‘కేటీఆర్.. మీ రాజకీయ శకం ముగిసింది’

కేటీఆర్, హరీష్ రావు.. బీజేపీలో చేరినట్లు నోటీసులిస్తామన్న మహేష్ కుమార్ గౌడ్.;

Update: 2025-09-13 10:54 GMT

మోదీ మెప్పు కోసమే కేటీఆర్.. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపు నేతల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ వేడి పెరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారంటూ కొన్ని రోజులుగా కేటీఆర్ అంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలను కూడా బీఆర్ఎస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ రావులకు మహేష్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు కూడా బీజేపీలో చేరారంటూ విమర్శలు చేశారు మహేష్. వాళ్లు వెళ్లి మోదీని కలిసిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.

సీపీఐ విచారణ నుంచి బయటపడాలనే..

‘‘సీఎం రేవంత్ రెడ్డిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుస్తారు. కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. రాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌ది కాదు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. కేటీఆర్ మీ రాజకీయ శకం ముగిసింది. మోదీ మోక్షం కోసం కేటీఆర్.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని కవిత చెప్పారు. బీఆర్ఎస్ ఇప్పటికే మానసికంగా బీజేపీలో విలీనం అయిపోయింది. సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవాలని, మోదీ కాళ్లు మొక్కి బయటపడాలని కేటీఆర్ చూస్తున్నారు’’ అని మహేష్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు నేతల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతారని మహేష్ కుమార్ ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలు చెప్పేదే ప్రామాణికం..

‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అనేది స్పీకర్, ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న వ్యవహారం. ఇందులో ఎమ్మెల్యేలు చెప్పేదాన్నే స్పీకర్ ప్రామాణికంగా తీసుకుంటారు. మీరు చేసే విమర్శలు, ఆరోపణలను ప్రామాణికంగా తీసుకోరు. ఇది కూడా మీకు తెలియదా.. పదేళ్లుగా పదవిలో ఉన్నారు కదా’’ అని చురకలంటించారు మహేష్ కుమార్. ఇప్పటికే ఫిరాయింపులకు నోటీసులు ఇవ్వడం, వారు సమాధానాలు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. వాటి ఆధారంగా స్పీకర్ ముందుకు వెళ్తారని స్పష్టం చేశఆరు.

దేశం విడిపోయింది..

‘‘ఉపరాష్ట్రపతి పోరులో తెలంగాణ వాది సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి నిలబెట్టింది. కానీ తెలంగాణ తన ఊపిరి అని చెప్పుకునే బీఆర్ఎస్ మాత్రం మద్దతు ఇవ్వలేదు. ఆ విషయాన్ని వాళ్లు సిగ్గులేకుండా చెప్పుకున్నారు. దేశం మోదీ, రాహుల్ గాంధీగా విడిపోయింది. రాహుల్ గాంధీ.. దేశభవిష్యత్తు, రాజ్యాంగాన్ని కాపాడాలని తపన పడుతున్నారు. సీబీఐ, ఈడీలపై నమ్మకం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆ విషయంలో నేను కూడా రాహుల్‌తో ఏకీభవిస్తున్నా. అందుకే కేటీఆర్ లాంటి వాళ్ళతో మోదీ మాట్లాడిస్తున్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పజెప్పితే 48 గంటల్లో తెలుస్తామన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎందుకు మాట్లాడటం లేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, రాజ్యాంగం మార్చి మనువాద రాజాకీయం చేయాలనుకున్న బీజేపీతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది’’ అని మహేష్ విమర్శించారు.

Tags:    

Similar News