ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ?

రాజకీయ వారసత్వం, అనుభవం, తాజా ఎన్నికల విజయం దృష్ట్యా.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి పర్వేష్ వర్మకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి;

Update: 2025-02-08 10:39 GMT
Click the Play button to listen to article

ఎట్టకేలకు ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. తరువాతి ఘట్టం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అయితే సీఎం ఎవరు అవుతారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పర్వేష్ సహబ్ సింగ్ వర్మ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సహబ్ సింగ్ వర్మ కుమారుడు.


ఎవరీ పర్వేష్?

పర్వేష్ వర్మ (Parvesh Verma) 1977 నవంబర్ 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీ.కాం పట్టా పొంది, ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో (Delhi Polls) మెహ్రౌలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదుపరి ఏడాది (2014) పశ్చిమ ఢిల్లీ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

ఇక ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ(BJP) సత్తాచాటింది. 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో మెజారిటీ సాధించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పర్వేష్ వర్మ.. మూడు సార్లు సీఎంగా గెలుపొందిన అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై 4వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ రాజకీయ వారసత్వం, అనుభవం, తాజా ఎన్నికల విజయం దృష్ట్యా.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి పర్వేష్ వర్మకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


Tags:    

Similar News