రక్తసిక్తం అవుతున్న అభయారణ్యాల రోడ్లు..నేలకొరుగుతున్న వన్యప్రాణులు
తెలంగాణలోని అభయారణ్యాల మీదుగా వెళుతున్న రోడ్లు వన్యప్రాణులకు ప్రాణసంకటంగా మారాయి.;
By : Saleem Shaik
Update: 2025-09-13 09:09 GMT
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పులులు, వన్యప్రాణుల అభయారణ్యాల మీదుగా వెళుతున్న రహదారులు (Road Safety) వన్యప్రాణుల మ్యత్యువాతతో రక్తసిక్తమవుతున్నాయి.అడవుల్లో రాత్రివేళ చిరుతపులులు, జింకలు, కోతులు,అడవి పందులు, ఎలుగుబంట్లు ఇలా ఒకటేమిటి పలు రకాల వన్యప్రాణులు రోడ్డు దాటుతూ వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొనడంతో రోడ్లపై మరణిస్తున్నాయి.(Highway Accident) ఇటీవల తెలంగాణ జాతీయ రహదారులపై రాత్రివేళలో జరిగిన ప్రమాదాల్లో రెండు చిరుతపులులతో పాటు పలు వన్యప్రాణులు నేలకొరిగాయి.
అభయారణ్యాల మధ్యలో నుంచి రోడ్లు
తెలంగాణ రాష్ట్రంలోని అభయారణ్యాల గుండా పోతున్న పలు రోడ్లపై చిరుతపులులు, వన్యప్రాణులు మరణిస్తున్నాయి.రాత్రివేళల్లో రిజర్వ్ ఫారెస్టులోని వివిధ రకాల వన్యప్రాణులు మేత, మంచినీటి కోసం తరచూ రోడ్డు దాటుతుంటాయి. వన్యప్రాణులు రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు వాటిని ఢీకొని బలిగొంటున్నాయి.దేశంలో అడవుల గుండా 55వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అయితే తెలంగాణలోని అడవుల జిల్లాల్లో అమ్రాబాద్ (Amrabad Tiger Reserve), కవ్వాల్ అభయారణ్యాలతోపాటు వన్యప్రాణుల అభయారణ్యాల గుండా పలు జాతీయ, రాష్ట్ర రోడ్లను నిర్మించారు. శ్రీశైలం నుంచి మన్ననూర్ వరకు జాతీయ రహదారి అమ్రాబాద్ పులుల అభయారణ్యం మధ్యలోనుంచి వెళుతుంది. మెదక్- నర్సాపూర్ రోడ్డు, రామాయంపేట- కామారెడ్డి, నిజామాబాద్ - నిర్మల్, నిర్మల్ టు ఆదిలాబాద్, ఉట్నూరు - లక్సెట్టిపేట, ఉట్నూర్-ఖానాపూర్- నిర్మల్, నాగార్జునసాగర్ రోడ్లు దట్టమైన అభయారణ్యాల మీదుగా వెళుతున్నాయి.రోడ్లే కాకుండా పలు దట్టమైన అడవుల మీదుగా రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. వన్యప్రాణులు రైల్వే లైన్లను దాటుతున్నపుడు రాకపోకలు సాగించే రైళ్ల కింద పడి వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వన్యప్రాణుల మృత్యువాత
అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు అటవీ ప్రాంతం గుండా రోడ్లు వేయడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అడవి జంతువులు తరచూ చనిపోతున్నాయి.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.అటవీ శాఖ అధికారులు సేకరించిన డేటా ప్రకారం ఈ ప్రాంతంలో ప్రతి నాలుగు రోజులకు ఒక వన్యప్రాణి మరణిస్తుంది.తెలంగాణ అటవీ శాఖ అధికారుల ప్రకారం రాష్ట్రంలో ఐదు చిరుతపులుల మరణాలు నమోదయ్యాయి.రోడ్లపై వాహనాల కింద పడి మరణిస్తున్న పాములు, పునుగు పిల్లులు, కోతుల సంఖ్య లెక్కకు మించి ఉన్నాయి.ప్రమాదాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడుతుండటంపై వన్యప్రాణుల ప్రేమికుడైన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అధ్యక్షుడు హరికృష్ణ ఆడెపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ అటవీ రోడ్లపై వరుస ప్రమాదాలు
- 2025 సెప్టెంబరు 5 : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోపల జాతీయ రహదారి-పై ట్రక్కు కింద పడి ఓ పునుగు పిల్లి ప్రాణాలు కోల్పోయింది.దీంతో శ్రీశైలం- మన్ననూర్ జాతీయ రహదారి రక్తసిక్తంగా మారింది.
- 2025 సెప్టెంబరు 2 : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికిందార్‌పూర్ సమీపంలో వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుతపులి ప్రాణాలు కోల్పోయింది. అటవీ అధికారులు చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
- 2025,జనవరి 31 : మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ గ్రామం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఓ చిరుతపులి రోడ్డు దాటుతోంది. అంతలో గుర్తుతెలియని వాహనం వేగంగా వస్తూ చిరుతపులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల వయసు గల చిరుతపులి అడవిలో నుంచి రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోయింది. మృత్యువాత పడిన చిరుతపులికి పోస్టుమార్టం చేసి పూడ్చిపెట్టారు.
-2021 మార్చి 7 : వరంగల్ జిల్లా పాఖాల వన్యప్రాణుల అభయారణ్యంలో రోడ్డుపై వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం జింకను ఢీకొట్టింది. ఈ ఘటనలో జింక తీవ్రంగా గాయపడటంతో దాన్ని వరంగల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటరుకు తరలిస్తుండగా అది ప్రాణాలు కోల్పోయింది.
- 2020వ సంవత్సరంలో హైదరాబాద్- నాగపూర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఓ చిరుతపులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిరుతపులి మృత్యువాత పడింది.
- కామారెడ్డి జిల్లాలోని దగ్గి అటవీ ప్రాంతంలోని జాతీయ రహదారి 44పై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకటిన్నర సంవత్సరాల వయసున్న చిరుతపులి చనిపోయింది.
- మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలో ఒక కృష్ణజింక తీవ్రంగా గాయపడింది. ఆంధోల్ మండలంలో కన్సాన్‌పల్లి సమీపంలోని నాందేడ్-అకోలా హైవేపై మరో కృష్ణ జింక మృతి చెందింది.
- కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చుక్కల జింక గాయపడింది. ఇటీవల నర్సాపూర్ అటవీ ప్రాంతం సమీపంలో వేగంగా వస్తున్న కారు ఒక ముంగిసను ఢీకొట్టింది. అనేక ఉడుతలు, పాములు, కోతులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయాయి.
ఏడాదిలో 83 చిరుతపులుల మృతి
వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WPSI) డేటా ప్రకారం దేశంలో 2019వ సంవత్సరంలో రోడ్డు. రైలు ప్రమాదాల కారణంగా చిరుతపులుల మరణాల సంఖ్య దశాబ్దంలో అత్యధికంగా ఉంది. 2019వ సంవత్సరంలో రైలు, రోడ్డు ప్రమాదాల్లో 83 చిరుతపులుల మరణాలు నమోదయ్యాయి.రోడ్లపై గాయపడిన జంతువులకు తక్షణం ప్రథమ చికిత్స అందించడానికి అటవీ శాఖకు అంబులెన్స్‌లను అందించలేదు. దీంతో వన్యప్రాణుల మరణాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.మహారాష్ట్రలో 22, ఉత్తరాఖండ్‌లో 11, రాజస్థాన్ లో 10, మధ్యప్రదేశ్ లో 9, కర్ణాటక లో 7 ,గుజరాత్ లో ఐదు చిరుతపులులు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించాయి.
అమ్రాబాద్ అభయారణ్యంలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇటీవల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోపల జాతీయ రహదారిపై పునుగుపిల్లి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి వేళల్లో అతివేగంగా వస్తున్న వాహనాల వల్ల వన్యప్రాణులు తరచూ నేలకొరుగుతున్నాయని అమ్రాబాద్ అటవీశాఖ అధికారి గోపిడి రోహిత్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులులు, వన్యప్రాణులకు (Wildlife Protection) నిలయంగా ఉన్న అమ్రాబాద్ పులుల అభయారణ్యం మధ్యలో నుంచి నిర్మించిన జాతీయ రహదారి వన్యప్రాణుల పాలిట ప్రాణసంకటంగా మారిందని ఆయన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాత్రివేళ అటవీ రోడ్లపై వాహనాల రాకపోకలపై నిషేధం
రాత్రివేళ రోడ్డు దాటుతున్న వన్యప్రాణులు ప్రమాదాల బారిని పడకుండా ఉండాలనే ఉద్ధేశంతో తాము రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూర్ -శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలను అటవీశాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిలిపివేశామని డీఎఫ్ఓ గోపిడి రోహిత్ రెడ్డి వివరించారు. దీంతోపాటు అటవీ మధ్యలో ఉన్న రోడ్లపై వాహనాల వేగ పరిమితిని గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిమితిని విధించామని ఆయన తెలిపారు. లక్కెట్టిపేట- ఉట్నూరు, ఖానాపూర్, నిర్మల్ అటవీ రోడ్లపై రాత్రి వేళ వాహనాల రాకపోకలను నిలిపివేసినా వన్యప్రాణుల ప్రమాదాలకు తెరపడటం లేదు. రాత్రివేళల్లో కొన్ని అటవీ మార్గాల్లో వాహనాల వేగ నియంత్రణ చర్యలు పాటించక పోవడం వల్ల ప్రమాదాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడుతూనే ఉన్నాయని ఆదిలాబాద్ అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
స్పీడ్ లిమిట్ పాటించే వారేరి?
తెలంగాణ రాత్రివేళ రోడ్లపై గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడపాలని, వన్యప్రాణులు రోడ్డు దాటుతున్నపుడు వాటిని ఢీకొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైల్డ్ లైఫ్ అధికారులు కోరుతున్నా, వాహనచోదకులు ఎవరూ పట్టించుకోవడం లేదు.తెలంగాణ రాష్ట్రంలోని అడవుల మీదుగా సాగుతున్న రోడ్లపై వన్యప్రాణులు రోడ్డు దాటేందుకు వీలుగా అండర్ పాస్ లు నిర్మించాలని ప్రతిపాదించారు.కానీ ఇంకా అండర్ పాస్ ల నిర్మాణం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2013వ సంవత్సరంలో జాతీయ రహదారులపై 3,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మంజీరా, నర్సాపూర్, పోచారం,అమీన్‌పూర్ వంటి ప్రధాన పక్షుల సందర్శనా కేంద్రాలు ఉన్నందున, పక్షుల సంచారం కూడా పెరిగింది.
అభయారణ్యాల్లో రోడ్లకు ఫెన్సింగ్ ఏది?
మరో వైపు తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో జాతీయ రహదారులకు రెండు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ వన్యప్రాణి విభాగం చీఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు జాతీయ రహదారుల సంస్థకు లేఖ రాశారు. ఇటీవల జాతీయ రహదారులపై రెండు చిరుతపులులు మరణించిన నేపథ్యంలో అభయారణ్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపు ఫెన్సింగ్ నిర్మించాలని రాసిన లేఖతో జాతీయ రహదారుల విభాగం రోడ్లపై ఫెన్సింగ్ వేసేందుకు టెండర్లు పిలిచినా పనులు ప్రారంభించలేదు. దట్టమైన అడవులున్న ప్రాంతాల్లో చిరుతపులులు, వన్యప్రాణులు రాత్రివేళల్లో రోడ్డు దాటుతుంటాయని వన్యప్రాణి విభాగం చీఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనికోసం పలు అటవీ రోడ్లకు ఇరువైపులా వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తాము నేషనల్ హైవేస్ అథారిటీని కోరామని ఆయన చెప్పారు.
వన్యప్రాణులను కాపాడుకోవాలి : ఎ శంకరన్
తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల మీదుగా ఉన్న రోడ్లపై వన్యప్రాణులు మరణించకుండా (Save Wild life) ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేందుకు తమ తెలంగాణ వన్యప్రాణి విభాగం పలు ప్రతిపాదనలు చేసిందని తెలంగాణ వైల్డ్ లైఫ్ సీనియర్ అధికారి ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మరణించకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. వేగనియంత్రణ చర్యలు పాటించడం, రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ వేయడం,వైల్డ్‌లైఫ్ క్రాసింగ్ సైన్‌బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.(human animal conflict) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టం ద్వారా అడవుల గుండా వెళ్లే రోడ్లపై అధిక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహన వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు, వైల్డ్‌లైఫ్ క్రాసింగ్ సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలని తాము రహదారుల శాఖకు ప్రతిపాదించామని ఆయన చెప్పారు.