ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనలో షాకింగ్ నిజాలు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనలో నిజాలు వెలుగు చూశాయి.సొరంగంలో పై నుంచి నీటి ఊట, బురద వస్తుండటంతో తాము ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశామని కార్మికులు చెప్పారు.;

Update: 2025-02-23 14:52 GMT

శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం 14వ కిలోమీటరు వద్ద శనివారం ఉదయం 8.30 గంటలకు కూలిపోయింది. టన్నెల్ కూలి గంటలు గడుస్తున్నా లోపల చిక్కుకున్న వారి జాడ తెలియలేదు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారు సురక్షితంగా బయటపడాలని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఉత్తరాఖండ్ తరహాలో ఎస్ఎల్‌బీసీలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పిస్తున్నారు.


టన్నెల్ ఎలా కూలిందంటే...
ఎస్ఎల్‌బీసీ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కొందరు కార్మికులు ఆరోపించారు.సొరంగంలో నీటి ఊట, బురద వస్తుందని తెలిసి కూడా తమని లోపలికి పంపి పని చేయమన్నారని కార్మికులు ఆరోపించారు.ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన కార్మికులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదాన్ని గుర్తించని మిగతా వారు అక్కడే చిక్కుకుపోయారని కార్మికులు చెప్పారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడి ప్రాణాలతో బయటకు తీసుకురావాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు ఆక్సిజన్ కోసం ఆరాటపడుతూ, ప్రాణాలతో పోరాటం చేస్తున్నారని టన్నెల్ కార్మికులు చెప్పారు.

ప్రమాదాన్ని ముందే గుర్తించిన కూలీలు
సొరంగంలో కొంతమంది కూలీలు ప్రమాదం గురించి ముందే గుర్తించారు. సెగ్ మెంట్లను అమర్చుకుంటూ ముందుకు వెళతారు. టన్నెల్ తవ్వుకుంటూ పోతుంటారు. టన్నెల్ తవ్వుతుండగా నీరు లీకేజీ అయింది. నీరు లీకేజీని చూసి కార్మికులు బయటకు పరుగులు తీశారు. 30 మీటర్ల దూరం ఏర్పాటు చేసిన సెగ్ మెంట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. నీటి ప్రెషర్ ధాటికి కూలిపోయాయి.

ప్రాణభయంతో పరుగులు తీశారు...
నీటితోపాటు బురద రావడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో మిషనరీ ధ్వంసం అయింది. ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ట్రైన్ ద్వారా రెస్క్యూ టీం లోపలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టారు. అధునాతన సాంకేతిక సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.

ఆటంకాలు అధిగమించి సహాయ చర్యలు
ఈ సహాయ చర్యలు పూర్తి కావాలంటే 200మీటర్ల దూరం బురద, నీటిని తొలగించాలి, మేట వేసిన బురదను తొలగించేందుకు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. టన్నెల్ లోపల బురద, నీరు పేరుకుపోయి ప్రతిబంధకాలు ఏర్పడినా దాన్ని భారీ మోటార్లతో బయటకు తోడేస్తున్నారు. సహాయ చర్యలు పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.

టన్నెల్ లోపల భయానక పరిస్థితులు
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి స్పందన లేదని టన్నెల్ లోపలకు వెళ్లి సహాయ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. లోపల బోరింగ్ మిషన్ వరదనీటికి కొట్టుకువచ్చిందని చెప్పారు. టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందని మంత్రి చెప్పారు. చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదని మంత్రి చెప్పారు.

టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు
సొరంగం కూలిన ప్రాంతంలో చిక్కుకు పోయిన 8 మంది కార్మికులను కాపాడాలనే లక్ష్యంతో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో కొండ పైనుంచి టన్నెల్ లోకి చేరుకునేందుకు 450 మీటర్ల దూరం తవ్వాల్సి ఉందని నిపుణులు చెప్పారు. ఒక వైపు సొరంగంలో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తూనే మరో వైపు నిపుణులతో కార్మికులను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు.

సహాయ చర్యలను సమీక్షిస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాద సహాయక చర్యలను నిరంతరం సమీక్షిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చిక్సిత అందించడంతోపాటు, టన్నెల్ లో చిక్కుకున్న సిబ్బంది, కార్మికుల రక్షణ కోసం అధునాతన లైఫ్ సపోర్ట్ పరికరాలు, రెస్క్యూ మెషీన్‌లను సిద్ధంగా ఉంచామని చెప్పారు.


Tags:    

Similar News