ఇక ముందు కుటుంబంతో గడపడం కుదరదు: బీసీసీఐ
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ ల ఘోర ఓటమి నేపథ్యంలో కఠిన నిర్ణయాలు;
By : The Federal
Update: 2025-01-14 07:03 GMT
ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ ల్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్లు వారి భార్య, ఇతర కుటుంబ సభ్యులు తమ వెంట తీసుకెళ్లే స్వేచ్ఛ విషయంలో ఇక ముందు నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐలోని కొన్ని వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
ప్రతి టూర్ లో కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆటగాళ్లు వారితో గడిపే సమయాన్ని పరిమితం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు 2019 లో ఇటువంటి నిబంధనలు ఉండేవి.. వాటిని తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆటగాళ్లు కచ్చితంగా ఆటపై దృష్టి పెట్టే విధంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని, లేకపోతే రెండు సిరీస్ లో ఎదురైన ఘోర పరాజయాలు తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట.
కొత్త నిబంధనల ప్రకారం ఏదైన విదేశీ పర్యటన 45 రోజులకు మించి సాగితేనే భార్య, కుటుంబ సభ్యులతో ప్లేయర్లతో 14 రోజులు ఉండే వెసులుబాటును కలిగించాలని, చిన్న పర్యటనల్లో కేవలం 7 రోజులు మాత్రమే కుటుంబంతో గడిపే అవకాశం ఇవ్వాలని నిబంధనలు విధించబోతున్నారు. అలాగే ప్రతి ఆటగాడు కూడా విధిగా ఆటగాళ్లలందరితో కలిసి బస్సులోనే ప్రయాణించాలని బోర్డు నిబంధనలు విధించనుంది.
గంభీర్ మేనేజర్ కూడా..
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గంభీర్ మేనేజర్ అయిన గౌరవ్ అరోరాను టీమ్ తో పాటు రావడానికి, ఆటగాళ్లతో పాటు ఒకే హోటల్ లో బస చేయడానికి కూడా అనుమతించరాదని బోర్డు ఆదేశించింది. అలాగే బస్సులో కూడా గంభీర్ తో పాటు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
సహాయక సిబ్బంది
సహాయక సిబ్బంది కూడా ఎక్కువ కాలం పాటు జట్టుతోనే కొనసాగడం కూడా ఆటగాళ్ల పనితీరు దెబ్బతినడానికి మరోకారణంగా భావిస్తున్నారు. కొత్తరకం ఆలోచనలు, యువతరాన్ని తీసుకురావడానికి టీమ్ లో వారి పదవీ కాలాన్ని ఇకనుంచి మూడేళ్లకే పరమితం చేయాలని కూడా సూచించారు.
కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లి ఆటతీరుపై కూడా బీసీసీఐ పెద్దలు చాలా చర్చించారని, వరసుగా టెస్టుల్లో విఫలం కావడంతో వారి భవిష్యత్ ఏంటనే విషయంలో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారో మాత్రం బయటకు వెల్లడించలేదు.
అలాగే ఇక నుంచి విమానాశ్రాయాల్లో కేవలం 150 కేజీల వరకూ మాత్రమే బీసీసీఐ చెల్లిస్తుందని, అంతకుమించితే ఆటగాళ్లే చెల్లించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.