారు.


Tags:    

Similar News