బీజేపీలో తప్పులు జరుగుతున్నాయా..!
మరోసారి కమళం పార్టీపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు.;
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటి కారణంగానే తాను రాజీనామా చేశానని వివరించారు. ఇప్పుడు తాజాగా తనను టార్గెట్ చేస్తూ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారని ఆరోపించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను పక్కనపెడుతున్నారని, దాని వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. రాజీనామా చేసిన నెల రోజులు గడుస్తున్నా ఇంకా తననే టార్గెట్ చేస్తున్నారని, ఇంకెన్ని రోజులు తనను టార్గెట్ చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 10 నుంచి 12 మందిని సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ ప్రకటించిన రాష్ట్ర కమిటీ.. రామచందర్ రావుదా? కిషన్ రెడ్డి కమిటీనా? అని చురకలంటించారు రాజాసింగ్.
ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తారా? అని ఎద్దేవా చేశారు. ‘‘ఒకవేళ తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీని కొందరు సర్వనాశనం చేస్తున్నారని నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. కొందరు రామచందర్ రావు వెనక ఉండి పార్టీని నడిపించాలని అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడే పద్ధతి సరిగా లేదు. బీబీ నగర్ ఎయిమ్స్ లో పోస్ట్ లు ఇప్పిస్తానని రూ. మూడు లక్షలు తీసుకున్నారని మీపై ఆరోపణలు ఉన్నాయి. భార్యతో కలిసి రామచందర్ రావు ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకున్నారట. నేను నాలుగో సారి పోటీ చేయాలా వద్దా? అని ఆలోచిస్తా. నన్ను గెలిపించింది మా బీజేపీ కార్యకర్తలే.. మళ్ళీ కూడా గెలిపిస్తారు. మా పార్టీ బాగు పడాలనేది నేను అనుకుంటున్న. అధికారంలోకి రావాలనే నా కోరిక.. నేను ఎమ్మేల్యే గా రాజీనామా చేయను. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తా’’ అని అన్నారు రాజాసింగ్.