KCR| ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు ఉచ్చుబిగించనున్న బండి ?

కేసు దర్యాప్తును ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం సీబీఐ, ఈడీలకు అప్పగించకపోయినా కేసును కేంద్ర దర్యాప్తుసంస్ధలు టేకప్ చేసే అవకాశముంది;

Update: 2025-08-09 07:58 GMT
KCR and Bandi Sanjay

టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) దర్యాప్తును సమర్ధవంతంగా పూర్తిచేసి దోషులను శిక్షించటం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) చేతకాదన్నారు. అందుకనే తాను ఎప్పటినుండో సీబీఐ(CBI), ఈడీ(ED)లకు కేసును అప్పగించాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని చెప్పారు. ఇప్పటివరకు డిమాండుకు మాత్రమే పరిమితమైన బండి(Bandi Sanjay) తొందరలోనే ఈ కేసులో యాక్షన్లోకి దిగి కేసీఆర్(KCR) కు ఉచ్చు బిగించబోతున్నట్లు బీజేపీ(Telangana BJP) వర్గాల సమాచారం. కేసు దర్యాప్తును ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం సీబీఐ, ఈడీలకు అప్పగించకపోయినా కేసును కేంద్ర దర్యాప్తుసంస్ధలు టేకప్ చేసే అవకాశముంది. ఇప్పటికే హోంశాఖఉన్నతాధికారులు, కౌంటర్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో ఈవిషయమై బండి మాట్లాడినట్లు సమాచారం.

ఎలాగంటే కేంద్రమంత్రి హోదాలో బండి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడే. కాబట్టి బాధితుడి హోదాలో సీబీఐ, ఈడీలకు బండి తొందరలోనే కేసీఆర్ పై ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కేసీఆర్ పై బండి ఫిర్యాదుచేయగానే సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగే అవకాశముంది. ఇప్పటికే ఫార్ములా ఈకార్ రేసును ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తుచేస్తోంది. ఫార్ములా కేసును దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వం అడగకపోయినా ఈడీ దర్యాప్తుచేస్తోంది. మనీల్యాండరింగ్ ఆరోపణలున్నాయన్న పేరుతో ఈడీ దర్యాప్తుచేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి మీద కేసులు నమోదు చేయటమే కాకుండా రెండుసార్లు విచారణ కూడా జరిపింది. అదేపద్దతిలో ఫోన్ ట్యాపింగు కేసులో కూడా సీబీఐ, ఈడీ ఎంటరయ్యే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్, కేటీఆర్ వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని బండి ఆరోపించారు. అలాగే ట్యాపింగ్ బాధితులైన జడ్జీలను విచారించే పరిధి సిట్ కు లేదన్నారు.

బండి చెప్పినట్లుగా జడ్జీలను విచారించే అధికారం సిట్ కు ఉండకపోవచ్చు. అయితే సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పటంలో ఉద్దేశ్యం వాళ్ళేదో తప్పుచేశారని కాదు. ఎవరెవరి ఫోన్లయితే ట్యాప్ అయ్యాయో వాళ్ళని సిట్ విచారణకు పిలవటంలో ఉద్దేశ్యం బాధితులనే. తమ ఫోన్ ట్యాపయ్యిందన్న విషయం కూడా చాలామందికి తెలీదు. టెలికాం ప్రొవైడర్ల నుండి అందిన జాబితాలో వేలాదిమంది ఫోన్ నెంబర్లున్నాయి. తమ ఫోన్లు ట్యాప్ అయినవిషయం తెలుసా ? అన్న విషయాలను కన్ఫర్మ్ చేసుకునేందుకు మాత్రమే బాధితులుగా సిట్ పిలుస్తున్నది. ఇప్పుడు విషయం ఏమిటంటే కొండరు జడ్జీల ఫోన్లూ కేసీఆర్ ప్రభుత్వంలో ట్యాప్ అయ్యాయి. జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాబట్టి ఫోన్లు ట్యాపయిన జడ్జీలు+కుటుంబసభ్యులను సిట్ నోటీసులు జారీచేసి పిలిపించటంలో తప్పేమీలేదు.

అమిత్ షా ఫోనూ ట్యాపయ్యిందా ?

తాజాసమాచారం ఏమిటంటే బండి సంజయ్ ఫోన్ తో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ను కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. విచారణకు హాజరైన బండి ముందు సిట్ అధికారులు కొన్ని నెంబర్లను ఉంచి ఎవరివని అడిగారు. ఆనెంబర్లను చూసిన బండి షాక్ కు గురైనట్లు తెలిసింది. కారణం ఏమిటంటే అందులో అమిత్ షా ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేరుగా సీబీఐని రంగంలోకి దింపే ఉద్దేశ్యంతోనే బండి సంజయ్ వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ కూడా ట్యాపయ్యిందన్న విషయాన్ని బయటనపెట్టారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి కేసీఆర్ మీద నిజంగానే గట్టిచర్యలు తీసుకోవాలని అనుకుంటే రాష్ట్రప్రభుత్వం అడగకపోయినా బండి లేదా అమిత్ షా ఫిర్యాదు మేరకు డైరెక్టుగానే సీబీఐ కేసునమోదుచేసే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.

బీఆర్ఎస్ మీద నియంత్రణకు పోటీ

కేసీఆర్ మెడకు కేసుల ఉచ్చును బిగించి బీఆర్ఎస్ ను గుప్పిటలో ఉంచుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇదేపద్దతిలో రెండుపార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేసులను బూచిగా చూపించి కేసీఆర్ తో బేరాలు ఆడుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నాడని బండి ఆరోపిస్తున్నరు. ఇదేసమయంలో కేసు దర్యాప్తును సాకుగా చూపించి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి పార్టీని కంట్రోల్లో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందని రేవంత్ ప్రత్యారోపణలు తెలిసిందే. అంటే దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే రెండుపార్టీలు కూడా కేసులను బూచిగా చూపించి కేసీఆర్ ను గుప్పిటలో పెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయని.

కేసులు నమోదుచేసినంత మాత్రాన కేసీఆర్ కు ఏమీ అయిపోదు. ఎందుకంటే దర్యాప్తుసంస్ధలు తమ మీద కేసులు నమోదుచేసి విచారణకు నోటీసులు జారీచేయగానే కేసీఆర్ లేదా కేటీఆర్ కోర్టులో కేసులు వేసి విచారణను అడ్డుకునేందుకు స్టే కోసం ప్రయత్నిస్తారు. కాళేశ్వరంపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం యాక్షన్ లోకి దిగితే ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే విషయమై హరీష్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారని సమాచారం. కాబట్టి కేసులను బూచిగా చూపించి కేసీఆర్ ను గుప్పిటలో పెట్టుకోవటం అంత ఈజీకాదు.

అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును చర్చకు పెట్టినాక ఏమితీర్మానం చేస్తారు ? బండి లేదా అమిత్ షా ఏమి చేయబోతున్నారన్న విషయమే ఆసక్తిగా మారింది. ఏదేమైనా కొన్నిరోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెలంగాణలో సంచలనంగానే ఉంటుందని అర్ధమవుతోంది.

Tags:    

Similar News