ఆర్సీబీ దూకుడుకు గుజరాత్ లయన్ పగ్గాలు వేస్తుందా?
టేబుల్ లో టాపర్ గా ఉన్న బెంగళూర్ జట్టు, చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారే అవకాశం;
By : The Federal
Update: 2025-04-02 11:54 GMT
ఈ సీజన్ లో బెంగళూర్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తన తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతాకు షాక్ ఇచ్చిన ఆర్సీబీ, రెండో మ్యాచ్ లో మాజీ ఛాంపియన్ చెన్నైకు చెక్ పెట్టింది. నేడు సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. ఇద్దరు ఛాంపియన్స్ లను ఓడించడంలో ఆర్సీబీ బౌలర్ల దే కీలకపాత్ర.
అయితే చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడూ కూడా బ్యాట్స్ మెన్లు పండగ చేసుకుంటారు. ఇక్కడ దాదాపు మూడు సార్లు 260 కంటే ఎక్కువగా స్కోర్లు నమోదయ్యాయి.
బ్యాట్స్ మెన్లు వీరవిహారం చేస్తుంటే బౌలర్లు చేష్టలుడిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చిన్న బౌండరీలు, మంచి క్విక్ అవుట్ ఫీల్డ్ బౌలర్ల కష్టాలను మరింత పెంచే అవకాశం ఉంది.
అయితే ఆర్సీబీకి జోష్ హజీల్ ఉడ్, భువనేశ్వర్ కుమార్ వంటి మంచి ఎకానమీ కలిగిన బౌలర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్ లో జోష్ కేవలం 5.37 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఆ మ్యాచ్ లో 6.6 ఎకానమీతో మాత్రమే పరుగులు ఇచ్చాడు.
గుజరాత్ ఒపెనర్లు..
గుజరాత్ లో మంచి సమర్థవంతైమన ఓపెనర్లు ఉన్నారు. గిల్ తో పాటు సాయి సుదర్శన్ ఇప్పటికే జట్టుకు మంచి శుభారంభాలు ఇస్తున్నారు. వీరు ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది.
తరువాత ఆర్డర్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా వంటి బ్యాట్స్ మెన్లు వస్తారు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలిప్స్ ఆడించే అవకాశాలు ఉన్నాయి.
గత సీజన్ లో ఆర్సీబీకి తరఫున బరిలోకి దిగిన రబాడ, సిరాజ్ ప్రస్తుతం జీటీ తరఫున కొత్త బంతిని పంచుకుంటున్నారు. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా ఉన్న ఆర్సీబీ దూకుడుకు పగ్గాలు వేయాలంటే ఆరంభంలోనే రెండు,మూడు వికెట్లు అవసరం.
ముఖ్యంగా విరాట్- రబాడ మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఇరువురు 14 మ్యాచ్ లలో తలపడగా, 4 సార్లు రబాడ కింగ్ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రబాడ బౌలింగ్ కోహ్లి స్ట్రైక్ రేట్ కూడా 113 గా మాత్రమే ఉంది. గత మ్యాచ్ లో అద్భుత స్పెల్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ కూడా ప్రమాదకారే. ఇక్కడ మంచి బౌన్స్ కూడా ఉంటుంది.
ఆర్సీబీ జట్టులో స్పిన్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాతో పాటు సుయాన్ష్ శర్మ మాత్రమే కాస్త పరుగులను కట్టడి చేయగలరు. అయితే జీటీలో టాల్ బౌలర్ సాయి కిషోర్ తో పాటు రషీద్ ఖాన్ ఉన్నారు.
ఆర్సీబీ ఓపెనర్లు..
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ మంచి వేగంతో పరుగులు రాబడుతున్నారు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా బ్యాటింగ్ లో రాణిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నారు. అలాగే దేవదత్ పడిక్కల్ వంటి మంచి నాణ్యమైన బ్యాట్స్ మెన్లు ఉన్నారు. మ్యాచ్ ఫినిషర్ గా లియామ్ లివింగ్ స్టన్, రోమారియో షెపర్డ్ జాకబ్ బెథెల్ వంటి విదేశీ బ్యాట్స్ మెన్లు ఉన్నారు.