వక్ఫ్ సవరణ బిల్లుపై తెలంగాణ నేతల వ్యతిరేకత

వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది.ఈ బిల్లు చట్టం కానున్న నేపథ్యంలో దీన్ని తెలంగాణలోని బిజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకించారు.;

Update: 2025-04-03 09:49 GMT
లోక్ సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

దేశంలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్ సభ ఆమోదం తెలుపగానే గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును తెలంగాణలోని బిజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు లోక్ సభ సభ్యులు, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో వైపు బీజేపీకి చెందని ఆరుగురు ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.


వక్ఫ్ బిల్లు ప్రతిని చించిన ఎంపీ అసదుద్దీన్
లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. సభలోనే చేతిలోని వక్ఫ్ సవరణ బిల్లు ప్రతిని చించి వేసి ఎంపీ నిరసన తెలిపారు.ఈ బిల్లు భారతదేశంలోని ముస్లింలపై దాడిగా అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మదరసాలు, దర్గాలు, మసీదులపై ఈ బిల్లు దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 14 ప్రకారం అన్ని మతాల వక్ఫ్ ఆస్తుల నిబంధనల ఉల్లంఘన అని ఆయన చెప్పారు. నరేంద్రమోదీ పాలనలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ విస్మరించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేక వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు అంగీకరించరని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు.వక్ఫ్ బోర్డు ఆస్తులపై హక్కులను తగ్గించేలా బిల్లును తీసుకు వచ్చిందని, దీనివల్ల మత స్వేచ్ఛకు విరుద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పార్లమెంటరీ ఆధిపత్యానికి, అధికారాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఒవైసీ ఆరోపించారు. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనే బోర్డు అధికారాన్ని అరికట్టడం ఈ సవరణల లక్ష్యమని ఆయన చెప్పారు.

వక్ఫ్ బిల్లును అమలు చేస్తాం

దేశంలో ఒవైసీ సహా కుహానా లౌకికవాదులు అడ్డుపడినా తాము వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేస్తామని కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. దేశ ప్రజల కోసం మోదీ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం జాతీయ వాద భావజాలంతో పనిచేస్తుందని, మజ్లిస్ దేశ ద్రోహ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.

వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల ఆందోళన : మాజీ మంత్రి ముహ్మద్ మమమూద్ అలీ
లోక్ సభ వక్ఫ్ సవరణ బిల్లను ఆమోదించడంతో తెలంగాణలోని ముస్లిం మైనారిటీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ముహమ్మద్ మహమూద్ అలీ చెప్పారు.దేవంలోని వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలిచ్చి, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను సీఈఓలుగా నియమించి వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం సవరణల పేరిట నష్టం చేస్తుందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులకు జుడీషియల్ అధికారాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుందని మహమూద్ అలీ చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు నేపథ్యంలో మాజీమంత్రి మహమూద్ అలీ ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో ముస్లిం విద్యార్థుల చదువులు, వైద్యసేవల మెరుగునకు వెచ్చించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నగరంలోని పత్తర్ ఘట్టిలో వక్ఫ్ బోర్డు ఆధీనంలోని ఓ దుకాణం అద్దె మార్కెట్ ధర ప్రకారం లక్షరూపాయలుండగా, కేవలం రూ.500 లే ఉందన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీల కంటే వెనుకబడిన ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ పాలనలో వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని మహమూద్ అలీ చెప్పారు.

సవరణ బిల్లుపై మజ్లిస్ నిరసన
లోక్ సభలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును తమ మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ కీలక నాయకుడు మీర్జా రియాజుల్ హసన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపామన్నారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించారని చెప్పారు.

వక్ఫ్ బిల్లు సవరణ ఎందుకంటే...
దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు ఉద్ధేశించిన 1995 వక్ఫ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని మోదీ ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, లోపాలను సవరిస్తూ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌కు మార్చారు. సెక్షన్ 40 తొలగించి,వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం లేకుండా చేశారు.

జేపీసీ ప్రతిపాదనలతో వక్ఫ్ బిల్లు
వక్ఫ్ పాలకవర్గాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేస్తూ కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టు నెలలోనే కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నుంచి ఈ బిల్లుపై వ్యతిరేకత రావడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించారు. జేపీసీ ప్రతిపాదనలతో ఈ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది.

లోక్ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుపై 14 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత లోక్ సభలో ఆమోదం పొందింది. విపక్ష పార్టీల ఎంపీల విమర్శలు, అధికార పక్ష సభ్యుల ప్రతి విమర్శల తర్వాత ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. మరో 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. దీంతో 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోగా, వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.

నేడు వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో చర్చ
లోక్ సభలో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం రాజ్యసభ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చించేందుకు 8 గంటల సమయాన్ని కేటాయించారు. అనంతరం ఈ బిల్లుపై రాజ్యసభ లోనూ ఓటింగ్ చేపట్టనున్నారు. రాజ్యసభలోనూ ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం ఉన్న నేపథ్యంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు సునాయాసంగా ఆమోదం పొందుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాస్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

ముస్లిం సంఘాల తీవ్ర ఆవేదన

పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. వక్ఫ్ చారిత్రాత్మకంగా ముస్లిం సమాజం యొక్క సామాజిక-మతపరమైన అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించిందని వారు పేర్కొన్నారు. కేంద్రం వక్ఫ్ సంస్థల స్వయంప్రతిపత్తిని తగ్గించి, వాటిని మరింత నియంత్రించాలనే ఉద్దేశ్యంతో సవరించిన బిల్లు ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యం అని ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై చర్చించడానికి ముస్లింసంఘాలు ఏప్రిల్ 7వతేదీన సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ,ప్రముఖ ముస్లిం సంస్థలతో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News