చంద్రబాబుతో రేవంత్ పంచాయితీ ఏమిటి ? నిజమేనా ?

చంద్రబాబు ముఖ్యమంత్రి అయినదగ్గర నుండి ప్రతిరోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందని హరీష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని అర్ధమవుతోంది.;

Update: 2025-02-22 06:02 GMT
Revanth with Chandrababu Naidu

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడుతు కేసీఆర్ వల్లే చంద్రబాబునాయుడుతో పంచాయితీ మొదలైనట్లు ఆరోపించాడు. ఇంతకీ రేవంత్(Revnth) చెప్పిన పంచాయితీ ఏమిటంటే నీళ్ళ తరలింపు. కృష్ణానది నుండి ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నట్లు మాజీమంత్రి హరీష్ రావు పెద్దఎత్తున రేవంత్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో రేవంత్ కున్న వ్యక్తిగత స్నేహంవల్లే ఏపీ రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుని వెళుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏమీ మాట్లాడటంలేదని హరీష్ తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబుతో కుమ్మకైన రేవంత్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాడంటు మండిపోయారు.

హరీష్ ఆరోపణలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ పైన రేవంత్ తీవ్రస్ధాయిలో రెచ్చిపోయాడు. బీఆర్ఎస్(BRS) పదేళ్ళపాలనలో కేసీఆర్(KCR) నిర్వాకంవల్లే ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu)తో తనకిపుడు పంచాయితీ వచ్చిందన్నాడు. పదేళ్ళ అధికారంలో కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసుంటే ఇపుడు చంద్రబాబుతో పంచాయితీ వచ్చుండేదికాదన్నాడు. నీళ్ళను రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) తరలించుకుపోతుంటే, మంజూరైన నిధులను కేసీఆర్ దారిమళ్ళించి పాలమూరు ప్రాజెక్టుకు అన్యాయం చేసిననట్లు రేవంత్ ఆరోపించాడు. ఉమ్మడిరాష్ట్రంలో జూరాల ప్రాజెక్టునుండి నీటిని తీసుకునేట్లుగా డిజైన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు రు. 35 వేల కోట్లకు టెండర్లు పిలిచిన విషయన్ని గుర్తుచేశారు.

అయితే కేసీఆర్ అధికారంలోకి రాగానే రీడిజైన్ పేరుతో నీటిని జూరాల ప్రాజెక్టునుండి కాక శ్రీశైలం నుండి తీసుకోవటమే పాలమూరుకు పెద్ద శాపంగా తయారైందన్నాడు. రు. 35వేల కోట్ల ప్రాజెక్టు అంచనాలను రు. 55 వేల కోట్లకు కేసీఆర్ పెంచేసినట్లు ధ్వజమెత్తాడు. దివంగత వైఎస్ఆర్(YSR) హయంలో రాయలసీమ(Rayalaseema)లోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటినిల్వ సామర్ధ్యాన్ని 4 వేల క్యూసెక్కుల నుండి 40 వేల క్యూసెక్కులకు పెంచుతుంటే మంత్రిగా ఉన్న హరీష్ రావు ప్రశ్నించకుండా ఎందుకు ఊడిగంచేశారని నిలదీశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్డ్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిచేయటానికి ముఖ్యమంత్రిగా కేసీఆరే సహకరించినట్లు ఆరోపించాడు. కేసీఆర్ చర్యలవల్లే పాలమూరు ఎడారిగా మారిపోయిందన్నారు.

ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటి ?

సరే, అప్పట్లో జగన్ కు అనుకూలంగా కేసీఆర్ వ్యవహరించారనే కాసేపు అనుకుందాము. కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించబట్టే ఏపీలో ప్రాజెక్టులకు తెలంగాణ నీళ్ళని తరలించుకుని పోతున్నదీ నిజమే అనుకుందాం. మరిపుడు రేవంత్ చేస్తున్నదేమిటి ? చంద్రబాబు ముఖ్యమంత్రి అయినదగ్గర నుండి ప్రతిరోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందని హరీష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇపుడు రోజుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న 10 వేల క్యూసెక్కుల నీటికి కేసీఆర్ నిర్వాకమే కారణమని రేవంత్ అనటమే ఆశ్చర్యం. అంటే, ఇపుడు ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నదని రేవంత్ అంగీకరించినట్లే కదా.

ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం నీటిని తరలించుకుపోవటానికి అప్పట్లో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించడమే కారణమని రేవంత్ అనటంలో అర్ధమేలేదు. పదేళ్ళ అధికారంలో కేసీఆర్ తప్పులుచేశారనే కదా జనాలు ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టింది. అప్పట్లో కేసీఆర్ చేసిన తప్పునే ఇపుడు తానూ చేస్తానని రేవంత్ అనటంలో అర్ధముందా ? తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమే నిజమయితే, ఏపీ ప్రభుత్వం తీసుకుపోతున్న నీటివల్ల నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే ఏపీ ప్రభుత్వం తీసుకువెళుతున్న నీటిని రేవంత్ అడ్డుకోవాలి. అప్పుడు కదా తెలంగాణకు రేవంత్ న్యాయంచేసినట్లయ్యేది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం తీసుకెళుతున్న 10 వేల క్యూసెక్కుల నీటి విషయంలో హరీష్ ఆరోపణలు తప్పయితే అదే విషయాన్ని రేవంత్ బహిరంగంగా జనాలకు చెప్పాల్సింది. హరీష్ ఆరోపణలు ఏ విధంగా తప్పో జనాలకు వివరించుండాలి.

చంద్రబాబుతో ఇపుడు తనపంచాయితీకి పదేళ్ళ కేసీఆర్ అధ్వాన్నపాలనే కారణమని రేవంత్ సమర్ధించుకుంటే తెలంగాణ జనాలు క్షమించరు. కేసీఆర్ చేసిన తప్పులను సరిదిద్దుతాడు, అంతకన్నా మెరుగైన పాలనను అందిస్తాడనే కదా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ కు జనాలు ఓట్లేసి గెలిపించింది. కేసీఆర్ చేసిన తప్పులనే తానూ చేస్తానని, కేసీఆర్ అధ్వాన్న పాలనలాంటిదే తాను అందిస్తానని రేవంత్ చెప్పటంలో అర్ధమేలేదు. పాలనలో తన వైఫల్యాలను కేసీఆర్ మీదకు నెట్టేయాలని చేస్తున్న ప్రయత్నాలను గ్రహించలేరని రేవంత్ అనుకుంటే జనాలను చాలా తక్కువగా అంచనావేసినట్లే అనుకోవాలి.

చంద్రబాబుతో పంచాయితీ నిజమేనా ?

చంద్రబాబుతో పంచాయితీ పెట్టుకునేంత సీన్ రేవంత్ కు లేదు. చంద్రబాబుకు ఉన్న అత్యంత నమ్మకమైన మద్దతుదారుల్లో రేవంత్ కూడా ఒకడు. చంద్రబాబుకు రేవంత్ ఏస్ధాయిలో నమ్మకస్తుడో ఓటుకునోటు ఉదంతమే నిరూపిస్తోంది. ఓటుకునోటులో అప్రూవర్ గా మారిపోయి రేవంత్ నోరిప్పుంటే చంద్రబాబు రాజకీయజీవితం 2014లోనే ముగిసిపోయుండేది. నామినేటెడ్ ఎంఎల్సీ స్టీఫెన్ సన్ ఓటుకు రు. 50 లక్షలు ఇస్తు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఎవరి తరపున తాను డబ్బులివ్వటానికి ఎంఎల్సీ ఇంటికి వచ్చాననే విషయాన్ని రేవంత్ బయటపెట్టలేదు. జైలులో గడపటానికైనా సిద్ధపడ్డాడే కాని ఓటుకునోటు సూత్రదారి పేరును మాత్రం బయటపెట్టలేదంటేనే చంద్రబాబుకు రేవంత్ ఎంతటి నమ్మకస్తుడో అర్ధమవుతోంది. ఓటుకునోటు కేసులో అసలు సూత్రదారి చంద్రబాబే అని అందరికీ తెలిసినా సరైన ఆధారాలు లేవన్న కారణంతో ఇప్పటికీ కేసు విచారణ కోర్టుల్లో మగ్గుతోంది. అంతటి నమ్మకమైన మద్దతుదారుడుగా ముద్రపడిన రేవంత్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పంచాయితీ పెట్టుకుంటున్నట్లు చెబితే ఎవరైనా నమ్ముతారా ?

తాజాగా రేవంత్ మాటల్లో అర్ధమవుతున్నది ఏమిటంటే ఏపీ ప్రభుత్వం ఇకముందు కూడా ప్రతిరోజు నీటిని తరలించుకుని వెళుతూనే ఉంటుందని. రేవంత్ చేస్తున్నది తప్పయితే జనాలు చూస్తూ ఊరుకోరు. సమయం, సందర్భం చూసుకుని కర్రుకాల్చి వాతలు పెట్టడం ఖాయం. పరిస్ధితిని అంతవరకు తెచ్చుకోవటమే తన మాటలకు అర్ధమైతే జనాలు వాతలుపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని రేవంత్ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

Tags:    

Similar News