హత్రాస్ తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం

యూపీలోని హత్రాస్ జిల్లాలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు.

Update: 2024-07-04 06:34 GMT
ఆసుపత్రిలో గాయపడ్డవారిని పరామర్శిస్తున్న సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. పుల్హరి గ్రామంలో మంగళవారం భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌కు చుట్టుపక్కల జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ముగిశాక భోలే బాబా వేదిక నుంచి నిష్ర్కమిస్తుండగా.. ఆయన పాదధూళి కోసం తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక కొంతమంది అక్కడిక్కడ చనిపోయారు. గాయపడ్డ వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది చనిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం తర్వాత ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు.

న్యాయ విచారణ బృందంలో రిటైర్డ్ పోలీసులు, పరిపాలన అధికారులు ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ప్రమాదమా? లేక కుట్ర అనే కోణంలో కూడా విచారణ జరుపుతామని సీఎం చెప్పారు.

‘విచారణకు భోలే బాబా సిద్ధంగా ఉన్నారు’

సత్సంగ్ నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. 'ముఖ్య సేవాదార్' దేవప్రకాష్ మధుకర్, ఇతర నిర్వాహకులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నారు. భోలే బాబా పేరు మాత్రం నమోదు కాలేదు. సత్సంగ్‌కు 80 వేల మంది వస్తారని అనుమతి పొందిన నిర్వాహకులు.. 2.5 లక్షల మందిని లోపలికి అనుమతించారని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చారు.

కాగా ఈ ఘటనపై విచారణ బృందానికి సహకరించేందుకు భోలే బాబా సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. "కొందరు సంఘ వ్యతిరేకులు దీన్ని కుట్రకోణంలో చూస్తున్నారని’’ అని పేర్కొన్నారు.

కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు..

ఈ దుర్ఘటనపై బుధవారం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఘటనపై విచారణకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాలని కోరుతూ ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అలహాబాద్‌ హైకోర్టులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మరో పిల్‌ దాఖలైంది.

ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు ఎందుకు లేదు?

ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు చేర్చకపోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇదే ప్రశ్నపై సీఎం స్పందిస్తూ.. ‘ప్రాథమికంగా ఈవెంట్‌ నిర్వహణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై కేసు నమోదు చేశారు. బాధ్యులెవరైనా సరే.. విచారణ ఎదుర్కోక తప్పదు’ అని పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్, సికంద్రరావు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రాథమిక నివేదిక ప్రకారం.. బాబా వేదిక నుండి వెళ్లిపోవడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. బాబాను దగ్గరి నుంచి దర్శించుకునేందుకు, ఆయన పాదముద్రల నుంచి కొంత మట్టిని సేకరించుకునేందుకు పోటీపడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో రాసి ఉంది.

కాగా తొక్కిసలాటలో ఊపిరాడకపోడవం వల్లే చనిపోయారని ఎటా ఆసుపత్రిలోని సీనియర్ వైద్యుడు తెలిపారు.

Tags:    

Similar News