Phone Tapping | అన్ని ఆధారాలు సిట్‌కు ఇస్తా: బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద నాకు నమ్మకం లేదన్న బండి సంజయ్.;
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. అంతకన్నా ముందు ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యవహారంలో తొలి బాధితుడు తానేనని చెప్పారు. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు అందిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ‘‘తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత బయటపెట్టింది నేనే. విచారణకు రావాలని నాకు గతవారం నోటీసులు వచ్చాయి. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోయాను. అదే విషయాన్ని సిట్‌కు వివరించి గడువు కోరాను. అందుకు అంగీకరించిన సిట్ నాకు ఈ డేట్ ఫిక్స్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే. కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద నాకు నమ్మకం లేదు. సిట్ అధికారులకు రాష్ట్ర సర్కార్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తే అన్ని వివరాలను బయటపెడతా’’ అని వెల్లడించారు.
ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే..
టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోనే అనేకమంది ప్రముఖులతో పాటు జడ్జీల మొబైల్ ఫోన్లను కూడా కేసీఆర్(KCR) ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు గతంలోనే బయటపడింది. ఇంతకాలం ఎంతమంది జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే విషయంపై సరైన సమాచారం లేదు. అయితే తాజాగా హైకోర్టులో ఇదే విషయమై జరిగిన విచారణలో కొత్త విషయం వెలుగుచూసింది. ఇంతకీ ఆ కొత్త విషయం ఏమిటంటే 19 మంది హైకోర్టు జడ్జీల మొబైల్ ఫోన్లతో పాటు ఒక సుప్రింకోర్టు జడ్జీ ఫోన్ కూడా ట్యాప్(Telephone tapping) అయినట్లు బయటపడింది. ట్యాపింగ్ లో శ్రవణ్ ప్రోద్భలంతోనే అప్పటి పోలీసు అధికారులు అక్రమంగా 19 మంది హైకోర్టు జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను, సుప్రింకోర్టు జడ్జి ఫోన్ను కూడా ట్యాప్ చేయించినట్లు పల్లె చెప్పారు.