మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి

ఇండియన్ క్రికెట్ మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ చనిపోయారు. బెంగళూరులో తాను ఉంటున్న నాల్గవ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి మరణించారు.

Update: 2024-06-20 11:12 GMT

ఇండియన్ క్రికెట్ మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ చనిపోయారు. బెంగళూరులో తాను ఉంటున్న నాల్గవ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి మరణించారు. 52 సంవత్సరాల జాన్సన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

తన ఇంటికి సమీపంలో క్రికెట్ అకాడమీ నడుపుతున్న జాన్సన్‌కు ఇటీవల ఆరోగ్యం సరిగా లేదని సమాచారం.

"డేవిడ్ జాన్సన్ తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నుంచిపడిపోయాడని మాకు సమాచారం అందింది. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించాం. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు" అని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) అధికారి చెప్పారు.

గతంలో రెండు టెస్టులు, 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్.. అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, దొడ్డ గణేష్‌ ఉన్న కర్ణాటక బౌలింగ్ బృందంలో సభ్యుడు.

డేవిడ్ జాన్సన్‌తో ఉన్న అనుబంధాన్నిగణేష్ గుర్తుచేసుకున్నారు. "జై కర్ణాటక క్లబ్ కోసం డేవిడ్‌తో కలిసి ఆడా. తర్వాత రాష్ట్రం, దేశం తరుపున కలిసి ఆడాం. జాన్సన్ మరణం షాకింగ్ న్యూస్" అని జాన్సన్ చిరకాల మిత్రుడు, ఇండియన్ క్రికెట్ పేసర్ గణేష్ చెప్పారు.

లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన సహచరుడు డేవిడ్‌ మృతికి సంతాపం తెలిపారు. "నా క్రికెట్ సహచరుడు డేవిడ్ జాన్సన్ మరణవార్త విని కలిచివేసింది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’’అని కుంబ్లే ఎక్స్‌లో పోస్టు చేశారు.

బీసీసీఐ సెక్రటరీ జే షా కూడా డేవిడ్ కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

"మా మాజీ భారత ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి. ఆటకు ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని షా ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News