AAP కూటమిలో కొనసాగుతుందా? తప్పుకుంటుందా?
ఢిల్లీలో పరాజయాన్ని పోస్టుమార్టం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇక భారత కూటమిలో కొనసాగాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోబోతుంది.;
ఢిల్లీ ఎన్నికలు (Delhi Polls) ముగిశాయి. హస్తినా పీఠాన్ని బీజేపీ (BJP) చేజిక్కించుకుంది. వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సారి 22 స్థానాలు దక్కాయి. కాషాయ పార్టీ 48 స్థానాల్లో జయకేతనం ఎగురువేసింది. చీపురు పార్టీ ఓటమికి కారణాలు చాలా ఉన్నా.. ఇండియా కూటమి (I.N.D.I.A Alliance) భాగస్వాములు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేయడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకుల మాట.
ఢిల్లీలోనే కాదు.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలోనూ ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగడం వల్ల అక్కడ కూడా కాషాయ పార్టీ రెపరెపలాడిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచనలో పడిపోయింది. ఇండియా కూటమిలో కొనసాగాలా? వద్దా? అనే అంతర్మథనం మొదలైంది. ఈ విషయంలో పార్టీ ప్రముఖ నేతలు నిర్ణయం తీసుకుంటారని సీనియర్ నేత సంజయ్ సింగ్ సోమవారం తెలిపారు.
"ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నాయకత్వ నిర్ణయమే తుది నిర్ణయం," అని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇండియా టుడేతో అన్నారు.
ఢిల్లీలో AAP-కాంగ్రెస్ మధ్య విభేదాలతో బీజేపీ లాభపడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఐక్యత, సమగ్రతపై దృష్టిపెట్టాలని కూటమి నేతల సూచిస్తున్నా.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ తాము ఒంటరిగానే ఢిల్లీ ఎన్నికలపోరుకు సిద్ధమయ్యారు. ఇటు ఇండియా కూటమి కూడా ప్రాంతీయ పార్టలతో పొత్తు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రమేనని తేల్చి చెప్పింది. రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరుగా ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే ఢిల్లీ ఎన్నికల్లో AAP ఓటమికి కాంగ్రెస్ కారణమా? అనే ప్రశ్నకు తమ పార్టీ దానిపై సమీక్షిస్తోందని సంజయ్ సింగ్(Sanjay Singh) చెప్పారు.
గత పదేళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న AAP.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. ముఖ్యంగా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి పరివేష్ వర్మ చేతిలో ఓడిపోవడం గమనార్హం.
"ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వారి తీర్పును గౌరవించాలి. మేము ఫలితాలను సమీక్షిస్తున్నాం. ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం," అని సంజయ్ సింగ్ తెలిపారు.