దారిదోపిడీ.. మాస్టర్‌మైండ్‌ను గుర్తించిన పోలీసులు
ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.;
శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు దారి దోపిడీ జరిగింది. ఈ అంశం స్థానికంగా తీవ్రకలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. దోపిడీ వెనక ఉన్న మాస్టర్ మైండ్‌ను గుర్తించారు. దోపిడీతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుడయిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ కారు డ్రైవర్ మధు.. అంతా మాస్టర్ ప్లాన్ వేశాడని, తన గ్యాంగ్‌తో కలిసి రూ.40 లక్షలు దోపిడీ చేయడానికి ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే దారిదోపిడీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ క్రమంలో దుండగులు మధు, అతని సహాయకుడు సాయిబాబా అనే వ్యక్తిపై దాడి చేసినట్లు నటించి.. అనంతరం డబ్బు తీసుకుని పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్.. వికారాబాద్‌లో తనకు రావాల్సిన రూ.40 లక్షల తీసుకురావడం కోసం తన డ్రైవర్ మధు, అతని సహాయకుడు సాయిబాబాను పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకొని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్‌పల్లి మండలం హుస్సేన్‌పూర్-పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు.. తుపాకీ, కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. అయితే కొద్దిదూరం వెళ్లాక నిందితుల కారు బోల్తాపడటంతో రూ.8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి పట్టుకున్నారు. ఈ ఘటనలో మధు అసలు సూత్రధారి అని తేల్చి పోలీసులు ఇంకా వారిని విచారిస్తున్నారు.