బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ మౌనం దేనికి సంకేతం ?

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC 42% reservations) కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా ఏ పార్టీ కూడా వ్యతిరేకించే స్ధితిలేదు

Update: 2025-09-27 07:30 GMT
BRS working president KTR

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ బాగా ఇరుకునపడిపోయింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయం, జారీచేసిన జీవో న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్నది వేరేసంగతి. ఎందుకంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC 42% reservations) కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా ఏ పార్టీ కూడా వ్యతిరేకించే స్ధితిలేదు. వ్యతిరేకించిన పార్టీని బీసీల వ్యతిరేక పార్టీగా ముద్రవేయటానికి మిగిలిన పార్టీలు, నేతలు సిద్ధంగా ఉన్నారు. (Telangana)తెలంగాణలో 56.33 శాతం ఉన్న బీసీలను వ్యతిరేకం చేసుకోవటానికి ఏపార్టీ కూడా సిద్ధంగా లేదు. ఆధైర్యంతోనే రేవంత్(Revanth) ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయబోతున్నట్లు తాజాగా జీవోను జారీచేసింది.

ప్రభుత్వం జారీచేసిన జీవో విషయంలో బీఆర్ఎస్ బాగా ఇరుకునపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా ఇతర నేతల్లో ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా నోరుమెదపటంలేదు. దీంతోనే జీవో జారీ విషయంలో బీఆర్ఎస్ ఎంత ఇబ్బందులు పడుతోందో అర్ధమవుతోంది. జీవోజారీని సమర్ధిస్తున్నట్లు కాని వ్యతిరేకిస్తున్నట్లు కాని ప్రకటించలేదు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఆర్. కృష్ణయ్య, ఎంఎల్ఏ పాయల్ శంకర్ జీవోను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. జీవో జారీకి తమపార్టీ సంపూర్ణమద్దతు ఇస్తున్నట్లు రామచంద్రరావు ప్రకటించారు. ఎప్పుడో జారీచేయాల్సిన జీవోను ఇఫ్పటికైనా జారీచేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. ఇక వామపక్షాలు, ఎంఐఎం నేతలు కూడా హర్షం వ్యక్తంచేశారు. కల్వకుంట్ల కవిత కూడా మద్దతుగానే మాట్లాడారు.

జీవో విషయంలో అసలు నోరుమెదపనిది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. బీఆర్ఎస్ సమస్య ఏమిటంటే జీవోకు మద్దతుగా మాట్లాడినా, జీవో జారీని స్వాగతించినా రేవంత్ నిర్ణయాన్ని బలపరిచినట్లవుతుంది. దాన్ని రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక జీవోను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ ను బీసీల వ్యతిరేక పార్టీగా ప్రచారం చేసి ఎన్నికల సమయంలో కార్నర్ చేసే అవకాశముంది. ఏమీ మాట్లాడకపోయినా రేవంత్ అండ్ కో చేసేది ఇదే. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ క్లైం చేసుకోవటం బీఆర్ఎస్ కు ఏమాత్రం ఇష్టంలేదు. అలాగని దాన్ని బాహాటంగా వ్యతిరేకించే పరిస్ధితిలో కూడా లేదు. అందుకనే ఏమిచేయాలో అర్ధంకాక కేటీఆర్ బాగా ఇరుక్కుపోయారు.

నిజానికి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం, జారీచేసిన జీవో న్యాయసమీక్షలో నిలవదని అందరికీ తెలుసు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించేందుకు లేదని గతంలో సుప్రింకోర్టు తీర్పు చెప్పింది. సుప్రింకోర్టు తీర్పుండగా దాన్నికాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయసమీక్షలో చెల్లదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో చాలెంజ్ చేస్తే వెంటనే కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కోర్టులో చెల్లదన్న విషయం రేవంత్ తో పాటు అందరికీ బాగా తెలుసు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్ధిపేట జిల్లా జలపల్లి మల్లవ్వ ప్రభుత్వ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు దాఖలుచేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే అప్పటికి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోను జారీచేయలేదు. పిటీషనర్లను కోర్టు ఇదే అడిగింది.

ఊహాజనితంగా దాఖలుచేసిన పిటీషన్లను కోర్టు అంగీకరించదని పిటీషనర్లకు గట్టిగా చెప్పింది. కేసును కోర్టు కొట్టేసిన రెండోరోజు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేస్తు రేవంత్ ప్రభుత్వం జీవో జారీచేసింది. మరి పై ఇద్దరు మళ్ళీ కోర్టులో కేసులు వేస్తారా లేదా అన్నది తెలీదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు కేసువేసినా వెంటనే జీవోను హైకోర్టు కొట్టేయటం ఖాయం. హోలు మొత్తంమీద గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవో అమలైనా, కోర్టు కొట్టేసినా అడ్వాంటేజ్ రేవంత్ ప్రభుత్వానికే. జీవో అమలైతే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత, క్రెడిట్ రేవంత్ దక్కుతుంది. ఒకవేళ కోర్టు జీవోను కొట్టేసినా నష్టంలేదు. ఎలాగంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు తాను చిత్తశుద్దితో కృషిచేసినట్లు రేవంత్ చెప్పుకుంటాడు. అంటే ఏది జరిగినా రేవంత్ కే అడ్వాంటేజ్.

Tags:    

Similar News