అబిదాలీతో ఆ మూడు రోజులు మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు

భారత క్రికెట్ పాత తరం ఆటగాడు అబిదాలీ గురించి సలీంబాష గారి విశ్లేషణ;

Update: 2025-03-13 11:13 GMT

2000 సంవత్సరంలో కర్నూల్లో ఆంధ్ర, హైదరాబాద్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరిగింది. అది కర్నూలు క్రీడాభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. . అంతకన్నా ఎక్కువ కర్నూలు వారు గుర్తుపెట్టుకునేది ఒకటి ఉంది. అదే భారత క్రికెట్ పాత తరం ఆటగాడు, అబిదాలీ (కామెంటేటర్ల తో అందరూ సహా అలాగే పిలుస్తారు) అని పిలువబడే సయ్యద్ అబిద్ అలీ... భారత క్రికెట్ రంగం అంత సులభంగా మర్చిపోలేని పేరు. అలాగే క్రీడాభిమానులు కూడా ఆ ఆ మ్యాచ్ లో ఏం జరిగింది.. ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు అన్నది మర్చిపోవచ్చు. కానీ జట్టుకి కోచ్ గా వచ్చిన అబిదాలీ ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు.. నాతో సహా. మొత్తం మూడు రోజులు, స్టేడియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, విరామ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో, ఆట అయిపోయిన తర్వాత కర్నూల్ లో అప్పటి రవి ప్రకాష్ హోటల్లో (లేదా రాజ్ విహార్ కావచ్చు.. సరిగా గుర్తులేదు) రాత్రిపూట కొన్ని గంటలు నిమిషాలు.. ఆయనతో గడపడం నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు.

అబీదాలి చూడడానికి కొంచెం కరుకుగా కనిపించినప్పటికీ, మనిషి మాత్రం జెంటిల్మెన్. మా అబ్బాయిని ఎత్తుకొని క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూపించాడు. భోజనానికి మా ఇంటికి పిలిస్తే, సున్నితంగా తిరస్కరించాడు. కానీ అతనితో కలిసి భోజనం చేయడం కూడా ఒక మర్చిపోలేని అనుభవం. బుఫే భోజనాల దగ్గర, ఒక ప్లేటులో తనతో పాటు నాకు భోజనం తీసుకొచ్చాడు. అలా ఇద్దరం కలిసి కూర్చొని భోంచేసాం. క్రికెట్ పైన నాకున్న ఇంట్రెస్ట్, నా క్రికెట్ నాలెడ్జ్, రేడియో కామెంట్రీ గురించి నేను చేసిన మిమిక్రీ చాలా ఎంజాయ్ చేశాడు. అప్పట్లో ఫోటోలు కొన్ని తీసాం కానీ ఎవరు తీసారో, అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. అప్పటికి ఇంకా కర్నూల్ లో సెల్ ఫోన్ రాలేదు.

విభిన్నమైన ఆట- విలక్షణ వ్యక్తిత్వం.. సయ్యద్ ఆబిద్ అలీ

వ్యక్తిగానే కాకుండా ఒక క్రికెటర్ గా కూడా ఆబిద్ అలీ ఒక విలక్షణమైన ఆటగాడు. స్పిన్ బౌలింగ్ భారత క్రికెట్ ను ఏలుతున్న కాలంలో, ఫాస్ట్ బౌలింగ్ కి అంతగా ఆదరణ లేని కాలంలో తనదైన శైలిలో బౌలింగ్ చేసి రాణించినవాడు ఆబిద్ అలీ. అప్పట్లో భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు నామమాత్రానికి మాత్రం ఉండేవారు. మొదటి 10 ఓవర్లు బౌలింగ్ చేసి, బాల్ మెరుపును తగ్గించి, స్పిన్నర్లకి అనుకూలంగా బంతిని తయారు చేయడానికి మాత్రమే ఫాస్ట్ బౌలర్లను టీం లోకి తీసుకునేవారు.

మీడియం పేస్ బౌలింగ్ కి గుర్తింపు తెచ్చినవాడు

ఫాస్ట్ బౌలింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత లేకపోయినా, తన బౌలింగ్ తో, ఫీల్డింగ్ తో భారత క్రికెట్లో తనదైన ముద్రను వేసిన వాడు. అప్పట్లో ఆల్రౌండర్లు తక్కువగా ఉండేవారు. ఆ టైంలో ఒక మంచి ఫీల్డర్ గా, బ్యాట్స్మెన్ గా కూడా రాణించినవాడు అబిదాలీ. 1960లో రంజి ట్రాఫీతో మొదలుపెట్టిన అబిదాలీ ఏడు సంవత్సరాల తర్వాత రంజీలో తన మొదటి సెంచరీ చేశాడు 1967లో భారత జట్టు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అనూహ్యంగా అబిదాలీని సెలెక్ట్ చేశారు. మొదటి టెస్టులో కెప్టెన్ పటోడి గాయం వల్ల ఆడ లేకపోయినప్పుడు అబిదాలీని టీం లోకి తీసుకున్నారు ఆ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేశాడు 55 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు అది అప్పట్లో మొదటి టెస్ట్ ఆడుతున్న క్రికెటర్ కి ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన

ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా,ఓపెనింగ్ బౌలర్ గా ప్రతిభ చూపినవాడు

ఓపెనింగ్ కి వెళ్ళిన మూడో టెస్ట్ లో 47 పరుగులు చేసి ఫైనల్ టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 81 పరుగులు రెండు ఇన్నింగ్స్ లో 75 పరుగులు చేసి అలా తన ప్రతిభను క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. భారత విజయం లో కొన్నిసార్లు ప్రత్యక్షంగా మైదానంలో ఉన్నాడు. 1971లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ తో గెలిచిన చారిత్రాత్మక టెస్ట్ లో సునీల్ గవాస్కర్ భారతదేశం గెలవడానికి అవసరమైన పరుగులు చేసినప్పుడు అబిదాలీ నాన్ స్ట్రైకర్ గా ఉన్నాడు అంతే కాకుండా చివరి టెస్టులో వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అబిదాలీ, రోహన్ కన్హాయ్, సోబర్స్ లాంటి దిగ్గజాలను వరుస బంతుల లో అవుట్ చేయడం విశేషం! కొద్ది కాలం తర్వాత ఓవల్లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత విజయానికి కావాల్సిన విన్నింగ్ బౌండరీ సాధించిన బ్యాట్స్మెన్ కూడా ఇతనే. దరిమిలా జరిగిన మాంచెస్టర్ టెస్టులో 19 పరుగులు ఇచ్చి మొదటి నాలుగు వికెట్లు తీసుకున్నవాడు అప్పుడు ఇంగ్లాండ్ 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

మొత్తం 29 టెస్ట్ మ్యాచ్ లాడిన అబిదాలీ ఐదు వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. 1975 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 70 పరుగులు సాధించాడు. ప్రపంచ కప్ తర్వాత అబిదాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఒక నాలుగేళ్ల పాటు ఆడాడు. మొత్తం 2000 పరుగులు పైగా సాధించి 100 వికెట్లు తీసుకొని హైదరాబాద్ రంజీ ట్రోఫీ లో తనదైన ముద్ర వేశాడు రంజీ కెరీర్ లో కేరళతో 1968 లో జరిగిన రంజిత్ రఫీ మ్యాచ్లో అజయంగా 173 పరుగులు చేయడమే కాకుండా చేశాడు. ఓవల్లో సర్రే కు వ్యతిరేకంగా ఆడుతూ 23 పరుగులకు 6 వికెట్లు తీశాడు. అది అతని కెరీర్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన. హైదరాబాద్ జూనియర్ టీమ్ కు కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు. తర్వాత కాలిఫోర్నియాకి వెళ్ళిపోయాడు అంతకు ముందు మాల్దీవ్స్ లో 1990 చివరిలో కోచ్ గా పని చేశాడు మరో విశేషం ఏమిటంటే ఆంధ్ర క్రికెట్ జట్టుకు 2000 సంవత్సరం నుంచి 2002 వరకు కోచ్ గా పని చేశాడు. 2001-2002 సీజన్లో సౌత్ జోన్ రంజీ ట్రోఫీ లీగ్ లో ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాడు. చాలా చోట్ల కోచ్ గా పని చేశాడు. 29 టెస్ట్ లు ఐదు వన్డేలు మొత్తం 212 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు వాటిలో మొత్తం 1018 పరుగులు. వన్డేల్లో 93 పరుగులు చేశాడు. టెస్టులలో 81 టాప్ స్కోరు, వన్డేలో 70 టాప్ స్కోర్ టెస్ట్ లో 47 వికెట్ తీసుకుంటే వన్డేలలో 7 వికెట్ తీసుకున్నాడు. టెస్ట్ లో ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు ఒకసారి తీసుకున్నాడు. టెస్టులలో ఉత్తమ బౌలింగ్ 55 పరుగులకు ఆరు వికెట్లు. వన్డేల్లో ఉత్తమ బౌలింగ్ 22 పరుగులకు రెండు వికెట్లు. టెస్టులలో 32 క్యాచ్ లు కూడా తీసుకొని తన ఫీల్డింగ్ ప్రతిభను చాటి చెప్పాడు.

మైదానంలో విభిన్న క్రికెటర్ గా రాణించి, ప్రపంచం నుంచి నిష్క్రమించినవాడు

తన కెరీర్ లో మైదానంలో, మైదానం బయట ఎటువంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. 1967 నుంచి 75 వరకు 8 సంవత్సరాలపాటు తనదైన శైలిలో బ్యాటింగ్, ఫీల్డింగు తో పాటు చక్కటి బౌలింగ్ కూడా చేసి ఆ తరం క్రికెటర్లలో ఒక మంచి ఆల్రౌండర్ గా నిలబడిపోయి, ఆ తరం క్రీడాభిమానులను అలరించిన ఆబిద్ అలీ 83 ఏళ్ల వయసులో మార్చి 12, 2025 లో ఈ ప్రపంచాన్ని వెళ్ళిపోయాడు

Tags:    

Similar News