పంజాబ్‌ జట్టుపై ప్రీతి జింతా కోర్టుకు ఎందుకెళ్లిందీ?

మాజీ ప్రియుడిపై కోపంతోనే ప్రీతి జింతా కోర్టుకు వెళ్లారా?;

Update: 2025-05-23 10:35 GMT
ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యంలో ఊహించని వివాదం చెలరేగింది. బాలీవుడ్‌ నటి, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా తన సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్ , నెస్ వాడియాపై చండీగఢ్‌ కోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్న -కేపీహెచ్‌ డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ- కు చెందిందే పంజాబ్‌ కింగ్స్‌ జట్టు. వాస్తవానికి ఈ జట్టు యజమానిగా ప్రతీ జింతానే చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత కొందరు వచ్చారు. వారిలో నెస్ వాడియా కూడా ఉన్నారు. ఆయనతో ప్రీతి జింతా కొంతకాలం డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏప్రిల్‌ 21 సమావేశం చట్టబద్ధతపై సవాలు...
ప్రీతి జింతా ఫిర్యాదు ప్రకారం, గత నెల ఏప్రిల్‌ 21న సర్వసభ్య సమావేశం (EGM) జరిగింది. అయితే అది నిబంధనలకు విరుద్ధంగా జరగిందని ఆమె ఆరోపించారు. కంపెనీ చట్టం–2013, సెక్రటేరియల్ నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అవసరమైన నిబంధనలను పాటించకుండా ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు.
ఈ సమావేశానికి సంబంధించి ఏప్రిల్‌ 10న ఆమె ఈ-మెయిల్ ద్వారా అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా, నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బుర్మాన్ చట్టవిరుద్ధంగా ఈ సమావేశాన్ని నిర్వహించారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. దీనివల్ల ఆమెకున్న డైరెక్టర్‌ హోదా హక్కులు కాలరాస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఖన్నా నియామకమే వివాదం
ఈ సమావేశంలో మునీశ్‌ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా నియమించడం వివాదంగా మారింది. ప్రీతి జింతా, మరో డైరెక్టర్ కరణ్ పాల్ ఈ నియామకాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు.

అంతేకాక, ఆ సమావేశంలో తీసుకున్న ఏ నిర్ణయమూ అమలుచేయకుండా ఆదేశించాలని, మునీశ్ ఖన్నా డైరెక్టర్‌గా వ్యవహరించకుండా నిషేధించాలని కోరారు. ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు తాను, కరణ్ పాల్ లేకుండా బోర్డు లేదా సర్వసభ్య సమావేశాలు జరగకూడదని కోర్టును కోరారు. బోర్డు స్థాయిలో తీవ్ర అభిప్రాయ భేదాలు నెలకొన్నా, ప్రీతి జింతా బహిరంగంగా మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టుకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. స్టేడియంలో ప్రత్యక్షంగా హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు.
ఇక ఆటపరంగా చూస్తే, శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. 2014 తర్వాత తొలిసారిగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే 12 మ్యాచ్‌లలో 17 పాయింట్లు సంపాదించిన ఈ జట్టు, టాప్-2లో స్థానం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 26న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది.
Tags:    

Similar News