బెంగాల్‌లో WBSSC కార్యాలయం ముందు నిరసన..
సర్వీస్ కమిషన్ అధికారులను దిగ్భందించిన ఆందోళనకారులు; లోపలే ఉండిపోయిన చైర్మన్;
సుప్రీంకోర్టు (Supreme Court) ఉత్తర్వుల తరువాత ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది ఉపాధ్యాయులు మంగళవారం (ఏప్రిల్ 22) పశ్చిమ బెంగాల్(West Bengal) ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సోమవారం సాయంత్రం సాల్ట్ లేక్‌లోని సర్వీస్ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు.. తమకు "న్యాయం" జరిగే వరకు కదలమని హెచ్చరించారు.
'అర్హులు, అనర్హుల జాబితా ప్రచురించాలి'
కమిషన్ చైర్మన్ సిద్ధార్థ మజుందార్ సహా అధికారులను లోపలికి వెళ్లనివ్వకుండా, బయటకు రానివ్వకుండా అడ్డుకున్న ఆందోళనకారులు.. మెరిట్ ఆధారంగా నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితా, లంచాలు చెల్లించి నియామకాలు పొందిన అభ్యర్థుల జాబితాను ప్రచురించాలని డిమాండ్ చేశారు.
భద్రత కట్టుదిట్టం..
సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.
విద్యా మంత్రి హామీ..
గతంలో రాష్ట్ర విద్యా మంత్రి బ్రాత్య బసు (Bratya Basu) "అర్హులు, అనర్హులు" అభ్యర్థుల జాబితాను రెండు వారాల్లో ప్రచురిస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం నాటికి జాబితాను ప్రచురించకపోవడంతో కమిషన్ కార్యాలయం వెలుపల అభ్యర్థుల నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు కమిషన్ కట్టుబడి ఉందని WBSSC చైర్మన్ సిద్ధార్థ మజుందార్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. "సేవలు అందించిన (నిరుద్యోగ) ఉపాధ్యాయులకు జీతం కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఏప్రిల్ 21 రోజున అర్హులు, అనర్హుల జాబితా ప్రచురించడం గురించి ఏమీ చెప్పలేదు.
తృణమూల్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రభుత్వాన్ని బీజేపీ(BJP) తీవ్రంగా విమర్శించింది. నిరసనకారులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ బసు ఆరోపించారు. అభ్యర్థులు శాంతియుత నిరసనను కొనసాగించాలని కోరారు.