ఈ రోజు దిలీప్ కుమార్ 101 వ జయంతి, కొన్ని జ్ఞాపకాలు
ట్రాజెడీ కింగ్ గా పేరున్న దిలీప్ కుమార్ అసలు పేరేమిటి? ఆయనకు దిలీప్ కుమార్ అని పేరు పెట్టిందెవరు?
(సలీమ్ బాషా/జింకా నాగరాజు)
“ట్రాజెడీ కింగ్” దిలీప్ కుమార్(98) చివరికి నిజంగానే మనల్ని వదిలేసి వెళ్లిపోయి రెండేళ్లయింది. ఈ రోజు ఆయన 101వ జయంతి. ఆయన 1922 డిసెంబర్ 11 నేటి పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించారు. తండ్రి పళ్ల వ్యాపారి. ఆయనకు మహారాష్ట్రంలోని పళ్లతోటలుండేవి. అందుకు పాఠశాల విద్య అక్కడే మొదలయింది. నాసిక్, డియోలాలి లోని బార్నెస్ స్కూల్ లో ఆయన చదువుకున్నారు. అందుకే చక్కగా మరాఠీ కూడా మాట్లాడతారు. తన కొడుకు సినిమాలలో నటించడం ఆయన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదుట. రాజ్ కపూర్ కుటుంబం కూడా పెషావర్ లో దిలీప్ ఉంటున్న ఏరియాలోనే ఉండిందట. దివాన్ బషీశ్వర్ నాథ్ కపూర్ మనవడు (రాజకపూర్) సినిమా ల్లో నటించడమేమిటని ఆయన విచారించేవాడట.
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. ఆయన సొంత పేరుతో ఎపుడూ నటించలేదు. నాటకాలాడుతున్నపుడు ఆయన దిలీప్ కుమార్. నిజానికి ఆయనకు ఈ పేరు సూచించింది జ్వర్ బాట (1944) ప్రొడ్యూసర్ దేవికా రాణి అని ఆయన ఆటోబయాగ్రఫీ “దిలీప్ కుమార్: ది సబ్ స్టాన్స్ అండ్ షాడో” లో రాసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీ లో ఆయన దిలీప్ సాబ్. క్రికెట్ డాన్ బ్రాడ్ మన్ ఎలాగో హిందీ సినిమా కి దిలీప్ కుమార్ అలాగ.
కొన్ని సంవత్సరాలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడు దిలీప్ సాబ్ తన పాత్రను 2021 జూలై 7న ముగించేశాడు. దిలీప్ కుమార్ నిజానికి ఒక మంచి ఫుట్ బాల్ ఆటగాడు కావాలనుకున్నాడు. అయితే, ఆయనని కాలం సినిమాల్లోకి మళ్లించి మెగా స్టార్ ను చేసింది.
1944 లొ వచ్చిన జ్వర్ బాట అని తొలిసినిమా. అది ఫెయిలయింది.
తర్వాత నూర్ జెహాన్ తో కలసి 1947లో నటించిన జుగ్ను ఆయన్న నిలబెట్టింది. 1949లో లో రాజ్ కపూర్, నర్గిష్ లతో కలసి నటించిన అందాజ్ ఆయన సినిమా జీవితంలో కొత్తమలుపు. ఆయన చివరి చిత్రం ఖిలా (1998).
మొఘల్- ఎ- ఆజం సినిమాలో తండ్రితో దిలీప్ కుమార్ చెప్పిన డైలాగ్
” నా మనసు నీ హిందుస్థాన్ రాజ్యం కాదు, నువ్వు దాన్ని ఏలడానికి” (Mera dil bhi aapka koi Hindustan nahi, jispar aap hukumat karein) చెరిగిపోని శిలాక్షరాలు.“
హిందీ చిత్ర సీమలో దిలీప్ కుమార్ ఒక శకం.
అయితే 60 ఏళ్ల తన సినీ కెరీర్ లో కేవలం 60కి పైగా సినిమాలు మాత్రమే చేశాడు. అయినా సినిమాలను రెండురకాలుగా చెప్పుకోవచ్చు. దిలీప్ కుమార్ మాత్రమే చేయగలడు, దిలీప్ కుమార్ అంటే ఏమనుకున్నారు అనేవి ఈ రెండు రకాలు. దిలీప్ కుమార్ 98 ఏళ్ళ వయసులో తన సుదీర్ఘ సినిమా, జీవిత ప్రస్థానాన్ని ముంబైలో ముగించాడు.
మధుమతి, నయా దౌర్, ఆద్మీ, గంగా జమున,దేవదాస్ వంటివి దిలీప్ కుమార్ మాత్రమే చేయగలిగిన సినిమాలు ఇక మొఘల్ ఎ ఆజం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొఘల్- ఎ- ఆజం సినిమా చూడని వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ సినిమా గురించి వినని వారు ఉండరు. దిలీప్ కుమార్ విశ్వరూపం చూపిన సినిమాల్లో అతి ముఖ్యమైనది. డైలాగుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే, బాగా ఒత్తి పలికే ప్రత్యేకత దిలీప్ కుమార్. అందులో బాగా ఫేమస్ అయిన ఒక డైలాగ్ చూద్దాం
“Taqdeerein badal jaati hain, zamana badal jaata hai, mulkon ki taarikh badal jaati hai, shahenshah badal jaate hain, magar iss badalti hui duniya mein mohabbat jis insaan ka daaman thaam leti hai, woh insaan nahi badalta”
(విధి రాతలు మారిపోతాయి, కాలం మారిపోతుంది, రాజ్యాల చరిత్ర మారిపోతుంది, రాజులు మారిపోతారు, కానీ ఇలా మారిపోతున్న కాలంలో ఎవరినైతే ప్రేమ ఒడిసి పట్టుకుంటుందో అటువంటి వ్యక్తి ఎప్పటికీ మారిపోడు)
దిలీప్ కుమార్ అంటే మెథడ్ యాక్టింగ్ (Method Acting) కు పెట్టింది పేరు. (మెథడ్ యాక్టింగ్ అంటే ఒక పద్ధతిగా ఎన్నో రిహార్సల్స్ చేసి పాత్రను, దాని స్వభావాన్ని అర్థం చేసుకొని ఆ పాత్ర లో లీనమై, ఒక విధంగా చెప్పాలంటే ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర యొక్క భావోద్వేగాలను, అంతరంగాన్ని తెరమీద ఆవిష్కరింప చేయడమే) ఈ పాత్రకు ఆద్యుడు రష్యన్ నటుడు దర్శకుడు “కాన్స్ టాంటిన్ స్టానిస్లవ్ స్కీ” ఈ తరహా నటనను వంట పట్టించుకుని తెరమీద తనదైన డైలాగ్ డెలివరీతో రక్తి కట్టించిన ఒక ప్రత్యేక తరహా నటుడు దిలీప్ కుమార్.
ఇది దిలీప్ సాబ్ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. తన 22 సంవత్సరాల సైరాబానును ఆయన పెళ్లి చేసుకున్నాడు తర్వాత హైదరాబాద్ కు చెందిన మరొకరిని కూడ వివాహ మాడిని అది ఎక్కువ కాలం నిలవలేదు. చివర ఆయన సైరాబానుతోనే ఉండిపోయారు.
1988 లో దిలీప్ పెషావర్ లో తన పూర్వీకుల ఇంటిని సందర్శించారు. ఇది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆయన తొలి పర్యటన. తన పూర్వీకుల ఇంటి ముందు నిలబడి ఆయన పరధ్యానంలోకి వెళ్లిపోయారు. తాను కొద్దిసేపు ఇంట్లో ఏకాంతంగా ఉండాలనుకుంటున్నట్లు అభిమానులకు చెప్పి లోపలికి వెళ్లాడు. తర్వాత బటయకు వచ్చి, తాను నాయనమ్మ పలిస్తున్నట్లనిపించిందని, ఆమె తనని చిన్నపుడు ఎలా ఊయలలో నిద్రపుచ్చిందో గుర్తుచేసుకుని వచ్చానని చెప్పారు. దిలీప్ కుమార్ వల్ల పాక్ , భారత్ ప్రజలు బాగా దగ్గిరయ్యారని పాక్ కు చెందిన “ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ రాసింది.
దిలీప్ కుమార్ తన జీవిత కాలంలో అందుకున్న అవార్డులు గురించి రాయాలంటే చాలా కష్టం. ఎక్కువ అవార్డు సాధించిన నటుడిగా ఆయన పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దిలీప్ కుమార్ కి కాకుండా ఎవరికి వస్తుంది. ఏ అవార్డు కైనా సరే హుందాతనాన్ని, గౌరవాన్ని కలిగించిన ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా చిన్నదే అనిపిస్తుంది. భారతదేశపు రెండవ ఉన్నత పౌర అవార్డు పద్మవిభూషణ్ కూడా అయన అందుకున్నారు.
ఆయన అవార్డుల కే గౌరవం ఇచ్చాడు. ఆయన కు గౌరవం ఇవ్వగలిగే అవార్డు ” భారతరత్న” అని అభిమానులు, ప్రేక్షకులు భావించడం సమంజసమే!.
బాక్సాఫీస్ రికార్డులనే తీసుకుంటే, భారతదేశంలోని ఏ నటుడూ ఇప్పటీకి ఆయన దరిదాపుల్లో లేరు. ఆయన నటించిన 80 శాతం సినిమాలు బాక్సాఫీస్ హిట్. యాభైశాతం సూపర్ డూపర్ హిట్స్.
పాకిస్తాన్ కు చెందిన అత్యున్నత అవార్డ్ నిషాన్ ఇ ఇంతియాజ్ (Nishan-e-Imtiaz) అందుకున్న ఏకైక భారతీయ నటుడీయనే. అయితే, ఆయన ఈ గౌరవాన్ని తిరస్కరించకపోవడం పట్ల శివసేన పార్టీ నేత బాల్ ధాకరే అభ్యంతరం తెలిపారు. ఇది ఆయన దేశభక్తిని శంకించే విషయంఅని విమర్శించారు. అయితే, ఆయనపుడు ప్రధాని వాజ్ పేయిని కలుసుకుని ఒక అరగంట సేపు మాట్లాడారు. అక్కడ ఏమ్మాట్లాడారో తెలియదు గాని, 1998లో పాకిస్తాన్ ఇచ్చిన ఈ గౌరవాన్ని తాను తిరస్కరించడం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. దిలీప్ కుమార్ దేశభక్తిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని ప్రధాని వాజ్ పేయి కూడా ఆయన మద్దతుగా నిలిచారు.