ఆ పంట వినియోగంలో చైనా తరువాత మనమే.. అయినప్పటికీ..

ఆ పంట సహజ వినియోగంలో చైనా తరువాత భారతే రెండోస్థానంలో ఉంది. అయినప్పటికీ దేశీయ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇంతకీ ఆ పంట ఏంటీ.. ఏంటా సంక్షోభం..

Update: 2024-01-09 10:01 GMT

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సిసిలీ థామస్ అనే 60 ఏళ్ల వితంతు రైతు తనకున్న ఆరు ఎకరాల భూమిలో రబ్బరు సాగు చేసి హయిగా బతుకు బండి నడిపించేది. రబ్బర్ సాగుపై వచ్చిన ఆదాయంతోనే తన కూతురు మేరీ విద్య పూర్తి చేయించింది. తల్లి థ్రెసియమ్మను బాగా చూసుకునేదీ. వారి అవసరాలకు మారతీ జెన్, మహీంద్రా లాంటీ కార్లను సైతం కొనుగోలు చేశారు.

అయితే గత పది సంవత్సరాల కాలంలో వారి జీవన విధానం మొత్తం తల్లకిందులైంది. ఉన్న కార్లను అమ్మివేశారు. నర్సింగ్ చేయాలనుకున్న మేరీ ఆర్థిక స్థోమత పడిపోవడంతో బీకాం పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో తల్లి థ్రెసియమ్మకు అనారోగ్యం.. ఏం చేయాలో అర్థం కాక ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితి ఈ ఒక్క కుటుంబానిదే కాదు. రబ్బరు సాగు చేస్తున్న కేరళ రైతుల వ్యథ

కేరళలో పది సంవత్సరాల క్రితం కిలో రబ్బరు ధర రూ. 270 గా ఉండేది. ప్రస్తుతం సగానికి పడిపోయి కేవలం రూ.130 గా ఉంది. దాంతో అనేక కుటుంబాల జీవితం సంక్షోభంలో పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా టైర్ల ధరలు ఓ వైపు పెరుగుతుంటే, సహజరబ్బరు ధరలు మాత్రం ఎందుకు తగ్గిపోతున్నాయని కేరళ రైతుసంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.

టైర్ల కంపెనీలు రైతులు, వినియోగదారులను ఇద్దరిని నిండా ముంచేస్తున్నాయని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మేము అర్ధాకలితో జీవిస్తున్నాం. మా జీవనవిధానం మొత్తం మారిపోయిందని అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబ్బరును కూడా పంటగా పరిగణించి కనీస మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాపై ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"నేను 12 ఏళ్ల వయస్సు నుంచి రైతుని. గత 50 సంవత్సరాలుగా రబ్బరు సాగు చేస్తున్న. అయితే గత పది సంవత్సరాలుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. అసలు మాలాంటి చిన్న సన్నకారు రైతులు బతికే పరిస్థితి లేదు" అని కొట్టాయం జిల్లా ఎరుమేలికి చెందిన రైతు బిజుసీడీ చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉండి ఎవరైన డబ్బు పంపితేనే కొన్ని కుటుంబాలు రోజులు వెళ్లదీస్తున్నాయని దీనంగా చెబుతున్నారు.

ధర పతనంతో చిన్న పరిశ్రమల మూత

"కంజిరపల్లి ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు ఉండేవి. వాటిలో రబ్బర్ బ్యాండ్, గ్లోవ్ తయారీ పని జరిగేది. ఒక్కో యూనిట్ లో 30-40 మంది పని చేసేవారు. వారిలో స్థానికంగా ఉంటున్న మహిళలదే అగ్రస్థానం. పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వకపోయినా బతకడానికి అవి సరిపోయేవి. అయితే రబ్బర్ సంక్షోభంతో ఆ యూనిట్లన్నీ మూత పడ్డాయి. దాంతో గ్రామాల్లోని కుటుంబాలన్నీ సంక్షోభంలో పడ్డాయి" అని అఖిల భారత కిసాన్ సభ నాయకుడు కేఎస్ కజిన్ అన్నారు.

బీజేపీ ఎన్నికల వాగ్థానం నెరవేర్చాలి

రబ్బరు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం చూపెడుతున్న ఉదాసీనత వైఖరితోనే రైతులు రోడ్లపైకి రావాల్సి వచ్చిందని కమ్యూనిస్ట్ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే రబ్బరు కిలోకి రూ. 350 ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 2014 నాటి ఎన్నికల ప్రచారంలో ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ వాగ్ధానం చేసిందని వారు అంటున్నారు. ఆ హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



 

2018 లో అక్రమ వ్యాపార పద్దతులు అవలంభించి, ధరల విషయంలో అసంబద్దంగా వ్యవహరించినందుకు కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) టైర్ల కంపెనీలపై విధించిన 1788 కోట్ల పెనాల్టీని వెంటనే రైతులకు పంపిణీ చేయాలని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఈ కార్టెల్, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఎంఆర్ఎఫ్(MRF), అపోలో టైర్ల కంపెనీలు ముట్టడించి నిరసన ప్రదర్శనలు చేశారు. కంపెనీలు రైతులను వినియోగదారులను ఇద్దరిని మోసం చేస్తున్నాయని, 83 శాతం మార్కెట్ వీటి నియంత్రణలోనే ఉందని, అందుకే ఈ విధంగా జరగుతోందని సజిన్ అన్నారు.

" మేము రబ్బర్ కిలో రూ. 250 కి విక్రయించినప్పుడు లారీ టైర్ ధర రూ. 13,000 గా ఉండేది. ఇప్పుడు రూ. 170 విక్రయిస్తున్నాం.. కానీ అదే టైర్ ధర రూ. 28000 వేలుగా ఉంది. ఇదీ ఏం విధానం" అని సజిన్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై టైర్ తయారీదారులను ఫెడరల్ ఈ మెయిల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

భారత్ స్థానం ఆరు

రబ్బర్ పంట ఉత్పత్తిలో భారత్ స్థానం ఆరు. ప్రపంచ ఉత్పత్తిలో 5.5 శాతం వాటా మనసొంతం. రబ్బర్ సహజ వినియోగంలో చైనా తరువాత భారతే రెండోస్థానంలో ఉంది. అయినప్పటీకి దేశీయ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సహజ రబ్బర్ దిగుమతిలో 2020-21 లో 4.10 లక్షల టన్నుల నుంచి 2020-22 నాటికి 33 శాతం పెరిగి 5.46 లక్షల టన్నులకు చేరింది. అలాగే ఎగుమతిలో ఇదే కాలంలో 11,343 టన్నుల నుంచి 3,560 టన్నులకు పడిపోయింది.

రబ్బరు పంట.. కేరళలోనే

కేరళలో కొబ్బరి పంట తరువాత స్థానం రబ్బరుదే. 21.8 స్థూల సాగును ఆక్రమించింది. 2022 లో రబ్బరు 8.27 లక్షల హెక్టార్లలో సాగు అవుతోంది. మొత్తం 9 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఈరంగంలో 12 లక్షల మంది చిన్న సన్నకారు మధ్యస్థ రైతులు, 2 లక్షల మంది ట్యాపింగ్ కార్మికులు, 30,000 మంది చిన్న వ్యాపారులకు ఇదే ఊతమిస్తోంది. అంతేకాక అనేక అనుబంధ పరిశ్రమలలోని కార్మికులకు జీవనోపాధిని అందిస్తోంది. అలాంటి రబ్బరు సాగు ప్రస్తుతం సంక్షోభం లో చిక్కుకుంది.

Tags:    

Similar News