కొండాయి గ్రామస్థుల అవస్థలు
మంత్రి సీతక్కతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ;
జంపన్నవాగు వరద ఉధృతి పెరగడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి కష్టకాలంలో కూడా తమకు సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వాళ్లు విన్నూత్న నిరసన చేపట్టారు. 2023 లో జంపన్నవాగుకు వచ్చిన భారీ వరద వల్ల ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మళ్ళీ ఈ ఏడాది జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్థుల్లో ఆందోళ పెరుగిపోతోంది. ఎనిమిది మంది ప్రాణాలు పోయినా సరే తమకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆసరా, భరోసా అందకపోవడంతో ఇప్పుడు కొండాయి గ్రామస్థులు నిరసన బాటపట్టారు. వినూత్న నిరసనలో భాగంగా అడవి బాట పట్టారు. గ్రామంలో మొదట వరద ముంపునకు గురయ్యే ఎస్సీకాలనీకి చెందిన 30 కుటుంబాలు.. దొడ్ల గ్రామ సమీపంలోని అభయారణ్యంలో గుడారాలు వేసుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా అక్కడికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు గుడారాల వద్దకు వెళ్లారు. అక్కడ కుటుంబాలతో మాట్లాడారు. కాగా రెండేళ్ల క్రితం వరదల సమయంలో తమను పునరావాస ప్రాంతానికి తరలించి నిర్లక్ష్యంగా వదిలేశారని, ఈసారి మళ్లీ వరదలొస్తే తమ పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా బాధితులు.. అధికారులను అడిగారు. దాంతో స్పందించిన అధికారులు, నాయకులు... అడవిలో కాకుండా సాధారణ ప్రాంతంలో సర్వే చేసి స్థలాలతోపాటు ఇళ్లను ఇవ్వడానికి మంత్రి సీతక్కతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో బాధితులు గుడారాలు తొలగించుకుని వెళ్లిపోయారు. ఇదే సమయంలో దొడ్ల గ్రామ ప్రజలు సైతం తమ సమస్యను విన్నవించడంతో వారికి కూడా ఇళ్లపై హామీ ఇచ్చారు.
జంపన్నవాగు. మేడారం జాతరలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే వాగు . తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో ఉంది. సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించే ముందు భక్తులు ఈ వాగులో స్నానం చేస్తారు.పూర్వం ఈ వాగును సంపెంగ వాగు అని పిలిచేవారు. సమ్మక్క, సారలమ్మల యోధుడు జంపన్న ఈ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పటి నుంచి దీనిని జంపన్న వాగుగా పిలుస్తున్నారు.జంపన్నవాగు, మేడారం జాతరలో భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. జంపన్నవాగులో వరదలు వచ్చినప్పుడు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతూనే ఉన్నారు. మేడారం జాతర సమయంలో భక్తుల సౌకర్యార్థం, వాగు అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.