Phone Tapping | సిట్ విచారణకు రమ్మంటే దండయాత్ర చేశారా ?
ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి అక్కడినుండి రాజ్ భవన్(Raj Bhavan) రోడ్డులో ర్యాలీగా వెళ్ళారు;
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసు దర్యాప్తులో విచారణకు రమ్మని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)(SIT Inquiry) రమ్మంటే శుక్రవారం మధ్యాహ్నం దండయాత్రకు వచ్చినట్లు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం దిల్ కుష గెస్ట్ హౌస్ లో మధ్యాహ్నం 12గంటలకు బండి(Bandi Sanjay) విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ ఇంట్లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఖైరతాబాద్ వరకు కార్ల ర్యాలీగా వచ్చారు. ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి అక్కడినుండి రాజ్ భవన్(Raj Bhavan) రోడ్డులో ర్యాలీగా వెళ్ళారు. భారీ ర్యాలీతోనే దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ వరకు పాదయాత్రచేశారు. బండి వైఖరి చూస్తుంటే ఎవరిమీదకైనా దండయాత్రకు వెళుతున్నారా అన్న అనుమానాలు ఖాయం.
ఇంత పెద్ద ర్యాలీగా పాదయాత్ర చేసి సిట్ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఏమిటో బండే చెప్పాలి. ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరైనవారు నేతలెవరూ ఇంత హంగామాచేసి విచారణకు ఈ స్ధాయిలో హాజరుకాలేదు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తన నెంబర్ను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ట్యాపింగ్ చేయించినట్లు బండి మండిపోతున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు అన్నీ ఆధారాలున్నాయని మీడియాతో చెప్పారు. తన దగ్గర ఉన్న అన్నీ ఆధారాలను సిట్ అధికారులకు అందచేస్తానని అన్నారు. విచారణకు హాజరయ్యే ముందు తన ఇంట్లో కేంద్ర ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, హోంశాఖ సీనియర్ అధికారులతో చాలాసేపు సమావేశమయ్యారు. హనుమాన్ దేవాలయం నుండి గెస్ట్ హౌస్ కు మధ్య సుమారు అర్ధ కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ అర్ధకిలీమీటర్లోనే బండి తన మద్దతుదారులు, పార్టీనేతలతో ర్యాలీ తీశారు. మోటారు సైకిళ్ళు, కార్లు, జీపులు, పాదయాత్రచేసేవారితో పై ప్రాంతమంతా ఎంతో హడావుడి జరిగింది.
ఎలాగైనా కేసీఆర్ పై కేసుపెట్టి అరెస్టుచేసి జైలుకు పంపాలన్నది బండి పంతంగా కనబడుతోంది. అందుకనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే చాలాసార్లు డిమాండ్ చేశారు. ట్యాపింగ్ కేసును సమర్ధవంతంగా దర్యాప్తుచేయటంలో సిట్ అధికారుల స్ధాయి సరిపోవటంలేదని బండి భావిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు అయితే ఇంకా సమర్ధవంతంగా ఉంటుందని, ఈ పాటికే కేసీఆర్ తదితరులపై కేసులు నమోదుచేసి జైల్లో తేసేవారమని బండి చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. అయితే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే ఉద్దేశ్యంలో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు.
ఎందుకంటే ట్యాపింగ్ కేసును సాకుగా చూపించి బీజేపీ కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుంటుందనే అనుమానాలు మంత్రులు, కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇదే అనుమానాన్ని రేవంత్ బహిరంగంగానే వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును సిట్ అధికారులు సమర్ధవంతంగానే చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తు అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా సరే ట్యాపింగ్ కేసును కేంద్రదర్యాప్తు సంస్ధకు ఇవ్వాల్సిందే అని బండి పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే శుక్రవారం విచారణకు హాజరైన బండి తదుపతి యాక్షన్ ఏమిటన్నది ఆసక్తిగా మారింది.