Phone tapping | బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్
రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్ ఇలాంటి నాటకాలకు తెరలేపారు.;
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తోసిపుచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదని, ఉండే ఆధారాలు చూపాలని, చేసిన ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. ఎదురుగా నాలుగు మైకులు కనిపించగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నాయకుడి లక్ష్యం కాదంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్.. విచారణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావు, కవిత, కవిత భర్త అనిల్ ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆరోపించారు. భార్యభర్తల మాటలను కూడా దొంగచాటుగా విన్న ప్రభుత్వం బీఆర్ఎస్‌దేనని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ చేస్తున్నవన్నీ గాలి ఆరోపణలని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా కీలక పోస్ట్ పెట్టారు.
‘‘ఇంటెలిెన్స్ విభాగం ఎలా పనిచేస్తుందో సంజయ్ అర్థం చేసుకోలేరు. ఆయన నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు హద్దు మీరాయి. చౌకబారు ఆరోపణలతో ఆయన ఇంకా దిగజారారు. రాజకీయ ఉనికి కోసం రోడ్లపై ఇలాంటి నాటకానికి తెరలేపారు’’ అని కేటీఆర్ విమర్శలు చేశారు.
బండి సంజయ్ ఏమన్నారంటే..
‘‘ఎస్‌ఐబీ ద్వారా వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. వాటి ఆధారంగా కేటీఆర్.. సదరు బిజినెస్ మెన్‌లకు ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర నుంచి అధికారులు రూ.7కోట్లు సీజ్ చేశారు. అవి ఏమయ్యాయో ఇప్పటి దాకా తెలీదు. వాటిని ఈ ప్రభాకర్ రావు, ఆయన సహచరులు కలిసి.. కేసీఆర్, కేటీఆర్‌కు చేరాయి. వీళ్లు సీజ్ చేసేటప్పుడు రూ.20 కోట్ల ఉంటాయి.. కానీ కేసీఆర్ లేదా కేటీఆర్ ఫోన్ రాగానే ఆ మొత్తం రూ.2కోట్లు అయిపోతుంది. ఈ లెక్కలపై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగినా ఎందుకు చర్యలు లేవు’’ అని ప్రశ్నించారు.