రాజలింగమూర్తి హత్యతో మాకేంటి సంబంధం: వెంకటరమణారెడ్డి
బీఆర్ఎస్ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు.. ప్రోత్సహించదు కూడా అని వెంకటరమణారెడ్డి అన్నారు.;
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ నేతలు పాల్పడిన అవినీతిని బయటపెట్టడం వల్లే ఆయనను హత్య చేశారని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామని, దోషులు ఎవరైనా అరెస్ట్ తప్పదని మంత్రి కోమటిరెడ్డి కూడా అన్నారు. అదే విధంగా మూర్తి హత్యకు సుపారీ ఇచ్చింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డేనని ఆయన ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి స్పందించారు. అసలు ఈ హత్యకు తనకు గానీ, బీఆర్ఎస్‌కు గానీ ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తమపై వస్తున్న ఆరోపణలన్నీ బోగస్ అని, రాజకీయంగా ఎదుర్కోలేకనే తమకు హత్యకేసు అంటగట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
‘‘రాజలింగమూర్తి హత్యపై దుష్ట్రచారం చేస్తున్నారు. ఈ ఘటనను బీఆర్ఎస్‌కు అంటగట్టే యత్నం జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. నేనే చంపించానని ఆయన అంటున్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. ప్రోత్సహించదు కూడా. ఈ ఘటనతో నాకూ, బీఆర్ఎస్ ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనపై సీఐడీ, సీబీఐతో విచారణ జరిపి దోషులను శిక్షించాలి. మృతుడి భార్య బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్‌గా గెలిచారు. కానీ విధానాలు నచ్చక ఆమెను పార్టీ దూరం పెట్టింది. మృతుడి భార్యతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో కూరుకుపోయాడు. గతంలో రౌడీషీటర్‌గా కూడా ఉన్నారు. ఆయన హత్యకు కూడా భూవివాదమే కారణం. ఈ హత్య కేసు నిందితుడు లొంగిపోయినట్లు మాకు సమాచారం అందింది’ఈ అని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ హత్య కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుపాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన అతి కొద్దిరోజుల్లోనే రాజలింగమూర్తి హత్య జరగడంపై సీఎం కార్యాలయం ఆరా తీస్తోంది. ఈ హత్యకు సంబంధించి సమాచారం అందించాలని నిఘా వర్గాలను కోరింది. హత్యపై పూర్తి వివరాలు సేకరించాలని, దోషులు ఎవరైనా అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఈ హత్యపై స్థానిక పోలీసుల నుంచి కూడా సీఎంఓ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
హత్య జరిగింది ఇలానే..
రాజలింగామూర్తి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా నలుగురు నుంచి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. వెంటనే స్పందించిన స్థానికులు రాజలింగమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని మృతుడి కుటుంబీకులు చెప్పారు.