ఐపీఎల్: మరోసారి చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్
ముంబాయికి కనీస పోటీ ఇవ్వలేకపోయిన ఆరెంజ్ ఆర్మీ;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-23 17:56 GMT
ఐపీఎల్ -2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా ఈ రోజు ముంబాయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది.
హైదరాబాద్ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ముంబాయి కేవలం 15 ఓవర్లలోనే చేధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగి అర్థ సెంచరీ(70, 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ లు) సాధించడంతో జట్టు సులువుగా విజయాన్ని సాధించింది.
ఇంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ అర్థ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్ కు తోడుగా విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (40 : 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ ల) హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో జట్టు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేరింది.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమష్టిగా విఫలం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ స్కోర్ బోర్డుపై పట్టుమని 20 పరుగులు చేయకుండానే నాలుగు కీలక వికెట్లు పొగొట్టుకుంది.
ముంబాయి బౌలర్లు దీపక్ చాహార్, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. నలుగురు ప్రధాన బ్యాట్స్ మెన్లు అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చెత్త షాట్ సెలెక్షన్ తో అనవసరంగా వికెట్ పారేసుకున్నారు.
అయితే క్రీజులో నిలదొక్కుకున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ తరువాత ఎడాపెడా బౌండరీలు బాదడంతో ఓ దశలో కోలుకున్నట్లే కనిపించింది. క్లాసెన్ కు (71) తోడుగా అభినవ్ మనోహార్(43) సహకారం అందించాడు.
అయితే మ్యాచ్ కు మంచి ముగింపు ఇవ్వడంతో మాత్రం బ్యాట్స్ మెన్లు విఫలం అయ్యారు. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే సాధించింది.
హైదరాబాద్ జట్టులో మొదటి నలుగురు బ్యాట్స్ మెన్లతో ఎవరూ రెండంకెల పరుగులు సాధించలేకపోయారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ క్రీజులో నిలదొక్కుకోవడానికి అసలు ఆసక్తి చూపించలేదు. ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగే దూకుడుగా ఆడటానికి ప్రయత్నించి బంతిని గాల్లోకి లేపగా పాయింట్ ఫీల్డర్ చేతిలోకి చేరింది. మరోవైపు ఇషాన్ కిషన్ కీపర్ క్యాచ్ ద్వారా వెనుదిరగగా, అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి నేరుగా ఫీల్డర్ చేతిలోకి బంతిని పంపాడు.
హైదరాబాద్ బ్యాట్స్ మెన్ల ఆటతీరుపై ఫ్యాన్స్ తీవ్రంగా అసహనంగా కనిపించారు. ఈ సీజన్ ఆరెంజ్ ఆర్మీ కచ్చితంగా మూడువందల పరుగుల మార్క్ ను అందుకుంటుందని, ట్రోఫి గెలుస్తుందని భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది.