రౌడీ హీరోలో పెరిగిపోతున్న టెన్షన్..
గిరిజనులపై వ్యాఖ్యల కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.;
విజయ్ దేవరకొండకు టెన్షన్ పెరిగిపోతోంది. గిరిజనులను కించపరిచారన్న కేసును కొట్టివేయాలని విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేయడమే ఇందుకు కారణం. ఇందులో తీర్పును తనకు అనుకూలంగా వస్తుందా? వ్యతిరేకంగా వస్తుందా? అని రౌడీ హీరో ఫుల్ టెన్షన్‌లో ఉన్నట్లు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అదే సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో వాటిని ఉద్దేశించి మాట్లాడిన విజయ్.. గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, విజయ్ మాటలను గిరిజనుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని కోరుతూ విజయ్.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో గురువారం విచారణ జరిగింది. ఇందులో విజయ్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విజయ్ వ్యాఖ్యలు చేసిన రెండు నెలల తర్వాత గిరిజన సంఘ నాయకులు కేసు పెట్టారని గుర్తు చేశారు. విజయ్‌పై పెట్టిన కేసు వెనక దురుద్దేశం ఉంది, తన వ్యాఖ్యలకు విజయ్ సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా చెప్పారని తెలిపారు. అయితే విజయ్ క్షమాపణలను పరిగణనలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరుపు న్యాయవాదిని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
అసలేం జరిగిందంటే..
పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. నెటిజన్లు మండిపడ్డారు. ట్రైబల్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు ఇది ఓ పోలీస్ కేసు అయ్యింది.
నన్ను క్షమించండి: విజయ్
‘‘రెట్రో ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలతో కొంత మంది హర్ట్ అయ్యారనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విషయంపై సిన్సియర్‌గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవ్వరినీ ఉద్దేశ్యపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. ఏ సమాజాన్ని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను బాధపెట్టడం లేదా లక్ష్యంగా చేసుకోవడం అనే ఉద్దేశ్యం నాకు లేదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. వారు మన దేశంలో అంతర్భాగంగా భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. నేను ఉపయోగించిన "తెగ" అనే పదం, వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే నా ఏకైక లక్ష్యమని’’ నోట్ ద్వారా విజయ్ వివరణ ఇచ్చారు.