‘కేంద్రం జోక్యంతో సమస్యను పరిష్కరించుకోవాలి’
నీటి వాటా విషయంలో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం..;
సుత్లెజ్-యమునా కెనాల్(SYL canal)పై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు పంజాబ్(Punjab), హర్యానా(Haryana) రాష్ట్రాలు కేంద్రంతో సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారించింది. సుహృద్భావపూరిత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాల్సి ఉందని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి కోర్టుకు తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిసి సమస్యను ఇరు రాష్ట్రాలు సానుకూలంగా పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. అప్పటికీ పరిష్కారం దొరక్కపోతే విచారణ కొనసాగిస్తాం అంటూ కేసును ఆగస్టు 13కు వాయిదా వేసింది ధర్మాసనం.
కెనాల్ చరిత్ర..
రవి, బియాస్ నదుల నీటిని పంచుకునేందుకు ఎస్‌వైఎల్ కెనాల్ రూపుదిద్దుకుంది. మొత్తం 214 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కెనాల్.. 122 కిలోమీటర్లు పంజాబ్‌లో, మిగిలిన 92 కిలోమీటర్లు హర్యానాలో నిర్మించాల్సి ఉంది. హర్యానా ఇప్పటికే తన వాటా పనులను పూర్తి చేసింది. కానీ పంజాబ్ 1982లో పనులు ప్రారంభించి ఆ తరువాత నిర్మాణాన్ని నిలిపివేసింది.
ఈ నీటి వివాదం(Water dispute) రెండు రాష్ట్రాల మధ్య గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. 1996లో హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేసింది. 2002 జనవరి 15న హర్యానాను అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పంజాబ్ తన ప్రాంతంలో ఎస్‌వైఎల్ కాలువ నిర్మించాలని ఆ తీర్పులో సూచించింది.
పంజాజ్ అసెంబ్లీ కీలక తీర్మాణం..
నీటి పంపకాల్లో హర్యానా(Haryana), పంజాబ్ (Punjab) రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో..పంజాబ్ శాసనసభ సోమవారం కీలక తీర్మానం చేసింది. నీటి వనరుల శాఖ మంత్రి బరీందర్ కుమార్ గోయల్ ప్రవేశపెట్టిన తీర్మాణంపై చాలా సేపు సభలో చర్చ జరిగింది. చివరకు ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఒక్క నీటి బొట్టును కూడా హర్యానాకు వదిలేదిలేదని స్పష్టం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(CM Bhagwant Mann). “చట్ట విరుద్ధంగా బీబీఎంబీ (BBMB) సమావేశాన్ని ఏర్పాటు చేసి పంజాబ్ నీటి వాటాను హర్యానాకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోంది. హర్యానా రాష్ట్రం మార్చి 31 నాటికి 103 శాతం నీటి వాటాను వాడుకుంది. పంజాబ్‌కు అదనంగా నీరు రానందున హర్యానాకు నీళ్లివడం సాధ్యపడదు’’ అని కుండబద్దలుకొట్టారు.