సినీ ఇండస్ట్రీ కోసం ప్రత్యేక ఉప సంఘం ఏర్పాటు

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-26 08:37 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఉపసంఘం సినీ పరిశ్రమలోని సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారం కోసం దోహదపడుతుందని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని టీజీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కూడా తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి ఎలా తీసుకు వెళ్లాలి అన్న అజెండాతోనే నేటి సమావేశం నిర్వహించడం జరిగిందని చెప్పారు. బెనిఫ్‌షోలు, టికెట్ల ధరల పెంపు అనేది చాలా చిన్న విషయం అని, దానిపై చర్చించడానికి తాము సమావేశం ఏర్పాటు చేయలేదని దిల్ రాజు వెల్లడించారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ‘‘సినిమాలకు మా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం . ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించాం’’ అని తెలిపారు.

‘‘సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటలల్లో రావొచ్చు. తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలివుడ్, బాలీవుడ్‌లు సైతం హైదరాబాద్‌కు వచ్చేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం. గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాల నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News