Telephone Tapping | బిడ్డ, అల్లుడు, మేనల్లుడి ఫోన్ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు
కవిత(Kavitha), అల్లుడు దేవనపల్లి అనీల్ రావు, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు(Harish Rao) ఫోన్లను కూడా కేసీఆర్(KCR) ట్యాపింగ్ చేయించినట్లు చెప్పారు;
తెలంగాణలో సంచలనంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కొత్తకోణం వెలుగుచూసింది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణకు శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ సహయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాజరయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు కూతురు కవిత(Kavitha), అల్లుడు దేవనపల్లి అనీల్ రావు, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు(Harish Rao) ఫోన్లను కూడా కేసీఆర్(KCR) ట్యాపింగ్ చేయించినట్లు చెప్పారు. విచారణ సందర్భంగా తనతో అధికారులు మాట్లాడుతు ఈ వివరాలను వెల్లడించినట్లు బండి చెప్పారు. సొంతబిడ్డ, అల్లుడు, మేనల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించిన కేసీఆర్ కన్నా నీచులు ఇంకెవరైనా ఉంటారా ? అని బండి విరుచుకుపడ్డారు. అలాగే తన మంత్రుల ఫోన్లు, పార్టీ నేతల ఫోన్లను కూడా కేసీఆర్, కేటీఆర్ ట్యాప్ చేయించినట్లు బండి చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయాల్లో మన-తన అనేది ఉండదు. కేసీఆర్ తన బిడ్డ కవిత, అల్లుడు అనీల్ రావు ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించుంటారు ? ఇపుడు సొంతబిడ్డ కవితే తండ్రి, అన్నకు ఎదురుతిరుగుతోంది కదా. డైరెక్టుగా తండ్రి మీద ఏమీ ఆరోపణలు చేయకపోయినా కేటీఆర్ ను ఉద్దేశించి ఇప్పటికే చాలా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అన్నా-చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఇపుడు బయటపడ్డాయి. అయితే వీళ్ళమధ్య వివాదం ఎంతకాలం క్రితం మొదలైందో బయటవాళ్ళకు ఎవరికీ తెలీదు. బహుశా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే గొడవలు మొదలయ్యుండచ్చు. అందుకనే బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించుంటారు.
రాజకీయాల్లో పార్టీలఅధినేతలు అందరినీ నమ్మడం ఉండదు, అందరినీ అనుమానించటమూ ఉండదు. సందర్భానుసారంగా అధినేతలు వ్యవహరిస్తుంటారు. కుటుంబంలో జరిగిన పరిణామాలనుబట్టి ఏరోజైనా బిడ్డ తనకు ఎదురుతిరిగే అవకాశాలున్నాయని కేసీఆర్ అనుమానించుంటారు. అందుకనే ముందుజాగ్రత్తగా ఆమె ఫోన్ తో పాటు అల్లుడి ఫోన్ను కూడా ట్యాపింగ్ చేయించటంలో ఆశ్చర్యమేముంది ? బిడ్డ, అల్లుడి ఫోన్ను ట్యాప్ చేయించటం ద్వారా తండ్రి, కొడుకులు తెలుసుకున్న కొత్త విషయాలు ఏమిటో ఎవరికీ తెలీదు.
ఇప్పటివరకు అల్లుడి ఫోన్ కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారనే ప్రచారం అందరికీ తెలిసిందే కానీ దానికి సరైన ఆధారాలు లేవు. అందుకనే అల్లుడి ఫోన్ ట్యాప్ అయ్యిందనే ప్రచారం ఉత్త ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ఇపుడు స్వయంగా కేంద్ర హోంశాఖ సహయమంత్రే అల్లుడి ఫోన్ తో పాటు బిడ్డ, మేనల్లుడి ఫోన్ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు అని చెప్పటంతో అధికారిక ప్రకటన అయిపోయింది. విచారణ సందర్భంగా సిట్ అధికారులే ఈ విషయాన్ని తనతో చెప్పారని బండి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. బిడ్డ, అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించకుండా ఉంటారా ?
పార్టీపై ఆధిపత్యకోసం ఇటు కొడుకు అటు మేనల్లుడి మధ్య చాలాకాలంగా పోటీ జరుగుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. తమమధ్య ఎలాంటి పోటీలేదని, తాను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయటానికి రెడీ అని హరీష్ చాలాసార్లు ప్రకటించిన విషయంతెలిసిందే. పార్టీలో మెజారిటి లీడర్లు పార్టీపగ్గాల విషయంలో హరీష్ కే మద్దతుగా నిలుస్తున్నారన్న ప్రచారం కూడా అందరికీ తెలిసిందే. అందుకే అర్జంటుగా పార్టీకి కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ ప్రకటించేసింది. హరీష్ ఎంత మేనల్లుడైనా కొడుకు కేటీఆర్ తర్వాతే కదా. అందుకనే కేటీఆర్ కు పార్టీలో ఎలాంటి వ్యతిరేకత ఉండేందుకు వీల్లేకుండా మేనల్లుడి ఫోన్ పై నిఘా పెట్టుంటారనే ప్రచారం ఇపుడు ఊపందుకుంది. తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయం హరీష్ కు కూడా చాలాకాలం క్రితమే తెలుసుంటుంది.
తమింట్లో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయటమే చాలా బాధాకరమని కవిత ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంట్లోవాళ్ళ ఫోన్లని చెప్పిన కవిత తర్వాత పనివాళ్ళ ఫోన్లని సర్దుకున్నారు. కాకపోతే ఆమెకు తెలిసే ఉండచ్చు తనతో పాటు భర్త అనీల్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతోందని. ఈ విషయంలోనే కవితకు అన్న కేటీఆర్ తో విభేదాలు మొదలయ్యాయేమో. బండి తాజా ప్రకటనతో ఇలాంటి అనేక విషయాలపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరీ విషయాలన్నింటినీ సిట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.