సూర్యా పేట జ్యువెలరీషాపు దొంగతనం కేసులో పురోగతి
ముఠా సభ్యురాలి అరెస్ట్;
సూర్యాపేట చరిత్రలో అతి భారీ దొంగతనంగా రికార్డులకెక్కిన సాయి సంతోషి జ్యువెలర్స్ దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ముఠా సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 21వ తేదీన దొంగతనం కేసు తెలంగాణలో సంచలనమైంది. దాదాపు 20 కోట్ల రూపాయల దొంగతనం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. అర్దరాత్రి సమయంలో జ్యువెలరీ షాపు వెనక ద్వారం నుంచి గ్యాస్ కట్టర్ ద్వారా షట్టర్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు, నగల షాపులో ఉన్న నాలుగు బంగారు బిస్కట్ లతో బాటు బంగారు నగలను, 19 లక్షల నగదును ఎత్తు కెళ్లారు.
సూర్యాపేట ఎస్పీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ నేరస్థుడే ఈ దొంగతనం చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో దొంగతనం చేస్తే దొరికిపోతామన్న భయంతో నిందితుడు సూర్యాపేటలో స్కెచ్ వేశాడు. నేపాల్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ నేరస్థులతో కలిసి దోపిడి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా నేరాలకు పాల్పడుతుందని సూర్యాపేట ఎస్పీ చెప్పారు. ఈ దొంగతనంలో ఐదుగురు నేరస్థులు నేరుగా పాలుపంచుకోగా మరో ఇద్దరు వారికి సహకరించారు. ముఠా సభ్యురాలు యశోదను అరెస్ట్ చేసినట్టు ఎస్ పి చెప్పారు.