మిఠాయిలు,మిక్సీలు,మద్యం...ఓటర్లను ఆకట్టుకునే త్రిముఖ పోరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్రమాల హోరు... 58 కేసులు నమోదు
By :  Saleem Shaik
Update: 2025-11-04 05:42 GMT
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. నవంబర్ 11న జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బస్తీల్లో, కాలనీల్లో మిఠాయిలు, బహుమతుల టోకెన్లు, కుక్కర్లు, మిక్సీలు గుప్తంగా పంపిణీ అవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటర్ల మద్దతు కోసం డబ్బు, మద్యం, బిర్యానీ విందులు పంచే రాజకీయ పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నా, ఓట్ల కోసం జరుగుతున్న ప్రలోభాల యుద్ధం నియోజకవర్గ రాజకీయాల నిజ చిత్రాన్ని బయటపెడుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ నవంబరు 11వతేదీన జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల యత్నాలు సాగిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీల కార్యకర్తలు మిఠాయిలతో పాటు బహుమతుల టోకెన్ల పంపిణీ ప్రారంభించారని బస్తీల్లో ఓటర్లు చెబుతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల నేతలు తమ ప్రచారంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే యత్నాలు ముమ్మరం చేశారు. 
మహిళలు, మైనారిటీలే కీలకం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మైనారిటీలు కీలకంగా మారారు. దీంతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కుక్కర్లు, మిక్సీలు, ఇతర ఇంటి పరికరాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సమాయత్తం అయ్యాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం పంపిణీ చేసేందుకు రెసిడెన్షియల్ కాలనీలు, బస్తీల వారీగా ఆయా పార్టీల నేతల వద్ద కుక్కర్లు, మిక్సీలు దాచి ఉంచారని సమాచారం. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి తాజాగా 50వేల కుక్కర్లు, మిక్సీలను హోల్ సేల్ డీలరుకు నాలుగు రోజుల క్రితం ఆర్డరు ఇచ్చారు. దీంతో అవి గోదాము నుంచి నియోజకవర్గంలోని బస్తీలకు చేరాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్యకర్త చెప్పారు. ఓటర్లు తప్పకుండా ఓటు వేస్తామని అలాగే డబ్బుకు, మద్యానికి లొంగకుండా మంచివారికి ఓటు వేస్తామని ఒట్టుపెట్టుకోవాలని విశ్రాంత ఐఎఎస్ యం.వి.రెడ్డి సూచించారు. 
ఓటర్లకు స్వీట్ బాక్సులు, బహుమతుల టోకెన్లు
మరో అభ్యర్థి అయితే ఓటర్లకు స్వీట్ బాక్సులు, బహుమతుల టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేశారని సమాచారం. ఎన్నికల్లో కుక్కర్లు, మిక్సీలు పంపిణీ చేయకుండా వాటికి సంబంధించి గిప్ఠు టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు బోరబండకు చెందిన సయ్యద్ షరీఫ్ అనే ఓటరు చెప్పారు. మూడు పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు ఉండటంతో  ఒక్కో అభ్యర్థి రూ.300 కోట్ల మేరకు మద్యం, డబ్బు, స్వీట్లు, ఇతర బహుమతుల పంపిణీ చేస్తున్నారని బోరబండ ఓటర్లే ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం రూ.40 లక్షల వెచ్చించుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యయ పరిమితి విధించింది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఎన్నికల వ్యయం ఆరు రెట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఈ ఎన్నికల ప్రచార పర్వంలో కార్యకర్తలకు తాగినంత మద్యం, తిన్నంత బిర్యానీ పెడుతున్నారని ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త సీహెచ్ సందీప్ రెడ్డి చెప్పారు.ఎన్నికల కమిషన్ ప్రతి అభ్యర్థి రూ.40 లక్షలకు మించకుండా ఖర్చు చేయాలని నిబంధన ఉన్నా అభ్యర్థులు దీనికి ఎన్నో రెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  వైస్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి ఆరోపించారు.    
జూబ్లీ అభ్యర్థులపై కేసులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఏడు క్రిమినల్ కేసులు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిపై 5 కేసులు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఒక కేసు పెండింగులో ఉన్నాయి. నవీన్ యాదవ్ పై ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మధురానగర్ పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్, ప్రజాప్రాతినిథ్య చట్టం  127, 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై క్రిమినల్, ఛీటింగ్ కేసులు నాంపల్లి కోర్టులో పెండింగులో ఉన్నాయి. నవీన్ పై 2006 నుంచి 2021, 2025 సంవత్సరాల్లో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిపై 2021,2024 లలో అయిదు కేసులు పెండింగులో ఉన్నాయి. దీపక్ రెడ్డిపై ఛీటింగ్, ప్రభుత్వ ఉత్తర్వుల బేఖాతర్, ఓటర్లను ప్రభావితం చేశారనే కేసులున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 2024 వ సంవత్సరంలో ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 188 ప్రకారం కేసు పోలీసులు కేసు పెట్టారు. 
ఇదీ అభ్యర్థుల క్రిమినల్ కేసుల చిట్టా 
నవీన్ యాదవ్, కాంగ్రెస్  : 7 కేసులు
లంకల దీపక్ రెడ్డి, బీజేపీ: 5 కేసులు
ఎం సునీత, బీఆర్ఎస్    : 1కేసు
ఫిర్యాదుల పర్వం 
పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన 58 కేసులను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నమోదు చేశారు. వీటిలో 14 కేసులు పోటీలో ఉన్న అభ్యర్థులపై ఉండటం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పలువురు పార్టీ కార్యకర్తలపై 14 కేసులను పోలీసులు నమోదుచేశారు.బీఆర్ఎస్ కార్యకర్తలు జమా మసీదు వద్ద ప్రచారం చేశారని ఫిర్యాదు నమోదైంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఓటర్లకు మొబైల్ ఫోన్ బహుమతిగా ఇస్తున్నట్లు ఉండటంతో దీని ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు.ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, ఆయన సోదరుడు వెంకట్‌యాదవ్‌పై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు పెట్టారు.
58 మంది బరిలో ఉన్నా, ప్రధానంగా త్రిముఖ పోరు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన అదికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా త్రిముఖ పోరు సాగుతుంది.ఈ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న కొత్త ఓటర్లు 6,106 మంది ఉన్నారని ఎన్నికల అధికారులు చెప్పారు. 
గత ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం పట్టిక 
2023అసెంబ్లీ పోరు ఫలితం
ఎం గోపినాథ్ బీఆర్ఎస్ : 80,549      43.94 శాతం
          అజారుద్దీన్, కాంగ్రెస్    : 64,212      35.03 శాతం 
         ఎల్ దీపక్ రెడ్డి, బీజేపీ    : 25,866      14.11 శాతం
        మహ్మద్ రషీద్,ఎంఐఎం:    7,848       4.28 శాతం
2018అసెంబ్లీ పోరు ఫలితం
ఎం గోపినాథ్ బీఆర్ఎస్ : 68,978         44.30 శాతం
          పి విష్ణువర్ధన్, కాంగ్రెస్:52,975          34.02 శాతం 
         రావుల శ్రీధర్, బీజేపీ    :8,517               5.47 శాతం
        నవీన్ యాదవ్ (ఇండి): 18,817           12.09శాతం
ఎన్నెన్నో ప్రజా సమస్యలు...
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నెన్నో ప్రజల సమస్యలు ఎన్నికల్లో అభ్యర్థుల ముందుకు వచ్చాయి. చినుకు పడితే చాలు ఈ నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీలు జలమయం అవుతున్నాయి. ముస్లింలకు శ్మశానవాటిక పెద్ద సమస్యగా మారింది. ఎవరైనా మరణిస్తే ఖననం చేద్దామంటే శ్మశానవాటికలో స్థలం లేదు. విద్యుత్, నల్లా నీటి సరఫరాలో సమస్యలున్నాయి.  రహమత్ నగర్‌లో ఇరుకురోడ్లు, రోడ్ల ఆక్రమణ, పొంగిపొర్లుతున్న డ్రైనేజి సమస్యలున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు.షేక్‌పేట్ లో దశాబ్ధ కాలంగా తాము బస్సు సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్నామని స్థానిక ఓటర్లు చెప్పారు. యూసఫ్‌గూడ లోని ఇందిరానగర్ కాలనీలో  కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్ల  లోపలకు నీరు వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదనగా చెప్పారు. పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం లేదని ఓటర్లు ఆరోపించారు. ఇరుకు, గుంతలరోడ్లు, ఫుట్‌పాత్ లు, రోడ్ల ఆక్రమణలు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీ సమస్యలను గత దశాబ్ధకాలంగా ఉన్న ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని స్థానిక బస్తీల ప్రజలు చెప్పారు.  
50 శాతం మించని పోలింగ్ 
జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోలింగు శాతాన్ని పరిశీలిస్తే 50 శాతం కంటే తక్కువగా ఉంది.  గ్రామాల్లో పోలింగు 80శాతం వరకు ఉండగా పట్టణాల్లో 60శాతం మించడం లేదు.  సంపన్నుల నియోజకవర్గంగా పేరొందిన జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గానికి వస్తే ఎన్నడూ కూడ 50శాతం పోలింగ్ మించడం లేదు. పోలింగు శాతం పెంచడానికి అలాగే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచివారికి ఓటువేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఓటరు  అవేర్‌నెస్ కార్యక్రమం చేపట్టింది.‘‘నేనొక్కడిని ఓటు వేయనంత మాత్రాన పెద్దగా మార్పు ఏమీ ఉండదు అనే నిర్లిప్తత నగర  ప్రజల్లో ఉంది’’విశ్రాంత ఐ.ఏ.ఎస్.నాగిరెడ్డి చెప్పారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నాయని, దీనిని అరికట్టాలంటే ఓటర్లలో చైతన్యం రావాలని  మాజీ ఐఎఎస్ అధికారి చంద్రవదన్ కోరారు.
ఓటర్లను ప్రలోభపెట్టవద్దు
రాజకీయపార్టీలను  డబ్బు, మద్యం వంటి వాటితో ఓటర్లను ప్రలోభపెట్టవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం. పద్మనాభరెడ్డి కోరారు.  మతం, కులం, ప్రాంతం పేరున లేదా భయభ్రాంతులు చేస్తూ ఓట్లు అడగవద్దని ఆయన సూచించారు. ఉప ఎన్నికల్లో జూబ్లిహిల్స్ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేసి పోలింగ్ శాతం పెంచాలని కోరారు. ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్థి నచ్చని పక్షంలో నోటాకైన ఓటు వేయండని పద్మనాభరెడ్డి కోరారు. 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారిందో, అంతే స్థాయిలో డబ్బు, బహుమతులు, ప్రలోభాల ఆట కూడా సాగుతోంది. అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, ప్రచార వ్యయాలు, ప్రజా సమస్యలు...ఇవన్నీ ఓటర్ల ముందు పెద్ద సవాలుగా నిలిచాయి. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ఓటరుదే అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని మాజీ ఐఎఎస్ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల ఫలితం ఎవరికి అనుకూలించినా, జూబ్లీహిల్స్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కొత్త నాయకత్వం నిజమైన మార్పు తీసుకురావాలని ఓటర్లు ఆకాంక్షిస్తున్నారు.