పడి, లేచి గెలిచిన భారత్.. సిరీస్ కైవసం

భారత చివరికి 15 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1 తేడాతో సీరిస్ ను కూడా గెలుచుకుంది;

Update: 2025-02-01 02:27 GMT


భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా ఈరోజు(31.01.25) పూణేలో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో భారత్ పడి, లేచి గెలిచింది.ఒక దశలో నువ్వా నేనా అంటూ నడిచిన మ్యాచ్ లో భారత చివరికి 15 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1 తేడాతో సీరిస్ ను కూడా గెలుచుకుంది
త్వర త్వరగా పడిన వికెట్లు
ఈ సిరీస్ లో మొదటిసారి టాస్ గెలిచిన బట్లర్ భారత్ కు బ్యాటింగ్ ఇచ్చాడు.ఆర్చర్ వేసిన మొదటి ఓవర్ లో 12 పరుగులు చేసిన భారత్ మ్యాచ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చిందనుకుంటే రెండో ఓవర్లో సంజు సాంసన్,తిలక్ వర్మ ల వికెట్లు తీసి భారత్ కు ఒక పెద్ద ప్రమాదాన్ని సృష్టించాడు ఇంగ్లాండ్ బౌలర్ మహమ్మద్,. రెండో మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో భారత్ ను గెలిపించిన తిలక్ వర్మ మూడు , నాలుగవ మ్యాచ్ లలో విఫలమయ్యాడు మొదటి మ్యాచ్ లో బాగా ఆడిన అభిషేక్ శర్మ , ఈ సిరీస్ లో మొదటిసారి బ్యాటింగ్ కు వచ్చిన రింకు సింగ్ తో కలిసి కొంత చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
అలా ఇద్దరు కలిసి ఏడు ఓవర్లు ముగిసే సమయానికి 50 పరుగులు చేశారు. అంతలో స్పిన్నర్ ఆదిల్ రషీద్ అభిషేక్ శర్మ ను అవుట్ చేసి భారత జట్టును మరింత ఇబ్బందులకు గురి చేసాడు. ఈ సీరిస్ లో మొదటిసారి ఆడుతున్న శివం దూబె ఒక భారీ సిక్స్ తో బ్యాటింగ్ ను మొదలు పెట్టాడు. నాలుగు వికెట్లు కోల్పోయినప్పటి భారత్ బ్యాటింగ్ ముందుకే వెళ్ళింది. ఓవర్ కి ఏడు పరుగుల రన్ రేట్ తో స్కోర్ ముందుకు కదిలింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
రాణించిన రింకు సింగ్- ఆదుకున్న శివం దుబాయ్
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ రింకు సింగ్ నేతృత్వంలో భారత బ్యాటింగ్ ఒక మర్యాదపూర్వకమైన స్కోర్ వైపు, నిదానంగా అయినా సరే, కదిలింది. ఇప్పుడు భారత జట్టు రింకు సింగ్ పైన ఆధారపడింది.
రింకు సింగ్ 30 పరుగుల వద్ద తన వికెట్ ను ఒక అనవసరమైన షాట్ ఆడ బోయి ఇంగ్లాండ్ బౌలర్ కార్సె కు వికెట్ సమర్పించుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి సగం భారత జట్టు పెవిలియన్ లో ఉంది. హార్దిక్ పాండ్యా, శివం దూబె ల మీద భారం పడింది. వరుసగా రెండు ఫోర్లు కొట్టి హార్దిక్ పాండ్యా భారత్ జట్టులో ఉత్సాహం నింపాడు. శివం దూబె తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఆదిల్ వేసిన ఒక ఓవర్లో ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టి స్కోరును ముందుకు పంపించాడు. 14 ఓవర్ల తర్వాత భారత జట్టు 110 పరుగులు చేసింది.
మూడు మ్యాచ్ ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కొంచెం మెరుగ్గా కనిపించింది. భారత జట్టు బ్యాట్స్మెన్లను కొంతవరకు అదుపులో ఉంచింది. మహమూద్ బౌలింగ్ లో హార్థిక్ పాండ్యా ఒక సిక్స్ కొట్టి కొంత వేగం పెంచే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ కు కొంత అనుకూలమైన పిచ్ పైన భారత జట్టు కొంత తడబడినట్లు అనిపించింది. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సిరీస్ లో మొదటిసారి ఆడుతున్న రింకు సింగ్, శివం దుబే కొంతవరకు చక్కని బ్యాటింగ్ చేయడం. 16 ఓవర్లో హార్దిక్ పాండ్యా కొంత దూకుడు పెంచాడు. అతనికి పోటీగా శివం కూడా కొంత వేగం పెంచి స్కోరును పరిగెత్తించాడు. ఈ క్రమంలో రన్ రేట్ పెరిగింది.
18వ ఒవర్ లో హార్దిక్ పాండ్యా దూకుడు వల్ల స్కోరు పరిగెత్తింది, హార్దిక్ స్కోరు కూడా 50 పరుగులకు చేరింది. స్కోరు 180 పరుగులు దాటే అవకాశం కనిపించింది. అదే ఓవర్లో శివం కూడా ఒక సిక్స్ కొట్టి స్కోర్ కు వేగాన్ని ఇచ్చాడు. చివరకు 53 పరుగులు చేసి పాండ్యా అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే భారత్ కు ఒక మంచి స్కోర్ ను ఇచ్చి వెళ్ళాడు.
19 ఓవర్లో దుబే రెండు ఫోన్లు వరుసగా కొట్టి, తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 50 వ ఓవర్లో అక్షర పటేల్ అవుట్ అయ్యాడు. మొదట్లో తడబడి, తర్వాత పుంజుకొని, మళ్లీ తడబడి తర్వాత వేగాన్ని పెంచి గెలవదగ్గ 181 పరుగుల స్కోరుని భారత జట్టు చేయడం విశేషం. ఈ సిరీస్ లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు.
182 పరుగుల(9.10 రన్ రేట్) లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండు స్కోరు పరుగులు పెట్టింది. ఇంగ్లాండ్ జట్టు మొదటి ఓవర్ లో అర్ష దీప్ బౌలింగ్లో సాల్ట్ ఒకటి రెండు బౌండరీలతో లక్ష్యసాధనను మొదలుపెట్టింది. షమీ బదులుగా ఈ మ్యాచ్ లో ఆడుతున్న అర్ష దీప్ ఇంతకుముందు రెండు మ్యాచ్ లలో మొదటి ఓవర్ లోనే వికెట్ సాధించి ఈసారి అలా చేయలేకపోయాడు. తాను వేసినా మొదటి రెండు ఓవర్లలో ఐదు బౌండరీలు ఇచ్చాడు. దాంతో ఇంగ్లాండ్ స్కోరు మొదటి రెండు ఓవర్లలోనే 28 పరుగులు అయింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. భారత బౌలింగ్ లో అంత పదును కనపడలేదు. ఓపనర్లు ఇద్దరూ చాలా సులభంగా బౌండరీలతో స్కోర్ ను ముందుకు నడిపారు. ఇంతవరకు ప్రతి ఓవర్ కు కనీసం ఒక బౌండరీ సాధించారు. లక్ష్యాన్ని సులభంగా సాధించగలిగే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఐదో ఓవర్ లోనే 50 పరుగులు సాధించారు.
వారి ధాటికి తొందరగానే స్పిన్నర్లను బౌలింగ్ కి దింపాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. అయినప్పటికీ పెద్దగా ఉపయోగం కనబడలేదు. పవర్ ప్లే లో భారత బౌలర్లతో ఆడుకున్నారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్.పవర్ ప్లే లోని ఆరు ఓవర్లలో 62 పరుగులు సాధించారు. అయితే ఆరవ ఓవర్ చివరి బంతి తో డకెట్(30 పరుగులు) వికెట్ సాధించి బిష్నొయ్ ఇంగ్లాండ్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు.
గెలిపించిన స్పిన్నర్లు- యువ బౌలర్ హర్షిత్
భారత ప్రేక్షకులకు కనువిందు చేస్తూ, మెలికలు తిరిగే ఒక బంతితో అక్షర పటేల్ సాల్ట్ వికెట్ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ కూడా రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. మరొకసారి స్పిన్ బౌలింగ్ కాగల కార్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ దూకుడు కొంత తగ్గింది . అంతలోనే , భారత బౌలర్ల వలలో బట్లర్ అనబడే అతి పెద్ద చేప పడింది. చక్కగా బౌలింగ్ చేస్తున్న రవి బిష్నొయ్ దానికి కారణం. ప్రేక్షకుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సహజంగానే మూడు వికెట్లు ఒకదాని వెంట ఒకటి పడటం వల్ల ఇంగ్లాండ్ స్కోర్ వేగం తగ్గిపోయింది. భారత్ మళ్లీ పుంజుకుంది
పది ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అదే భారత్ పది ఓవర్లలో 72 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ బ్రూక్ కొంచెం దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. అయితే అంతలో ఇంగ్లాండ్ కు మరో దెబ్బ తగిలింది యువ బౌలర్ హర్షిత్ రానా మొదటిసారి బోలింగ్ చేస్తూ రెండవ బంతికి లివింగ్ స్టోన్ వికెట్ ని తీసుకున్నాడు. ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 48( 8 ఓవర్లు) బంతుల్లో 83 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేదించాల్సిన పరిస్థితిలో ఇంగ్లాండ్ పడిపోయింది.
ఇంగ్లాండ్ దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి
అంతలో హర్షిత్ బౌలింగ్ లో రెండు సిక్స్ లు ఒక బౌండరీ సాధించి ఇంగ్లాండ్ జట్టులో ఆశలు పెంచాడు. ఈ దశలో రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్లు అనిపించింది. అప్పుడే ఒక చక్కటి బౌండరీ తో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు బ్రూక్. కానీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఒక చెత్త స్కూపు షాట్ ఆడి వికెట్ పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తికి ఇది మొదటి వికెట్. వెంటనే కార్ సే రూపంలో మరో వికెట్ తీసుకున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇంగ్లాండ్ ఇప్పుడు గెలిచే స్థితి నుంచి ఓడిపోయి స్థితికి వచ్చింది. మొదట్లో బాగా ఆడి పటిష్టమైన స్థితిలో కనిపించిన ఇంగ్లాండ్ జట్టు త్వర త్వరగా ఆరు వికెట్లు పోగొట్టుకొని ఓటమికి దగ్గరగా వెళ్ళిపోయింది. ఈ సమయంలో హర్షిత్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ తో ఇంగ్లాండు చివరి ఆశ బ్యాట్స్మెన్ బెతెల్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ దాదాపు ఓటమికి దగ్గరగా వచ్చేసింది. భారత బ్యాటింగ్ లాగే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా నువ్వా నేనా అన్నట్లు నడిచినప్పటికీ, లక్ష్యసాధనలో ఇంగ్లాండ్ కొంచెం తడబడింది. అప్పుడు ఒక గుగ్లితో మంచి హిట్టరైన ఆర్చర్ వికెట్ ను రవి సాధించడంతో ఇంగ్లాండు ఢీలా పడిపోయింది. ఇక 18 బంతుల్లో 36 పరుగులు సాధించాల్సిన పరిస్థితిలో ఇంగ్లాండ్ ఉంది. కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉండడం, పైగా వాళ్లు బ్యాట్స్మెన్లు కూడా కాకపోవడం వల్ల ఇంగ్లాండు ఓడిపోవడం ఖాయం అయింది. 15 బంతు ల వ్యవధిలో ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. అది ఇంగ్లాండును కోలుకోలేని దెబ్బతీసింది. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు చేయవలసిన పరిస్థితి. 11 బంతుల్లో 21 పరుగులు చేయాలి. ఈ స్థితిలో కొంత ఉత్కంఠత నెలకొంది. ఇంగ్లాండ్ ఆశలన్నీ జోవర్టెన్ మీద ఉన్నాయి. ఈ దశలో వికెట్ కీపర్ శాంసన్ జోవర్టన్ కొట్టిన బంతిని పట్టుకోలేకపోయాడు. మ్యాచ్లో మరింత ఉత్కంఠ. హర్షిత్ మూడో వికెట్ రూపంలో జోవర్టన్ ను క్లీన్ బోల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ పోరాటం ముగిసినట్లే అనిపించింది. ఆరు బంతుల్లో 19 పరుగులు. భారత్ ఒక్క వికెట్ తీసుకుంటే చాలు. మ్యాచ్ చివరికి నాలుగు బంతుల్లో 17 పరుగులకు వచ్చేసింది. ప్రేక్షకుల్లో కొంత ఉత్కంఠ. అయితే మూడు బంతుల్లో 17 పరుగులు చాలా కష్టం. అంతలో చివరి వికెట్( మహమూద్) పడిపోయింది. భారత జట్టు 15 పరుగుల తేడాతో మ్యాచ్ ను, 3-1 తేడాతో సిరీస్ ను కూడా గెలిచింది.

భారత్ బ్యాటింగ్:
181 పరుగులు/ 9 వికెట్లు (20 ఓవర్లు)
అభిషేక్ శర్మ 29 పరుగులు (19 బంతులు)
హార్దిక్ పాండ్యా 53 పరుగులు (30 బంతులు)
రింకు సింగ్ 30 పరుగులు (26 బంతులు)
శివం దూబె 34 పరుగులు (53 బంతులు)

ఇంగ్లాండ్ బౌలింగ్:
మహ్మూద్ 3 వికెట్లు (4 ఓవర్లు)
ఆదిల్ రషిద్ 1 వికెట్ (4 ఓవర్లు)
బ్రైడన్ కార్సె 1 వికెట్ (4 ఓవర్లు)
జేమి ఒవెర్టన్ 2 వికెట్లు (4 ఓవర్లు)

ఇంగ్లాండ్ బ్యాటింగ్:
============
166 పరుగులు/09 వికెట్లు (19.4 ఓవర్లు)
సాల్ట్ 23 పరుగులు (21 బంతులు)
బెన్ డక్కెట్ 39 పరుగులు (19 బంతులు)
బ్రూక్ 51 పరుగులు (26 బంతులు)
ఒవర్టన్ 19 పరుగులు (15 బంతులు)

భారత్ బౌలింగ్:
అర్షదీప్ 1 వికెట్ (3.4 ఓవర్లు)
వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు (4 ఓవర్లు)
అక్సర్ పటేల్ 1 వికెట్ (3 ఓవర్లు)
బిష్నోయ్ 3 వికెట్లు (4 ఓవర్లు)
హర్షిత్ రాణ 3 వికెట్లు (4 ఓవర్లు)


Tags:    

Similar News