అంపైర్ నుంచి థర్డ్ అంపైర్ దాకా....
అంపైర్ నిర్ణయమే ఫైనల్ అనే దగ్గర నుంచి ఆయన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే స్టేజ్ వరకు క్రికెట్ జర్నీ.. ఎన్ని మార్పులొచ్చాయో..;
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో అయితే అది ఒక మతం కింద మారింది. గత 50 సంవత్సరాల కాలంలో క్రికెట్లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆటగాళ్లు మాత్రం ఇంతవరకు 22 గజాల పిచ్ మీద 11 మందే( ఒక extra ప్లేయర్ అదనం) ఆడుతున్నారు. అదొక్కటి మారలేదు. ఒకప్పుడు క్రికెట్ అంటే టెస్ట్ క్రికెట్. ఐదు రోజులపాటు జరిగే ఆ క్రికెట్ మ్యాచ్ ని రేడియోలో చూడడం, అప్పుడప్పుడు సినిమా థియేటర్లో ట్రైలర్ రూపంలో చూడడం జరిగేది. వీడియోలో వ్యాఖ్యానం వినడం భలే సరదాగా ఉండేది. బ్యాట్స్మెన్ బోల్డ్ అవుట్ అయినా, ఫీల్డ్ క్యాచ్ పట్టినా శ్రోతలు రేడియోలో వ్యాఖ్యాత చెప్తుంటే ఊహించుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. 40 ఏళ్ల క్రితం టీవీలో క్రికెట్ ప్రసారం మొదలైంది. 40 సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష ప్రసారంలో పెను మార్పులు జరిగాయి. ఇప్పుడు ఫీల్డర్ ఒక క్యాచ్ పడితే 7, 8 యాంగిల్స్ లో ఆ క్యాచ్ ను మనం చూడవచ్చు. ఆట ప్రత్యక్ష ప్రసారంలో ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. పెద్దపెద్ద టీవీల్లో వీక్షకులు మ్యాచ్ చూడవచ్చు, మైదానంలో ప్రేక్షకులతో పాటు, ఆటను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు సంవత్సరం అంతా క్రికెట్ టీవీలో వస్తూనే ఉంటుంది. టెస్ట్ క్రికెట్,వన్డే క్రికెట్ గా మారి, చివరకు టి20 అయ్యి ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ఫీల్డర్ పట్టే క్యాచ్ ను రకరకాల యాంగిల్స్ లో చూడవచ్చు. అలాగే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కూడా వివిధ కోణాల్లో చూడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సాంకేతికత ద్వారా మైదానంలో మనం ప్రత్యక్ష ప్రసారం చూడకపోయినా, మైదానం లోనే ఉన్న ఫీలింగ్ ఇప్పుడు సాంకేతికత ద్వారా మనకు కలుగుతుంది.
దూరదర్శన్ నుంచి చరవాణి దాకా
తెల్లని దుస్తులతో ఆడే క్రికెట్, రంగుల మయమైపోయింది. మొత్తం మీద క్రికెట్ ఒక తరం నుంచి, ఇంకో తరానికి మారిపోయింది. కోచ్ లు కంప్యూటర్ ద్వారా ఆటను విశ్లేషించి వ్యూహాలు పన్నే పరిస్థితి ఉంది. ప్రతి బంతి ని ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్లను ఆరేడు కోణాల్లో ప్రేక్షకులు చూసి మురిసిపోతున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చరవాణి ఇంకా ముందుకు తీసుకెళ్ళింది. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రేక్షకుడు మొబైల్ లో క్రికెట్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ సమయం లేక చూడకపోయినా, హైలెట్స్ రూపంలో ఎప్పుడైనా పదేపదే చూసుకోవచ్చు. క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు రేడియో నుంచి.. దూరదర్శన్ కు, దూరదర్శన్ నుంచి చరవాణి కి వచ్చేసింది. అంటే క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం చెవి నుంచి కంటికి, కంటి నుంచి చేతికి వచ్చేసింది. ఇప్పుడు అరచేతిలో క్రికెట్ అనవచ్చు.
ఇక టెస్ట్ క్రికెట్, వన్డేగా మారి, చివరికి టి20 అయిపోయింది. ప్రతినిత్యం క్రికెట్ ఏదో ఒక టోర్నమెంట్ రూపంలో టీవీల్లో ఎక్కడో ఓ చోట వస్తూనే ఉంది. టీవీలో ఏదో ఒక ఛానల్లో, ఏదో ఒక దేశంలో జరిగే క్రికెట్ ను ఇప్పుడు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది.
ఇక ఆట నిబంధనలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కేవలం ఇద్దరు అంపైర్లు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు మూడో కన్నుగా ప్రసిద్ధి చెందిన థర్డ్ ఎంపైర్ వచ్చాడు.
ఒకప్పుడు రన్ అవుట్ అయితే, అంపైర్ నిర్ణయమే ఫైనల్. కానీ ఇప్పుడు అంపైర్ కూడా థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవచ్చు. తద్వారా అంపైర్ల రన్ అవుట్ నిర్ణయం లో కచ్చితత్వం వచ్చింది. ఫీల్డర్ క్యాచ్ పట్టినప్పుడు, సరిగ్గా పట్టుకున్నాడా లేదా అనేది కూడా థర్డ్ అంపైర్ ద్వారా తెలుసుకోవచ్చు.
స్నికోమీటర్(snikOmeter) మాయాజాలం
ఒకప్పుడు వికెట్ కీపర్ వికెట్ల వెనకాల క్యాచ్ పట్టినప్పుడు, లేదా ప్యాడ్ కు తగిలి ఎల్ బి డబ్ల్యు ఇచ్చినప్పుడు ఎంపైర్ నిర్ణయం ఫైనల్. ఇప్పుడు థర్డ్ ఎంపైర్ స్నికోమీటర్(snikOmeter) అనే పరికరం ద్వారా బంతి బ్యాట్స్మెన్ బ్యాట్ కు గాని, బ్యాట్స్మెన్ గ్లోవ్స్ కు కానీ తగిలిందా లేదా అని తేల్చవచ్చు.
డేగ కన్ను
అలాగే ఎల్ బి డబ్ల్యు ఇచ్చినప్పుడు, Hawk-Eye(డేగ కన్ను) అనే సాంకేతిక పద్ధతి ద్వారా వికెట్లకు తగిలే అవకాశం ఉందా? ( ultra edge) ద్వారా బంతి ప్యాడ్ కి తగిలే ముందు బ్యాట్ కి తగిలిందా, hotspot అనే సాంకేతిక పద్ధతి ద్వారా బంతి బ్యాట్స్మెన్ ప్యాడ్ కు కచ్చితంగా ఎక్కడ తగిలిందన్నది నిర్ధారించుకోవచ్చు.
నిర్ణయ పునః సమీక్ష పద్ధతి (DRS)
గతంలో అంపైర్ చూపుడు వేలిని ఎత్తితే అదే తుది నిర్ణయం. ఆటగాడు మైదానం వీడాల్సిందే.
ఇప్పుడు ఎంపైర్ అవుట్ ఇచ్చినప్పటికీ, ఆటగాడు నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (DRS) ద్వారా మళ్ళీ ఆ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు. అప్పుడు థర్డ్ అంపైర్ నిర్ణయం అన్నది ఫైనల్. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మైదానంలో అంపైర్లు ఇచ్చే నిర్ణయాలు కచ్చితత్వాన్ని సంచరించుకున్నాయి. ఆటలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, గతంలో అంపైర్లు ఇచ్చే నిర్ణయాలలో ఉన్న తప్పులను, ఇది సవరిస్తుంది.
క్రికెట్ లో కంప్యూటర్లు..
ఒకప్పుడు ఒక కోచ్ ఉండేవాడు. పెద్దగా సాంకేతికత సాయం తీసుకునేవాడు కాదు. ఇప్పుడు కోచ్ కు సహాయంగా ఐదారు మంది ఉంటున్నారు. ఫిట్ నెస్ కు సంబంధించి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ఇప్పుడు కంప్యూటర్లు కూడా క్రికెట్లో ఒక పాత్ర వహిస్తున్నాయి. మ్యాచ్ జరిగిన తర్వాత దాన్ని విశ్లేషించి, ఆటగాళ్లకు వివరించే విధానం ఉంది. వాళ్ళు చేసిన తప్పులే కాకుండా, ప్రత్యక్ష జట్టు చేసిన తప్పులు, వారి బలహీనతలు బలాలు ఇప్పుడు సూక్ష్మ స్థాయిలో ఇరుజట్ల ఆటగాళ్లకు తెలిసిపోతున్నాయి. దాని ద్వారా మ్యాచ్ కు ముందు, వ్యూహాలు పన్నే అవకాశాన్ని ఇరుజట్ల కోచ్ లు ఉపయోగించుకుంటున్నారు.
ఈ కంప్యూటర్ యుగంలో, ప్రతిదీ వేగవంతం అవుతుంది కంప్యూటర్ మయం అవుతుంది. క్రికెట్ కూడా దీనికి మినహాయింపు కాదు. మొత్తం మీద క్రికెట్ పాత తరం నుంచి కొత్త తరానికి అనువుగా రూపాంతరం (Metamorphosis) చెందిందని చెప్పవచ్చు.
కోసమెరుపు:
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న దృష్ట్యా, త్వరలో రోబోలు (కోడి పందేల లాగా) రెండు జట్లుగా క్రికెట్ ఆడే అవకాశం ఎంతో దూరం లేదు.