తెలంగాణలో కాంగ్రెస్ కు మూడు చిక్కుముళ్లు, ఏవంటే...

కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను కేటాయించగా.. మరో పదమూడు స్థానాలపై కసరత్తు చేస్తోంది. వీటిలో మూడు స్థానాలు మాత్రం ఆసక్తికరంగా మారాయి.

Update: 2024-03-19 10:24 GMT

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కోసం కుస్తీ పడుతోంది. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను కేటాయించగా.. మరో పదమూడు స్థానాలపై కసరత్తు చేస్తోంది. వీటిలో మూడు స్థానాలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఈ సెగ్మెంట్లలో టికెట్స్ కోసం వలసనేతలు పోటీ పడుతున్నారు. అది కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే కావడం విశేషం.

సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలకు ఎవరిని నిలబెట్టాలి అనే అంశం కాంగ్రెస్ లో చిక్కుముడిగా మారిందనే చెప్పాలి. ముందు పార్టీలో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి సికింద్రాబాద్, పట్నం సునీత కి చేవెళ్ల టికెట్ అని అంతా భావించారు. కానీ ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో చేరడంతో అంతా తారుమారు అయింది.

పట్నం సునీత కి చేవెళ్ల టికెట్ ఇస్తే రంజిత్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే బీజేపీ నుంచి స్నేహితుడు, బిజినెస్ పార్టనర్ ఈటల పోటీ చేస్తున్నారు కాబట్టి. దీంతో ఆయన చేవెళ్లకే మొగ్గు చూపుతున్నారు. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ, అలాగే ఎన్నికల కోసం ఎప్పటి నుంచో చేవెళ్ల నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.. దీంతో అక్కడ అయితేనే అన్ని విధాలా సేఫ్ అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో పట్నం సునీతకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చే చాన్స్ ఉంది. అలా జరిగితే రెండవ ఆప్షన్ గా కంచర్ల భువనగిరి టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ సీటుకి కూడా ఉమ్మడి జిల్లా నేతల నుంచి గట్టి పోటీ ఉంది. రేవంత్ సన్నిహితుడు, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తున్న గుత్తా అమిత్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

తమ కంచుకోటలో పైళ్ళని నిలబెట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచిస్తున్నారని సమాచారం. ఎందుకంటే పైళ్ళ భువనగిరి నుంచి 2014, 2018 లో గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ స్థానికంగా ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉండటం, కుంభం తో కూడా సత్సంబంధాలు ఉండటంతో పైళ్ళనే బరిలో దింపాలని భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ఇన్చార్జి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డిని కలిసి టికెట్ గురించి చర్చించాలని కంచర్ల నిర్ణయించుకున్నారు.

మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్ ఆశపడ్డారు. కానీ దానం నాగేందర్ ని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించడానికి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అలా అయితే టికెట్ మీద హోప్స్ పెట్టుకున్న బొంతు రామ్మోహన్ కి భంగపాటు తప్పదు. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఆయనకి ఎలాంటి హామీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే టికెట్ దక్కట్లేదనే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైతే నిరాశ తప్పదు. 

కాగా, ఢిల్లీలో CWC మీటింగ్ ముగిసిన తర్వాత ఈ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News