చేవెళ్ళ రోడ్డులో బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదేనా ?

గడచిన ఐదేళ్ళుగా ఈ రోడ్డుమీద కొన్ని వందల ప్రమాదాలు జరిగాయి.

Update: 2025-11-03 12:00 GMT
Chevella National High way

సోమవారం తెల్లవారుజామున చేవెళ్ళ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగినప్పటి నుండి స్ధానికుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఎవరిని కదిలించినా రోడ్డు విస్తరణను అడ్డుకున్న పర్యావరణ ప్రేమికులే రోడ్డు ప్రమాదం జరగటానికి కారణమంటు జనాలు మండిపోతున్నారు. పర్యావరణ ప్రేమికులకు, రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవటానికి లింకు ఏమిటసలు ? ఏమిటంటే హైదరాబాద్-బీజాపూర్ మధ్య జాతీయ రహదారి 163 చాలా కీలకమైనది. ఈ నేషనల్ హై వే ఎంతటి కీలకమైనదో ప్రమాదాలకు కూడా అంతే కేంద్రబిందువుగా నిలుస్తోంది. గడచిన ఐదేళ్ళుగా చూస్తే ఈ రోడ్డుమీద కొన్ని వందల ప్రమాదాలు జరిగాయి.

ఈ రోడ్డుమీదే ఇన్ని ప్రమాదాలు జరగటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఆ రోడ్డు చాలా ఇరుకైనది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేషనల్ హైవే పొడవు కొన్ని వందల కిలోమీటర్లున్నప్పటికీ ముఖ్యంగా 45 కిలోమీటర్లు మరింత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మార్గం చాలా ఇరుకైనది. ఈ రోడ్డుకు రెండువైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. గుంతలు, మలుపులతో రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇరుకు రోడ్లవల్ల మొయినాబాద్ నుండి చేవెళ్ళ వరకు ప్రతిరోజు ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఏడాదిలో వందలాదిమంది రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతుంటారు. అందుకనే పోలీసు అకాడమి నుండి మన్నెగూడ వరకు ఉన్న 45 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని హైవే అథారిటి డిసైడ్ చేసింది.

ఇంత బిజీగా, ఇరుకుగా ఉన్న రోడ్డును విస్తరించాలని నేషనల్ హై వే అథారిటి భావించింది. అయితే హైవేలో మిగిలిన రోడ్డును విస్తరణ చేసిన అథారిటి 45 కిలోమీటర్ల రోడ్డును మాత్రం విస్తరించలేకపోయింది. కారణం ఏమిటంటే విస్తరణను వ్యతిరేకిస్తు ‘చేవెళ్ళ బన్యాన్ గ్రూప్’ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటీషన్ దాఖలుచేయటమే

బీఆర్ఎస్ హయాంలోనే రోడ్డు విస్తరణకు రు. 920 కోట్లు మంజూరైంది. అయితే రోడ్డుకు రెండువైపులా ఉన్న వందలాది చెట్లకు హాని జరుగుతుందనే కారణంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో చేవెళ్ళ బన్యాన్ గ్రూప్ కేసు దాఖలుచేసింది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావటంతో రోడ్డు విస్తరణ పనులు అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్డు విస్తరణ పనులపై దృష్టిపెట్టింది. స్ధానిక ప్రజాప్రతినిధులతో కలిపి బన్యాన్ గ్రూప్ తో ప్రభుత్వం మంతనాలు జరిపింది. అన్నీవైపుల నుండి హైవే అథారిటి మీద ప్రభుత్వం ఒకవిధంగా ఒత్తిడి పెంచింది. దాని ఫలితంగా చెట్లకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు డిజైన్లో మార్పులకు అథారిటి అంగీకరించింది.

బన్యాన్ టీమ్ వాదన ఏమిటంటే 45 కిలోమీటర్ల రోడు నిడివిలో సుమారు 900 మర్రిచెట్లు ఉన్నాయి. వాటిని రోడ్డు విస్తరణ పేరుతో అథారిటి కొట్టేసే ప్రమాదముంది. కాబట్టి విస్తరణ పేరుతో చెట్లను కొట్టకూడదని 2021లో కేసు దాఖలు చేసింది. బన్యాన్ టీమ్ పిటీషన్ ఆధారంగా ట్రైబ్యునల్ అథారిటికి నోటీసులు జారీచేసింది. అనేకసార్లు ట్రైబ్యునల్ ముందు ఇటు బన్యాన్ టీమ్ అటు అథారిటి తమ వాదనలు వినిపించాయి. రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కామని విస్తరణ పేరుతో చెట్లను కొట్టకుండా అథారిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పమని మాత్రమే అడుగుతున్నట్లు వాదనలు వినిపించింది బన్యాన్ టీమ్.

ఇలా రెండువైపుల వాదనలు సుమారు నాలుగేళ్ళు సాగింది. చివరకు చెట్లకు ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ చేపడతామని అథారిటి ట్రైబ్యునల్ కు హామీ ఇచ్చింది. అథారిటి ఇచ్చిన హామీతో బన్యాన్ టీమ్ కూడా సంతృప్తిచెందింది. దాంతో చెట్లను కొట్టకుండా రోడ్డు విస్తరణ పనులు చేసుకోవచ్చని ట్రైబ్యునల్ నేషనల్ హైవే అథారిటిని వారం రోజుల క్రితమే ఆదేశించింది. ఉత్తర్వులు అందగానే పనులు మొదలుపెట్టేందుకు అథారిటి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంతలోనే ఈరోజు తెల్లవారుజామున బస్సు-టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 24 మంది చనిపోయారు.


విస్తరణకు వ్యతిరేకం కాదు

రోడ్డు విస్తరణకు తమ గ్రూప్ వ్యతిరేకం కాదని బన్యాన్ గ్రూప్ సభ్యుడు తేజా బాలాంత్రపు చెప్పారు. ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘‘జాతీయ రహదారుల విస్తరణ పేరుతో చెట్లను కొట్టడానికి మాత్రమే తాము వ్యతిరేకం’’ అన్నారు. ‘‘చెట్లను కొట్టకుండా రోడ్డు విస్తరణ పనులను చేసుకోవటానికి తాము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు’’ అని చెప్పారు. ‘‘2021లో తాము నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటీషన్ వేస్తే అది ఇపుడు ఒక కొలిక్కి వచ్చింది’’ అన్నారు. ‘‘అనేక వాయిదాలు, చర్చలు, వాదనల తర్వాత చెట్లకు ఎలాంటి నష్టం జరగకుండా రోడ్డు డిజైన్ మార్చుకుంటామని హైవే అథారిటి ట్రైబ్యునల్ కు హామీ ఇచ్చింది’’ అన్నారు.

‘‘45 కిలోమీటర్ల నిడివిలోని 765 చెట్లకు ఇబ్బందులు లేకుండా రోడ్డు డిజైన్ మార్చుకుంటామని, 136 చెట్లను విస్తరించిన రోడ్డుకు పక్కనే రీలోకోట్ చేస్తామని అథారిటి ట్రైబ్యునల్ కు ఇచ్చిన హామీతో తాము కూడా సంతృప్తిచెందాము’’ అని తేజ తెలిపారు. ‘‘ట్రైబ్యునల్ కు అథారిటి హామీ ఇచ్చింది వారం క్రితమే’’ అని తేజ చెప్పారు. కాబట్టి రోడ్డు విస్తరణ పనులను అథారిటి ఎప్పుడైనా మొదలుపెట్టచ్చని తెలిపారు.

Tags:    

Similar News