'కెటిఆర్ నిర్లక్ష్యం వల్లే చేనేత రంగం కుదేలయింది'

చేనేతలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Update: 2024-06-25 14:33 GMT


మరమగ్గాల, చేనేత మగ్గాల ఆధునీకరణకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి కేటాయించబడిన 400 కోట్ల బడ్జెట్ వినియోగించుటకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డి  దీనికి  అంగీకరించారు. ఈ విషయాన్ని  వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


గతంలో కేటీఆరే చేనేత జౌళిశాఖ మంత్రిగా ఉన్నప్పటికి చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ మీద ఏ మాత్రం శ్రద్ధ చూపలేదేని, ఆ ప్రభుత్వం  మార్కెటింగ్ ను మెరుగుపరిచి ఉంటే ఇప్పుడు సంక్షోభం వచ్చేది కాదని  ఆయన అన్నారు.


 అన్ని ప్రభుత్వశాఖల వారు టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయుటకు  ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఈ ఆదేశాల ప్రకారం టెస్కో నుండి NOC (నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్) లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేటు మార్కెట్ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. దీనివలన వివిధ ప్రభుత్వ శాఖల నుండి సుమారుగా 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం రావడం జరిగిందని, వాటి ఉత్పత్తి కోసం ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందని మంత్రి వెల్లడించారు.

"మా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక చేనేత సహకార సంఘాల సభ్యులకు పని కల్పించుటకు, నేటివరకు సుమారుగా 53 కోట్ల విలువైన వస్త్రాలు కొన్నాం, అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాలలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యులందరికీ పని కలిపించుటకు చర్యలు తీస్కోవటం జరిగింది,ష అని మంత్రి వెల్లడించారు.

డిసెంబర్ 2023 నుండి కొనుగోలు చేసిన వస్త్రములకు సంబంధించి పేమెంట్లను వెంటవెంటనే విడుదల చేస్తున్నామని, సమగ్ర శిక్షణ పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50 శాతం అడ్వాన్సు సుమారుగా రూ. 50 కోట్లు, నూలు కొనుగోలు, సైజింగ్ కోసం విడుదల చేశామన్నారు. దీని ద్వారా నాణ్యమైన నూలు కొనుగోలు చేసి వస్త్ర ఉత్పత్తులకు సుమారుగా 20.00 కోట్లు విలువైన నూలు సరఫరా చేయటమైనది. NHDC ద్వారా కొనుగోలు చేసిన నూలు ఖరీదుకు సంబంధించి 2.96 కోట్లు సంబధిత MACS / SSI Units / Sizing Units కు అడ్వాన్సుగా విడుదల చేయటం జరిగిందన్నారు.


ఈ రోజు  సచివాలయంలోని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్, చేనేత జౌలి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ... చేనేతలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ దొంగే.. దొంగ, దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత పదేళ్ళలో చేనేత రంగాన్ని అన్నిస్థాయిలలో అస్తవ్యస్తం చేసి, స్వంత లాభాలకు వాడుకుని ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

చేనేత ఉత్పత్తులకు ఈ – మార్కెటింగ్ :

గతంలో మంత్రిగా పనిచేసిన ఐటి మంత్రిగా ఉన్న కేటీఆరే చేనేత జౌళిశాఖ మంత్రిగా ఉన్నప్పటికి చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ విషయంలో ఏ మాత్రం చొరవ చూపించకపోవటం వలన వారి హయాంలో చేనేత ఉత్పత్తులకు ఈ – మార్కెటింగ్ అమలు కాబడలేదు. మా ప్రభుత్వం ద్వారా ఈ-మార్కెటింగ్ చేయుటకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతూ, చేనేత కార్మికుల ఉత్పత్తుల అమ్మకాలకుగాను వెసులుబాటు కల్పించి వారికి పూర్తి స్థాయిలో వృత్తిపై ఆదాయం పెంచే ప్రయత్నం చేయుచున్నామని మంత్రి పేర్కొన్నారు.

నేతన్నలకు మేమే పని కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు నేతన్నలకు చేసిన మోసాలు మచ్చుకు కొన్ని....

1) 2023 బతుకమ్మ చీరల పథకము క్రింద టెస్కో కు చెల్లించవలసిన 351.52 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు, వీటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.100 కోట్లు విడుదల చేయనుంది.

2) సమగ్ర శిక్ష 2023-24 పథకము కింద గత ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 108 కోట్లు, వీటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయనుంది.

3) గత ప్రభుత్వం నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వివిధ ప్రభుత్వశాఖలకు సరఫరా గావించబడిన వస్త్రముల బకాయిలు టెస్కోకు చెల్లించవలసి ఉన్నది.

ఎన్ని లేఖలు రాసినా ప్రజలు పట్టించుకోరు...

గత ప్రభుత్వ హాయాంలోని అవినీతి, అవలంభించిన అస్తవ్యస్త విధానాల ద్వారా జరిగిన నష్టాన్ని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ నాయకులు పూటకో మాట మాట్లడుతూ నేతన్నలను, రాష్ట్రప్రజలను తప్పుదారి పట్టించాలనుకుంటున్నారన్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన మోసాలు అన్ని తెలుసని అందుకనే ప్రస్తుతం మీకు ఈ గతి పట్టిందని మంత్రి విమర్శించారు. మీరెన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని లేఖలు రాసిన మిమ్మల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

జనవరి 2024 నుండి ఇప్పటి వరకు సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న 6 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలపై విచారణ జరిపి అర్హులైన వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించుటకు తగుచర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

నేత కార్మికులు, మరమగ్గ కార్మికులు స్వయంసమృద్ధి సాధించుట కొరకు దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే పథకాల రూపకల్పన కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధికోసం ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టదని కేవలం నేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధికోసమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. తమ రాజకీయ పబ్బంకోసం వివిధ రాజకీయ పార్టీలు వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ నేత కార్మికుల ఆత్మస్థైర్యము దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని లేకపోతే ప్రజాజీవితంలో వారికి గుణపాఠం తప్పదని మంత్రి తెలియజేశారు.

నేతన్నకు చేయూత...

నేత కార్మికులకు పొదుపు అలవాటు కల్పించుటకు గాను నేతన్నకు చేయూత పథకం ద్వారా నేత కార్మికులు మరియు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో, 8 శాతం కార్మికుల వేతనంలో చేసిన పొదుపునకు గాను రాష్ట్రప్రభుత్వంచే 16 శాతం నిధులు విడుదల కాబడతాయి. గత ప్రభుత్వం ఈ పథకాన్ని సెప్టెంబర్ 2021లో ప్రారంభించినప్పటికి కేవలం 60 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇవి కేవలం సెప్టెంబర్ 2022 వరకు మాత్రమే కార్మికుల పొదుపు ఖాతాలలోకి జమ కాబడినవి. అక్టోబర్ 2022 నుంచి బడ్జెట్ విడుదల కాకపోవడం వలన 77.80 కోట్ల రూపాయలు అక్టోబర్ 2023 వరకు గత ప్రభుత్వం ద్వారా ఇవ్వబడలేదు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం వలన 36,133 మంది చేనేత కార్మికుల పొదుపు ఖాతాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

నేత కార్మికులకు వేతనాలలో అదనపు వెసులుబాటు కొరకు 2018 లో చేనేత మిత్ర పథకం ప్రారంభించడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం రూ. 100 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. కానీ కేవలం రూ. 40 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఇది నేత కార్మికునికి వారి యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం జరిగినది. ఇవి 2018 నుండి మే 2023 వరకు మాత్రమే 20,501 నేత కార్మికులకు ఇవ్వడం జరిగినది. సెప్టెంబర్ 2023 నుండి ఈ పథకంలో కొంతమార్పు చేసి ప్రతి నేత కార్మికునికి రూ. 2000, అనుబంధ కార్మికులకు రూ. 1000 చొప్పున ఇవ్వడానికి సూచించడం జరిగింది. ప్రభుత్వం నుండి జూన్ 2023 వరకు మాత్రమే నిధులు విడుదల కాబడినవి. గత ప్రభుత్వంలో అక్టోబర్ 2023 వరకు రూ. 19 కోట్లు బకాయిలు ఉన్నవి.

గతంలో నామమాత్రంగానే నేతన్న బీమా...

గత ప్రభుత్వం నేతన్నభీమా పథకాన్ని ప్రకటించి నామమాత్రంగా కేవలం 5 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 16 కోట్లు బకాయిల కింద విడుదల కావాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని 10,652 పిట్ లూమ్ లను ఫ్రేమ్ లూమ్ లుగా ఆధునికరించడానికి చేనేత మగ్గం పథకాన్ని 2023 నందు ప్రారంభించి నిధులను విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న 50 శాతం పవర్ సబ్సిడీ పథకాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్విర్యం చేసి 2016 సంవత్సరం నుండి 59 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా బకాయి పెట్టింది అని మంత్రి తుమ్మల అన్నారు.


Tags:    

Similar News