TGRERA | టీజీ రెరా ఛైర్మన్, సభ్యులను తొలగించండి, సీఎంకు ఫిర్యాదు
టీజీ రెరా ఛైర్మన్ గా ఎన్ సత్యనారాయణ, రెరా సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావులు అనర్హులని, వారిని తొలగించాలని డాక్టర్ లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు.;
By : The Federal
Update: 2025-01-07 12:37 GMT
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఛైర్మన్ గా ఐఎఎఎస్ అధికారి ఎన్ సత్యనారాయణ, రెరా సభ్యులు లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసరావులు అనర్హులని, వారిని తొలగించాలని సోషల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఆమె రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. టీజీ రెరా చట్టం 2016లోని సెక్షన్ 22 ప్రకారం అనర్హులను ఎంపిక చేశారని, వీరి ఎంపికలో విధి విధానాలను పాటించలేదని ఆమె ఆరోపించారు. 2023 జూన్ నుంచి రెరా ఛైర్మన్, సభ్యుల నుంచి ఇప్పటివరకు తీసుకున్న జీతాలను రికవరీ చేయాలని ఆమె కోరారు.
- టీజీ రెరా చట్టానికి విరుద్ధంగా ఛైర్మన్ ఎన్ సత్యనారాయణ, సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావులను మోసపూరితంగా అనర్హులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిందని, వీరి నియామకాల్లో ఎలాంటి విధివిధానాలు పాటించలేదని డాక్టర్ లుబ్నా సార్వత్ సీఎంకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజీ రెరా ఛైర్మన్, సభ్యుల నియామక జీఓ నంబరు 84,85లు పబ్లిక్ డొమైన్, జీఓ వెబ్ సైట్ లో కూడా పెట్టలేదని ఆమె ఆరోపించారు.
- రెరా చట్టం 2016లోని సెక్షన్ 22 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతని నామినీ, డిపార్ట్ మెంట్ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన ఎంపిక కమిటీ నిర్దేశిస్తుందని, వారి నియామకంపై ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా వీరి నియామకాలు జరిగాయని డాక్టర్ లుబ్నా ఫిర్యాదులో పేర్కొన్నారు.సెలక్షన్ కమిటీ విధి విధానాలు పాటించలేదని ఆమె పేర్కొన్నారు.
- రెరా చట్టంలోని సెక్షన్.22లో పేర్కొన్న విధంగా, రాష్ట్ర ప్రభుత్వ సేవలో ఉన్న లేదా ఉన్న వ్యక్తిని చైర్‌పర్సన్‌గా నియమించకూడదు. కానీ ఐఎఎస్ అధికారి అయిన ఎన్ సత్యనారాయణను మోసపూరితంగా కేసీఆర్ సర్కారు నియమించిందని డాక్టర్ లుబ్నా ఫిర్యాదు చేశారు.రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారిని సభ్యులుగా నియమించకూడదనే రెరా చట్టంలోని సెక్షన్ 22లో పేర్కొంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రెరా ఛైర్మన్, సభ్యులను తొలగించి, వారి అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. రెరా విధి విధానాల ప్రకారం కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించాలని డాక్టర్ లుబ్నా సీఎంకు విన్నవించారు.