‘స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి’
బీసీ రిజర్వేషన్ల జీఓపై తెలంగాణ హైకోర్టులో విచారణ.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ జీవోను మాధవరెడ్డి అనే వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో ఛాలెంజ్ చేశారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం శనివారం సాయంత్రం విచారణ జరిపింది. ఈ సందర్భంగానే విచారణ జరిపిన జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో జీఓ విడుదల చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘అవసరమైతే స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్న జీఓ విడుదల సరికాదు. ఈ విషయంలో కోర్టు జోక్యం ఉండకూదు అనుకుంటే ఎన్నికలను 10 రోజులు వాయిదా వేయండి. రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా? ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయం చెప్పాలి’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంగానే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్‌పై ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. కాగా ఈ అంశాన్ని దసరా సెలవుల తర్వాత విచారించాలని ఆయన కోరారు. దసరా సెలవులు ముగిసేవరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే.. ఎప్పుడంటే అప్పుడు ఈ పిటిషన్‌ను విచారిస్తామని న్యాయస్థానం ఆయనకు బదులిచ్చింది. కాగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని అడిగి సమాధానం చెప్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు.
హైకోర్టులో జరిగిన వాదనలివే..
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవోతో రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిమితి 60శాతాన్ని దాటిందని పిటిషనర్ వివరించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మాత్రమే ఉండాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్న అంశాన్ని ధర్మానం లేవనెత్తింది. కాగా ఆ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి పెంచారని, ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉందని పిటిషనర్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో 2018లో కూడా బీసీ రిజర్వేషన్లను 35శాతానికి పెంచుతూ జీవో తీసుకొచ్చారని, దానిని ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందని తెలిపారు.
ఈ సందర్భంగానే పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని పిటిషన్ గుర్తు చేశారు. ఆ బిల్లు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని చెప్పారు. దీంతో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్న అంశంపై జీఓ ఎలా జారీ చేస్తారని సోలిసిటర్ జనరల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం చెప్పేందుకు రెండ్రోజుల సమయం కావాలని ఏజీ కోరగా అందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అక్టోబరు 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా? అని.. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది.