నియోజక వర్గాల పునర్విభజనపై సుప్రీం కీలకతీర్పు

ఏపీ,తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటీషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు;

Update: 2025-07-25 07:36 GMT

ఆంధ్రప్రదేశ్‌,తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది.కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జన గణన తరువాతే నియోజక వర్గాల పెంపు వుంటుందని కోర్టు తేల్చేసింది.నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి ఈ పిటీషన్ వేశారు. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌సింగ్‌ ధర్మాసనం ఈ పిటీషన్ పై విారణ జరిపి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. జమ్ముకశ్మీర్‌లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్‌ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2026లో మొదటి జన గణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని ఆ విషయాన్ని గుర్తించాలని తెలిపింది.ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని, గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. జమ్మూకశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మినహాయించడం,ఏకపక్షం, వివక్ష కాదని స్పష్టం చేస్తూ పురుషోత్తం రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది.జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ధర్మాసనం , ఏపీ, తెలంగాణలను పునర్విభజన నోటిఫికేషన్‌ నుండి మినహాయించడంలో కేంద్రానికి ప్రత్యేక ఉద్దేశ్యం లేదని తేల్చింది.
Tags:    

Similar News