తెలంగాణలో వడదెబ్బతో విలవిల, పెరుగుతున్న మృతుల సంఖ్య
తెలంగాణలో వడదెబ్బతో పలు జిల్లాల ప్రజలు విలవిల లాడుతున్నారు. వడదెబ్బతో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హీట్ వేవ్ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది.;
By : The Federal
Update: 2025-05-03 12:29 GMT
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, నల్గొండ, జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
వడదెబ్బ మరణాలు
తెలంగాణలో ఎండల తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గు, ఖమ్మం జిల్లాలో ఒకరు వడదెబ్బతో మరణించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రామచంద్రం కూలి పనికి వెళ్లి వచ్చి సొమ్మసిల్లి పడిపోయి మరణించాడు. జమ్మికుంటలోని వొల్లాల వెంకన్న ఎండదెబ్బ తగిలి మృత్యువాత పడ్డాడు. జగిత్యాలలో దినసరి కూలీ గొల్లపల్లి జగన్ గౌడ్ వడదెబ్బ తగిలి చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన బయ్యారపు దర్గయ్య పశువులను మేపేందుకు పొలం వెళ్లి వడదెబ్బతో కన్నుమూశాడు. ఈ ఏడాది మండుతున్న ఎండలతో వడదెబ్బతో పలువురు మృత్యువాత పడ్డారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెంలో కుందారపు యాదగిరి అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు పాఠశాలకు సెలవు కావడంతో ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బతో మరణించారు. పెద్దపల్లి జిల్లా మంథని గంగాపురిలో పులి మణి ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీ పనికి వెళ్లి ఎండదెబ్బకు నేలకొరిగాడు. తెలంగాణలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
తెలంగాణలో 11ఏళ్లలో వడదెబ్బతో 1099 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బతో గడచిన పదకొండేళ్లలో 1099 మంది మరణించినట్లు తెలంగాణ విపత్తుల శాఖ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. 2014 నుంచి 2019 వ సంవత్సరం వరకు వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. 2014వ సంవత్సరంలో 31 మంది వడదెబ్బతో మరణించారు. 2015లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 541 కి పెరిగింది. 2016లో 324.2017లో 106 మంది, 2018లో 12 మంది, 2019లో 64 మంది మృత్యువాత పడ్డారు. 2020వ సంవత్సరంలో 9 మంది వడదెబ్బతో కన్నుమూశారు. 2021 నుంచి వరుసగా మూడేళ్ల పాటు వడదెబ్బ మరణాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. 2024వ సంవత్సరంలో 10 మంది వడదెబ్బతో మరణించారు.
ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండ తీవ్రంగా ఉన్నపుడు ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకోవాలి. బయటకు వెళ్లేటపుడు వెంట మంచినీళ్ల బాటిల్ తీసుకువెళ్లాలి. తరచూ నీళ్లు తూగుతూ ఉండాలి. వేసవికాలంలో నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. తెలుపు లేద లేత రంగుల కాటన్ దుస్తులు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపి లేదా రుమాలు పెట్టుకోవాలి. చంటిపిల్లలు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వారు వడగాల్పుల బారినపడకుండా చూసుకోవాలి.
ఎండలో తిరగొద్దు
వేసవి ఎండలో బయట తిరగవద్దని, కాఫీ,టీలు తాగవద్దని వైద్యులు సూచించారు. ఎండవేడిలో ఎక్కువగా పనిచేయకూడదు. నిల్వ చేసిన ఆహార పదార్థాలను తినవద్దు.ఎండలో పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలు, వృద్ధులను ఉంచొద్దు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటిలోనే ఉండాలని సూచించారు.
వడదెబ్బ లక్షణాలు
తెలంగాణలో మండుతున్న ఎండలతో వడదెబ్బ సోకి మరణాలు మొదలయ్యాయి. వడదెబ్బ సోకితే వెంటనే చికిత్స పొందాలని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్ర మైన జ్వరం, చర్మం పొడిబారటం, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం వడదెబ్బ లక్షణాలని వైద్యులు చెప్పారు.
ముందు జాగ్రత్తలు ముఖ్యం
పలుచని మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు లేదా చిటికెడు ఉప్పు, చెంచా చక్కెరను గ్లాస్ నీటిలో కలిపి ఓఆర్ఎస్ ద్రావణాన్ని కలిపి తాగితే వడదెబ్బ బారి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెప్పారు. వడదెబ్బ సోకిన వారిని నీడలో లేదా చల్లని ప్రదేశంలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. పుచ్చకాయ, కర్బుజా, ఆరెంజ్, ద్రాక్ష, ఫైనాపిల్, దోసకాయ లాంటి అధిక నీటిమాణం ఉన్న పండ్లను తినాలని వైద్యులు సూచించారు.భారతవాతావరణ శాఖ అధికారులు కలర్ కోడ్ ను బట్టి వివిధ రకాల అలెర్టులు జారీ చేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైతే గ్రీన్ అలెర్ట్ జారీ చేస్తారు. ఉష్ణోగ్రత పెరిగితే హీట్ ఎల్లో అలెర్ట్ జా చేస్తారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరి ఎండ వేడిమి పెరిగితే ఆరంజ్ అలెర్ట్ జారీ చేస్తారు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే రెడ్ అలెర్ట్ జారీచేస్తారు.