ఇన్‌ప్లూయెన్సర్లు సరే.. సెలబ్రిటీల పరిస్థితి ఏంటి..?
సినీ, స్పోర్ట్స్ స్టార్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.;
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌పై సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. దీనిని ఎంతమంది వ్యతిరేకిస్తున్నా కొందరు ప్రమోట్ చేయడం మాత్రం మానుకోవడం లేదు. మరికొందరయితే తాము ప్రమోట్ చేయడానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకుంటున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌పై తెలంగాణ పోలీస్ అధికారులు కొరడా ఝులిపించడం ప్రారంభించారు. వీటిని ప్రమోట్ చేస్తున్న 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ వారికి నోటీసులు కూడా జారీ చేశారు. వీరిలో కొందరు చిన్నచిన్న నటులు కూడా ఉన్నారు.
బెట్టింగ్ యాప్‌ల ద్వారా దారుణాలు జరుగుతున్నాయని, యువత తప్పుదారి నడుస్తుందని తెలిసినా ఎందుకు ప్రమోట్ చేరస్తున్నారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్‌లపై బీఎన్‌ఎస్ 318(4) 3, 3ఏ, టీఎస్‌జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎటువంటి లాభం ఉండదని, వీటి ద్వారా ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని, ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి మరో ప్రశ్న వచ్చింది.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న చిన్నపాటి నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై యాక్షన్ తీసుకుంటున్నారు బాగుంది. కానీ కొందరు స్టార్లు కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని, వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారని ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సినీ, స్పోర్ట్స్ స్టార్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని, ఇదంతా కూడా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, కోహ్లీ, పాండ్యా, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, తమన్నా భాటియా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే తయారవుతుంది. వీరికి మాత్రం ఇప్పటి వరకు విచారణకు రావాలంటూ ఎందుకు నోటీసులు ఇవ్వలేదన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.
అంటే పెద్దవారు కాబట్టి వారిపై యాక్షన్ తీసుకోవడం లేదా? ఇన్‌ఫ్లూయెన్సర్లు అంటే చిన్నవారు కావడంతో వారిపై కొరడా ఝులిపిస్తున్నారా? అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎటువంటి పీఆర్ టీమ్‌లు, పీఏ టీమ్‌లు ఉండవని, వారు ఎటువంటి యాడ్స్ చేయాలి, సదరు సంస్థలు సరైనవా కాదా అని చెప్పే వారు ఉండరు. ఒకవేళ అవి తప్పు చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలని వివరించే లీగల్ టీమ్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఉండరు. కానీ సెలబ్రిటీలకు అలా కాదు. వారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాంటి వారికి బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం తప్పని తెలియదా? వాళ్ల టీమెంబర్స్ ఎవరూ చెప్పలేదా? చెప్పినా తర్వాత చూసుకోవచ్చులే అన్న ధీమాతోనే వారు చేశారా? అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. అంతేకాకుండా వాళ్లు చేసిన ప్రకటనలు అందుబాటులో ఉన్నా.. పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నాలుగేళ్ల కిందటే మద్రాస్‌కు చెందిన ఏపీ సూర్యప్రకాశమ్ అనే అడ్వకేట్.. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. యువతను తప్పుదోవ పట్టించే, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్, సైట్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిల్‌లో కోరారు. ‘‘ఇటువంటి ఆన్‌లైన్ గాంబ్లింగ్ సైట్‌లను నిలిపివేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా వీటిని ప్రమోట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్ వేయడం, గ్యాంబ్లింగ్ ఆడటం నేరం. కావున త్వరితగతిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన కోరారు. ఈ పిల్‌పై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి తప్పని తెలిసినా సదరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడమే కాకుండా.. అసలు ఇండియాలోకి ఆ సంస్థలు ఎలా ఎంటర్ అవుతున్నాయనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రమోషన్‌పై ఉక్కుపాదం మోపడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. యాప్‌లు, సైట్‌లను నియంత్రించడం, కొత్తవి రాకుండా చేయడంలో ఎందుకు నత్తనడక నడుస్తుంది. అసలు ఏమైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? వాటిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎందుకు చట్టాలు తేవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ వ్యవసనానికి యువత బలవుతున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. రూట్ కాజ్‌ను ఎందుకు తొలగించడం లేదు? అనేది కీలకంగా మారింది.